బీజేపీ, టీడీపీ సీట్ల మార్పు .. నివురుగ‌ప్పిన నిప్పు!

టీడీపీ, బీజేపీ మ‌ధ్య సీట్ల మార్పు వుంటుంద‌నే చ‌ర్చ రెండు రోజుల క్రితం విస్తృతంగా సాగింది. అయితే కూట‌మిలో సీట్ల మార్పు అంశం నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి ఎమ్మెల్యే, అలాగే అదే జిల్లా న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థి, తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల మార్పుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

టీడీపీలో ర‌ఘురామ‌కృష్ణంరాజు చేరిక‌తో కూట‌మిలో ర‌గ‌డ మొద‌లైంది. ర‌ఘురామ‌కృష్ణంరాజు తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌ర‌సాపురం పార్ల‌మెంట్ స్థానాన్ని ఆయ‌న కోరుకుంటున్నారు. ఆ సీటు బీజేపీకి త‌న‌కు ఇస్తుంద‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ బీజేపీలో క‌నీసం స‌భ్యుడైన కాని ర‌ఘురామ‌కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. బీజేపీలో 30 ఏళ్లుగా క్రియాశీల‌క కార్య‌క‌ర్త అయిన భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌కు న‌ర‌సాపురం సీటును జాతీయ నాయ‌క‌త్వం ఖరారు చేసింది.

దీంతో ర‌ఘురామ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను చూసుకోవాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై పడింది. ర‌ఘురామ‌ను పార్టీలో చేర్చుకుని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. దీంతో టీడీపీకి కంచుకోట అయిన ఉండిలో ర‌చ్చ మొద‌లైంది. ఇప్ప‌టికే త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ‌రామ‌రాజు ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బరిలో నిలిచారు. చంద్ర‌బాబు మాట్లాడ్దామ‌ని ర‌మ్మ‌ని చంద్ర‌బాబు ఆహ్వానించినా శివ‌రామ‌రాజు వెళ్ల‌లేదు. ఈ స‌మ‌స్య స‌ర్దుబాటు కాకుండానే, కొత్త‌ది పుట్టుకొచ్చింది.

ర‌ఘురామ‌కు ఉండి టికెట్ ఇస్తే, రామ‌రాజు ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అలాగే అన‌ప‌ర్తి సీటును బీజేపీకి కేటాయించ‌డంతో, ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన టీడీపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి న్యాయం కోస‌మంటూ రోడ్డెక్కారు. ఈ సీటు బీజేపీకి కాకుండా టీడీపీకి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అలాగే న‌ర‌సాపురం సీటును టీడీపీకి ఇస్తే, ఏలూరు లోక్‌స‌భ స్థానాన్ని బీజేపీకి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఉండి స్థానంలో న‌ర‌సాపురం బీజేపీ అభ్య‌ర్థి శ్రీ‌నివాస్ వ‌ర్మ‌ను పోటీ చేయిస్తామ‌ని చంద్ర‌బాబు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

ఈ మార్పుచేర్పుల‌పై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఏం చెబుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ఉండిలో బీజేపీ అభ్య‌ర్థిని పోటీ చేయించినా సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పోటీ అనివార్యంగా క‌నిపిస్తోంది. ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎఫెక్ట్‌తో సీట్ల‌లో మార్పుచేర్పులు చేసుకోవాల్సి వ‌స్తోంది. అయితే ఇప్ప‌టికే న‌రసాపురం అభ్య‌ర్థి శ్రీ‌నివాస్ వ‌ర్మ‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్చేది లేద‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ జాతీయ నాయ‌కుడు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి కూట‌మిలో నివురు గ‌ప్పిన నిప్పులా వుంది. రానున్న రోజుల్లో ఏమ‌వుతుందో చూడాలి.