మే నెల.. సినిమాలు తక్కువ, సింగిల్స్ ఎక్కువ

ఈ సమ్మర్ వృధా అయిపోతోందంటూ ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. స్టార్ హీరోలు ఎవ్వరూ మే నెలలో సందడి చేయడం లేదు. వస్తాడనుకున్న ప్రభాస్ కూడా రావడం లేదు. దీంతో వేసవి బాక్సాఫీస్ బోసిపోయింది. అయితే ఆ లోటును కూసింత భర్తీ చేస్తూ, బడా సినిమాల సింగిల్స్ ను మే నెలలో విడుదల చేయబోతున్నారు.

పుష్ప-2 నుంచి సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేశారు. మొదటి లిరికల్ వీడియోను మే 1న కార్మికుల దినోత్సవం కానుకగా విడుదల చేయబోతున్నారు. సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్ సూపర్ హిట్టనే సంగతి తెలిసిందే. ఇక సుక్కూ-దేవి-బన్నీ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్. అందుకే పుష్ప-2 సాంగ్స్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

మే నెలలో పుష్ప-2 ఫస్ట్ సాంగ్ తో పాటు ఇంకా చాలా హంగామా ఉంది. ప్రభాస్ కల్కి సినిమా హంగామా కూడా ఇదే నెలలో షురూ కానుంది. దాదాపు పూర్తయిన ఈ సినిమా నుంచి పాటల్ని ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నారు. ఆ కార్యక్రమం మే నెల్లోనే ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా పాటల ప్రచారం కూడా మే నెల నుంచే మొదలు పెట్టబోతున్నారు. వీటితో పాటు డబుల్ ఇస్మార్ట్, భారతీయుడు-2 లాంటి క్రేజీ సినిమాల పాటలు కూడా మే నెలలోనే విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలేవీ మే నెలలో థియేటర్లలోకి రావు, కానీ ఇలా పాటలతో వేసవిలో సందడి చేయబోతున్నాయి.