తెలంగాణ సీఎం రేంజ్‌ను పెంచేసిన హైక‌మాండ్‌

కాంగ్రెసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ పెరిగిపోయింది. హైక‌మాండ్‌కు ఆయ‌న చాలా ముఖ్య‌మైన నాయ‌కుడిగా మారాడు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న కీల‌క భూమిక పోషిస్తున్నాడు. ఆయ‌న టీడీపీలో ఉన్న‌ప్పుడు కూడా ఇంత ప్రాధాన్యం ల‌భించివుండ‌క‌పోవ‌చ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి రేంజ్‌ను అమాంతం పెంచేసింది.

ముఖ్యంగా రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టిలో ఆయ‌న స‌మ‌ర్థుడైన లీడ‌ర్‌గా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీని ప‌దేళ్ల త‌రువాత కేసీఆర్‌కు ఎదురొడ్డి అధికారంలోకి తెచ్చాడ‌న్న అభిమానం ఉంది.  రేవంత్ సీఎం అయ్యాక  సీనియ‌ర్లు సైతం స‌మ‌ర్థిస్తూ..  కేసీఆర్‌కు స‌రైన మొగుడు రేవంత్ రెడ్డే అంటున్నారు.

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డితో పాటు నాయ‌కులంతా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఇక హైక‌మాండ్ ఆయ‌న్ని నేష‌న‌ల్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా డిసైడ్ చేసింది. ఈ విష‌యాన్ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు తెలియ‌జేసింది. ఆయ‌న తెలంగాణ‌లో మాత్ర‌మే కాకుండా ఏపీతో పాటు దేశ‌మంతా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటాడు. ఆల్రెడీ ఏపీలో ప్ర‌చారం చేశాడు. మ‌రికొన్నిసార్లు ప్ర‌చారం చేస్తాడు.

మొన్న కేర‌ళ‌లో ప్ర‌చారం చేశాడు. పొరుగున ఉన్న క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌, బిహార్‌లోనూ ప్ర‌చారం చేస్తాడు. కేసీఆర్ మాదిరిగా ధాటిగా, పంచ్‌ల‌తో, అవ‌స‌ర‌మైతే ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడ‌టం రేవంత్ ప్ర‌త్యేక‌త. అందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కేసీఆర్‌కు స‌రైన మొగుడు రేవంత్ రెడ్డే అన్నాడు. కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీకి అటెండ్ అవ‌లేదు. వెళితే మాత్రం రేవంత్ ఓ రేంజ్‌లో ఆడుకుంటాడు.

టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్పుడు ఆయ‌న‌కు సీనియ‌ర్ నాయ‌కుల నుంచి తీవ్రంగా వ్య‌తిరేక‌త ఎదురైంది. కాంగ్రెసులో చేర‌గానే రేవంత్ య‌మ దూకుడుగా వ్య‌వ‌హ‌రించాడు. అది సీనియ‌ర్ల‌కు న‌చ్చ‌లేదు. అంత దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుడు అప్ప‌టివ‌ర‌కు తెలంగాణ కాంగ్రెసులో ఎవ‌రూ లేరు.

పార్టీ చాలా స్త‌బ్దంగా ఉండేది. కేసీఆర్ మీద ఎవ‌రూ ఘాటు విమ‌ర్శ‌లు చేసేవారు కాదు. ఒకవేళ చేసినా వాటిల్లో ఉప్పు, కారం ఉండ‌క‌పోయేది. అందుకే కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకునేవాడు కాదు. కాంగ్రెసు నాయ‌కుల‌ను లెక్క‌చేసేవాడు కాదు. అసెంబ్లీలోనూ కేసీఆర్‌ను ఎదుర్కోలేక‌పోయేవారు. జానారెడ్డిని మ‌రీ తేలిగ్గా తీసుకునేవాడు కేసీఆర్‌.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెసులోకి రేవంత్ రెడ్డి రాక కాంగ్రెసులో జ‌వ‌స‌త్వాలు నింపింద‌నే చెప్పుకోవాలి. అధిష్టానం దృష్టిలో ప‌డ్డాడు. పార్టీలో జూనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ అంచెలంచెలుగా ఎదిగాడు. పార్టీలో చేరిన కొంత కాలానికే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు.

ఆ త‌రువాత పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాడు. రేవంత్ రెడ్డి ఇలా ఎద‌గ‌డం కొంద‌రు సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌లేదు. ఆయ‌న నిర్వ‌హించిన కొన్ని స‌భ‌ల‌కు, కార్య‌క్ర‌మాల‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేశారు. క‌థ ఇలా సాగుతుండ‌గానే అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. త‌రువాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే.