జగన్ సీఎం గా మరోసారి... ప్రమాణం అక్కడే !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవసారి వరసగా అధికారంలోకి రానున్నారు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బంపర్ మెజారిటీతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వారు చెబుతున్నారు. వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం ఎక్కడ నుంచి ప్రమాణం చేస్తారు అన్న దాని మీద సంచలన ప్రకటన చేశారు.

ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు జగన్ ప్రభుత్వాన్నిబలంగా  కోరుకుంటున్నారని అన్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చిన తరువాత విశాఖలోనే జగన్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం చేస్తారు అని ఆయన చెప్పారు.

విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. జగన్ సీఎం అయ్యాకనే విశాఖ అభివృద్ధి సాధ్యపడిందని అన్నారు. రెండవసారి తమ ప్రభుత్వం రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని ఆయన అన్నారు. విశాఖ విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ తప్పకుండా నెరవేరుస్తామని ఆయన చెప్పారు.

టీడీపీకి అమరావతి మాత్రమే ముఖ్యమని, అక్కడ కేవలం టీడీపీ వారికోసమే ఆ ప్రాంతాన్ని తెర పైకి తీసుకుని వచ్చారు అని బొత్స విమర్శించారు. విశాఖ రాజధానిగా చేస్తామని జగన్ ఎప్పుడో ప్రకటించారని, అవన్నీ నెరవేరడానికి రెండవసారి జగన్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రాకు తలమానికం అని ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ లేదు అని ఆ పార్టీ పెద్దలతో ప్రకటించగలదా అని బొత్స సవాల్ చేశారు.. మభ్యపెట్టే మాటలను ప్రజలు నమ్మరని, అందరికీ అన్నీ తెలుసు అని ఆయన అంటున్నారు. బొత్స అయితే నామినేషన్ల పర్వం తొలిరోజునే జగన్ ప్రమాణ స్వీకారం ఎక్కడో చెప్పేశారు. దాంతో ఇదిపుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.