రూ.5704 కోట్లు.. అభ్యర్థుల్లో ఇతడే సౌండ్ పార్టీ

నామినేషన్లలో భాగంగా అభ్యర్థులంతా ఆస్తులు-అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే కార్యక్రమమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తారు.

పోటీ చేసిన ప్రతిసారి వేల కోట్ల ఆస్తుల్ని అఫిడవిట్ లో చూపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అఫిడవిట్ లోనే అధికారికంగా అంత ఆస్తి చూపించారంటే, ఇక అనధికరంగా ఎంత ఉంటుందో సామాన్యులు ఊహించలేరు. ఈసారి కూడా కొండా తన ఆస్తిని (చరాస్తితో కలిపి) 4564 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. 

అయితే అంతా అనుకుంటున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఇతడు కాదు. కొండాను క్రాస్ చేశారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఈయన అస్తుల విలువ అక్షరాలా 5704 కోట్ల రూపాయలు.

గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రశేఖర్ ఓ ఎన్నారై. ఈయన ఆస్తులు ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. పెన్సిల్వేనియాలో మెడిసిన్ లో ఎండీ చేశారు. ఈయన భార్య కూడా డాక్టర్. పెమ్మసానికి యూఎస్ఏలో వ్యాపారాలున్నాయి.

ఈయనకు ఖరీదన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుతో పాటు.. రెండు బెంజ్ కార్లు, ఒక టెస్లా కూడా ఉంది. టెక్సాస్, హైదరాబాద్ లో ఈయనకు భారీగా స్థిరాస్తులున్నాయి. యూఎస్ఏలోని జేపీ మోర్గాన్ బ్యాంకులో ఈయనకు భారీగా డిపాజిట్లున్నాయి. ఈయన భార్య వద్ద రెండున్నర కేజీల బంగారం ఉంది.

వీటన్నింటినీ ఈయన తన అఫిడవిట్ లో చూపించారు. వీటితో పాటు తనకు 1038 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నట్టు వెల్లడించారు చంద్రశేఖర్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడు ఇతడే