ప‌వ‌న్ ప్యాకేజీ వేరు.. చిరంజీవి ప్యాకేజ్ వేరా!

త‌ను ఏపీలో నివ‌సించ‌డం లేద‌ని, ఏపీ రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, త‌ను ప్ర‌స్తుతం దృష్టంతా సినిమాల మీదే పెట్టిన‌ట్టుగా కొన్నాళ్ల కింద‌ట కూడా ప్ర‌క‌టించారు మెగాస్టార్ చిరంజీవి. రాజ‌కీయాల్లోకి అంటూ వ‌చ్చి, పార్టీని పెట్టి, అతి తొంద‌ర‌లోనే దాన్ని విలీనం బాట ప‌ట్టించి, విలీనానికి ప్ర‌తిఫ‌లంగా కేంద్ర‌మంత్రి ప‌ద‌వి, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని పొంది.. ఆ హోదాలు పోయిన త‌ర్వాత రాజ‌కీయాల ఊసు ఎత్త‌క సినిమాల్లో మ‌ళ్లీ త‌న అవ‌కాశాల‌ను చూసుకున్నారు చిరంజీవి! ఒక‌సారి ప్ర‌జాజీవితంలోకి వ‌చ్చి అలా వైదొల‌గ‌డం కూడా అవ‌మానమే!

కానీ చిరంజీవి విష‌యంలో ప్రేక్ష‌కులు కూడా ఆ రాజ‌కీయ జీవితం ఆయ‌న‌కో పీడ‌క‌ల అన్న‌ట్టుగా స‌ముదాయించుకున్నారు. మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చే ఆయ‌న లాహే లాహే అంటూ చిందులేస్తే.. చ‌ప్ప‌ట్లు కొట్టారు కూడా! అయితే.. ఆల్రెడీ ఒక సారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కేవ‌లం అవ‌కాశ‌వాది అనిపించుకున్న చిరంజీవి మ‌ళ్లీ ఇప్పుడు రాజ‌కీయాన్ని ఒళ్లంతా ప‌ట్టించుకుంటున్నారు! దీంతో.. పాత, కొత్త వ్య‌వ‌హారాల‌న్నీ మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డంలో వింత లేదు!

రాజ‌కీయ కామెంట్లు చేయ‌డం మొద‌లుపెడితే, ఎవ్వ‌రి వ్య‌వహారం అయినా ర‌చ్చ‌బండ‌కు రానే వ‌స్తోంది! ఇప్పుడు ఇంత‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజ్ లో భాగంగానే చిరంజీవి కూడా స్పందిస్తున్నారా లేదా చిరంజీవి ప్యాకేజీ వేరా.. అనేది జ‌రుగుతున్న చ‌ర్చ‌!

సీఎం ర‌మేష్ మీద చిరంజీవికి ఊరికే ప్రేమ పొంగిపోతుందంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు! ఈ విష‌యం గురించి ఏబీఎన్ ఆర్కే ఓపెన్ హార్ట్ లో గ‌తంలో సీఎం ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌లు కూడా తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాట‌కు ఆస్కార్ వ‌చ్చిన సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ ఢిల్లీలో ఉండ‌గా.. త‌నే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స‌మాచారం ఇచ్చి వారి స‌మావేశం ఏర్పాటు చేసి, చ‌ర‌ణ్ కు అభినంద‌న‌లు అందేలా చేశానంటూ ఆ షోలో సీఎం ర‌మేష్ చెప్పుకున్నాడు. సీఎం ర‌మేష్ చాక‌చ‌క్యం ప‌ట్ల ఆర్కేనే అందులో కితాబులిస్తాడు! అలా అప్ప‌టి నుంచి చేసుకున్న లాబీయింగ్ ఫ‌లితంగానే ఇప్పుడు ర‌మేష్ కోసం చిరంజీవి మ‌ద్ద‌తు ప‌లికారేమో!

అయితే.. చిరంజీవికి ఇటీవ‌లి ప‌ద్మవిభూష‌ణ్ ద‌క్క‌డం వెనుక కూడా ఇలాంటి అవ‌స‌రాలే ఉంటాయ‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి స‌హ‌జంగానే. మ‌ల‌యాళీ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టీ పేరును ప‌ద్మ అవార్డు కోసం కేర‌ళ ప్ర‌భుత్వం గ‌త కొన్ని ప‌ర్యాయాలుగా సిఫార్సు చేస్తున్నా కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌! క‌మ్యూనిస్టు పార్టీ సానుభూతి ప‌రుడు కావ‌డంతో మ‌మ్ముట్టీకి కేంద్రం అవార్డును ఇవ్వ‌డం లేదు, తాము చెప్పిన‌ట్టుగా ఆడ‌తార‌నే లెక్క‌ల‌తోనే చిరంజీవి, ర‌జ‌నీకాంత్ ల‌కు ప‌ద్మల మీద ప‌ద్మలు ఇస్తోంద‌నే అభిప్రాయాల‌కు కూడా ఎన్నిక‌ల వేళ బ‌లం చేకూరుతూ ఉంది!

తెలుగుదేశం పార్టీతో పొత్తులో ప‌వ‌న్ ప్యాకేజీలో చిరంజీవి భాగ‌మా, లేక‌ చిరంజీవిది వేరే ప్యాకేజీనా అనే చ‌ర్చ‌లు కూడా జోరుగా సాగుతున్నాయి!