గాజు గ్లాస్ గుర్తుపై ఊపిరి పీల్చుకున్న జ‌న‌సేన‌

గాజు గ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో జ‌న‌సేన‌కు ఊర‌ట ద‌క్కింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లోనూ అదే గుర్తుపై పోటీ చేసేందుకు జ‌న‌సేన విస్తృతంగా ప్ర‌చారం చేసుకుంటోంది. అయితే జ‌న‌సేన గుర్తు గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబ‌ల్‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. దీంతో జ‌న‌సేన‌లో అల‌జ‌డి మొదలైంది. మ‌రోవైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో జ‌న‌సేన లీగ‌ల్ టీమ్ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

మ‌రోవైపు ఫ్రీ సింబ‌ల్ కేట‌గిరీలో చేర్చిన గాజు గ్లాస్‌ను త‌మ‌కు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీంతో గాజు గ్లాస్ గుర్తు వ్య‌వ‌హారం న్యాయ స్థానానికి చేరిన‌ట్టైంది. ఏమ‌వుతుందోన‌ని జ‌న‌సేన శ్రేణుల్లో అంత‌కంత‌కూ ఆందోళ‌న పెరుగుతోంది. ప‌ది రోజుల క్రితం ఇరుప‌క్షాల సుదీర్ఘ వాద‌న‌లు ఏపీ హైకోర్టులో ముగిసిన సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వ్‌లో ఉన్న తీర్పును ఇవాళ వెలువ‌రించారు.

జ‌న‌సేన‌కే గాజు గ్లాస్ గుర్తు ద‌క్కుతుంద‌ని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో హ‌మ్మ‌య్య అని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆనందానికి లోన‌య్యారు. అయితే హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవ‌కాశం వుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఏది ఏమైనా ఎన్నిక‌ల‌కు కేవ‌లం 27 రోజుల స‌మ‌యం వుండ‌గా, గుర్తుపై హైకోర్టులో ఊర‌ట ల‌భించ‌డం జ‌న‌సేన‌కు విజ‌యంగా చెప్పొచ్చు.