వానపాము కూడా లేచి ఆడుతోంది!

అన్ని పాములూ ఆడుతున్నాయని వానపాము కూడా లేచి ఆడిందని సామెత! ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు, తానే స్వయంగా చంపానని ఒప్పుకుని కూడా.. స్వేచ్ఛగా బయట తిరుగుతున్న దస్తగిరి మాటలు గమనిస్తే ఈ సామెత గుర్తుకు వస్తోంది.

కడప జిల్లా పులివెందులలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జై భీమ్ భారత్ అనే పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్టుగా చాలా కాలంగా చెప్పుకుంటున్నారు. అయితే ఆయన మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగుతారని సమాచారం వచ్చిందిట.. అందుకే ఆయన తన నామినేషన్ వ్యవహారాన్ని గురువారానికి మార్చుకున్నారట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసే రోజునే ఆయన కూడా వేస్తారట. అప్పుడైతే రాళ్ల దాడి జరగకుండా ఉంటుందిట.

జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి అందరూ తలా ఒక ఆరోపణ చేస్తూ ఉండే సరికి.. తానేమీ మాట్లాడకపోతే బాగుండదని అనుకున్నారో ఏమో గానీ.. దస్తగిరి ఈ రకమైన పితూరీలు చేస్తున్నారు. వివేకానందరెడ్డిని స్వయంగా గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి అయినప్పటికీ.. అప్రూవర్ గా మారాననే ఒక ముసుగు తగిలించుకుని బెయిలు మీద స్వేచ్ఛగా బయట తిరుగుతున్న వ్యక్తి దస్తగిరి.

అతడలా బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, వివేకా కూతురు సునీత మద్దతు పుష్కలంగా ఉన్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బెయిలు మీద బయట ఉంటూ.. రౌడీయిజంతో దందాలు చేసుకుంటూ దస్తగిరి చెలరేగుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా తనకు ప్రాణహాని అని చెప్పుకుంటూ పోలీసు ప్రొటెక్షన్ కూడా పొందాడు.

అలాంటి దస్తగిరి ఇప్పుడు తాను నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని వైసీపీ చూస్తోందని కామెడీ చేస్తున్నారు. అక్కడికేదో దస్తగిరి నామినేషన్ వేస్తే.. జగన్ ఓడిపోతాడని భయపడుతున్నట్టుగా ఆయన బిల్డప్ ఉంది. పులివెందులలో జగన్, అవినాష్ తనను ఇబ్బందులు పెడుతున్నారని కూడా దస్తగిరి అంటున్నాడు. అయినా.. ఏదో సినిమా డైలాగులాగా.. దస్తగిరి మీద రాళ్ల దాడికి దిగినా, అతడు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి పరువు తక్కువ అవుతుందే తప్ప.. మరోటి కాదు.

కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా దస్తగిరి తన భద్రత పెరిగేలా చేసుకోగలిగారు. గతంలో కంటె ఇప్పుడు ఆయనకు పోలీసు శాఖ అదనపు భద్రతను కల్పించడం విశేషం. హతవిధీ!