ఆమె ఖమ్మం మీద మోజు చంపుకోలేకపోతోంది

పార్లమెంటు ఎన్నికలు గానీ, అసెంబ్లీ ఎన్నికలు గానీ వస్తే కొందరు రాజకీయ నాయకులు కొన్ని నియోజకవర్గాల మీద మోజు పడుతుంటారు. అక్కడి నుంచే పోటీ చేస్తామని చెబుతుంటారు. ఆ నియోజకవర్గాల మీదనే మోజు పడటానికి కారణం అక్కడి నుంచి ఒకసారో రెండుసార్లో గెలిచి ఉండటం. ఆ నియోజకవర్గం మీద పట్టు ఉందని భావించడం. ఇలా కొన్ని కారణాలు ఉంటాయి.

కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పేరు తెలియని వారుండరు. పోటీషియన్స్ లో చాలా పాపులర్. డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. ఆమెకు ఖమ్మం నుంచి పోటీ చేయాలని చాలా కోరికగా ఉంది. ఆమె అక్కడ స్థానికురాలు కాకపోయినా గతంలో రెండుసార్లు అక్కడి నుంచి గెలిచింది. కేంద్రంలో మంత్రి పదవి కూడా చేసింది. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆమె మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసింది.

కానీ పీసీసీ సోనియా గాంధీని పోటీ చేయాలని కోరింది. తీర్మానం కూడా చేసి ఢిల్లీకి పంపింది. ఆమె పోటీ చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమె తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి స్వస్తి చెప్పానని, అనారోగ్య కారణాలవల్ల రాజ్యసభకు వెళతానని చెప్పి ఆ విధంగానే చేసింది. అప్పుడే రేణుకా చౌదరి, సోనియా పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానని చెప్పింది. పోటీ చేసే హక్కు తనకే ఉందని చెప్పింది. తాను పోటీ చేస్తానంటే కాదనే దమ్ము ఎవరికి ఉందని ప్రశ్నించింది. 

కానీ ఆమెకు టిక్కెట్ ఇచ్చే విషయంలో నాయకులు మల్లగుల్లాలు పడ్డారు. కొత్తవారిని నిలబెడితే బాగుటుందని అనుకొని ఆమెకు టిక్కెట్ నిరాకరించారు. అధిష్టానం ఆమెను కూడా రాజ్యసభకు పంపాలని నిర్ణయించి ఆ పని చేసింది. రేణుకా చౌదరి 1999, 2004లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలు కావడంతో ఆమెను పార్టీ హైకమాండ్ రాజ్యసభకు పంపింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.

అక్కడ వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మరోసారి నామా నాగేశ్వరరావు పై పోటీ చేసి ఓడిపోయింది. ఇదీ ఆమె చరిత్ర. ఈసారి ఎన్నికల్లో ఖమ్మం టిక్కెట్ ఎవరికి ఇవ్వాలో ఇప్పటివరకు డిసైడ్ కాలేదు. దీంతో పాటు హైదరాబాద్ అండ్ కరీంనగర్ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి.

ఖమ్మం అభ్యర్థి డిసైడ్ కాకపోవడంతో హైకమాండ్ ఆదేశిస్తే తాను పోటీకి రెడీగా ఉన్నానని రేణుకా చౌదరి ప్రకటించింది. ఆమె రాజ్యసభకు వెళ్లి ఎన్నో రోజులు కాలేదు. కానీ ఖమ్మం నుంచి పోటీ చేయాలనే కోరికను మాత్రం చంపుకోలేదు. ఎవరూ డిసైడ్ కాలేకపోతే తనకే అవకాశం ఇస్తారని ఆశ పడుతున్నట్లుగా ఉంది. కానీ ఆమె కోరిక నెరవేరకపోవచ్చు.