ఆయనను చేర్చుకున్నారే.. సిగ్గు, భయం ఉన్నాయా?

ముసుగు వేసుకుని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తే తాత్కాలికంగా వారు విజయం సాధించవచ్చు గాక. కానీ ఏదో ఒక నాటికి ఖచ్చితంగా ఆ ముసుగు తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నం విషయంలోనూ అదే జరుగుతోంది. ఆ ప్రయత్నం వెనుక తెలుగుదేశం కుట్ర ఉన్నదనే ప్రచారాలను ఇప్పుడు నమ్మవలసి వస్తోంది.

విశాఖపట్నం ఎయిర్పోర్ట్‌లో శీను అనే యువకుడు కోడి కత్తితో జగన్  హత్యకు ప్రయత్నించినప్పుడు.. అందరి అనుమానాలు తెలుగుదేశం మీదికి మళ్లాయి. ఆ శీను అనే కుర్రవాడికి తెలుగుదేశంతో ఆ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నట్లుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అనేక రుజువులు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కాదు కూడదని వాదిస్తూ తెలుగుదేశానికి సంబంధమే లేదని ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడారు. తీరా ఇప్పుడు కోడి కత్తి శీను ను తెలుగుదేశం లో చేర్చుకుని సిగ్గు లేకుండా ఆయనతో ప్రచారం చేయించుకుంటున్నారు. జగన్ మీద బురద చల్లడానికి వాడుకుంటున్నారు.

కోడి కత్తి శీను తాజాగా ముమ్మడివరం కూటమి అభ్యర్థి తెలుగుదేశం నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇటీవల అతను చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ మీద జరిగిన హత్యాయత్నం గురించి తెలుగుదేశం పార్టీ ఏ స్క్రిప్టునైతే వినిపిస్తూ వచ్చిందో.. ఇప్పుడు కోడి కత్తి శీను మళ్ళీ అదే స్క్రిప్టును రిపీట్ చేస్తున్నారు. ‘జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి తాను చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గవలసి వచ్చింది’ అంటూ పాపం విలపిస్తున్నారు.

జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని కూడా కోడి కత్తి శీను చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా తెలుగుదేశం స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందన్నది ప్రజలు అభిప్రాయంగా ఉంటుంది.

ఈ ఎన్నికలలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని తొలుత అనుకున్నానని, కానీ పరిస్థితిలు అనుకూలించకపోవడం వలన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని కోడి కత్తి శీను చెబుతున్నారు. మాటలు ఎలా ఉన్నప్పటికీ శీను వెనుక నుంచి తెలుగుదేశం పార్టీ నే సమస్త వ్యవహారాలను నడిపించిందనే సంగతి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ముసుగులు తొలగించేసి శీనుని ఏకంగా ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్న పార్టీ వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.