అయ్యన్న ఎప్పటికీ మాజీగానేనట !

మాజీ మంత్రి చింతకాయలా అయ్యన్నపాత్రుడు పేరుకే ఎమ్మెల్యే మంత్రిగా ఇంతకాలం ఉన్నారని, ఆయనను మరోసారి గెలిపిస్తే ఆయన వట్టి ఎమ్మెల్యేగానే ఉంటారని ఆయన ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అంటున్నారు. అయ్యన్న కుమారుడే అసలైన ఎమ్మెల్యే అవుతారని, ఆయన అరాచకాలతో నర్శీపట్నం మరోసారి ఇబ్బంది పడుతుందని ఆయన అంటున్నారు.

ఉమా శంకర్ అయ్యన్న పాత్రుడి మీద చేస్తున్న ఈ విమర్శలు ఆలోచింపచేస్తున్నాయి. అయ్యన్నను కలవాలంటే ముందు ఆయన సతీమణి అనుమతి కావాలి. ఆయన ఇద్దరు కొడుకుల పర్మిషన్ కావాలి. ఇలా ఒకే ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేల‌ దయ ఉంటేనే తప్ప ఎవరికీ ఏ పనీ జరగదు అని ఉమా శంకర్ తేల్చేశారు.

అయ్యన్నను అడ్డం పెట్టుకుని కుటుంబం అంతా రాజ్యం చేస్తుందని అలాంటి పాలన కావాలా అని ఆయన ఓటర్లను నిగ్గదీసి అడుగుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే గానే కాదు మంత్రిగా ఆరు సార్లు పనిచేసినా తన సొంత బాగు చూసుకున్నారే తప్ప నర్శీపట్నానికి చేసినది ఏమిటి అని ప్రశ్నించారు.

ప్రశాంతంగా ఉన్న నర్శీపట్నంలో అరాచక పాలన కావాలంటేనే అయ్యన్నకు ఓటు వేయమని ఆయన కోరుతున్నారు. నర్శీపట్నంలో ఒకే కుటుంబం ఇన్ని దశాబ్దాలుగా రాజ్యం చేయడం వల్ల ఒరిగిందేమిటి అని ప్రశ్నిస్తున్నారు. తమకే అధికారం సొంతం అన్న భావన వారిలో పెరిగింది తప్ప మరేమీ లేదని అన్నారు. తాను అయ్యన్న కోటను బద్ధలు కొట్టానని అభివృద్ధికి బాటలు వేశాను అని ఉమా శంకర్ గణేష్ చెబుతున్నారు. అయ్యన్న మీద జోరుగా విమర్శలు చేస్తున్న గణేష్ తనదే విజయం అని ధీమాగా ఉన్నారు. అయ్యన్నకి ఇవే చివరి ఎన్నికలు ఆయన మాజీగానే ఉంటారు అని జోస్యం చెబుతున్నారు.