రూ.10 వేల వ‌లకు చిక్క‌ని వ‌లంటీర్లు!

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే నేరుగా పాల‌న తీసుకెళ్లాల‌నే ల‌క్ష్యంతో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చీరాగానే 1.25 ల‌క్ష‌ల రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌ను సృష్టించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, అందులో ప‌ని చేసే ఉద్యోగుల‌కు మ‌ధ్య వార‌ధిగా ప‌ని చేసేందుకు వ‌లంటీర్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక వ‌లంటీర్ చొప్పున ప్ర‌భుత్వం నియ‌మించింది.

ఈ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై చంద్ర‌బాబునాయుడు నీచ కామెంట్స్ చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగుల‌ని వెట‌క‌రించారు. అలాగే మ‌హిళ‌లు ఒంట‌రిగా ఇళ్ల వ‌ద్ద వుంటే వ‌లంటీర్లు వెళ్లి త‌లుపులు త‌డుతున్నార‌ని త‌న స్థాయిని మ‌రిచి దుర్మార్గ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన కామెంట్స్ అన్ని హ‌ద్దుల్ని దాటాయి. మ‌హిళ‌ల‌ను ర‌వాణా చేస్తున్నార‌ని దారుణంగా మాట్లాడారు. దీంతో వ‌లంటీర్లంతా రోడ్డెక్కారు. 30 వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌ని త‌న‌కు కేంద్ర హోంశాఖ ఉద్యోగులు చెప్పార‌ని ఏవేవో పిచ్చి మాట‌ల్ని ఆయ‌న మాట్లాడి అభాసుపాల‌య్యారు.

ఎందుకోగాని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు వ‌లంటీర్లకు భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల్లో వాళ్లు దెబ్బ తీస్తార‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌లంటీర్ల‌కు వ‌ల విసిరారు. నెల‌కు ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌర‌వ వేతనాన్ని రూ.10 వేల‌కు పెంచుతాన‌ని ఉగాది ప‌ర్వ‌దినం పురస్క‌రించుకుని వ‌ల విసిరారు. దీంతో వ‌లంటీర్లంతా కూట‌మి వైపు తిరుగుతార‌ని చంద్ర‌బాబు ఆశించారు.

కానీ క్షేత్ర‌స్థాయిలో ఆ ప‌రిస్థితి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ వ‌లంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. వ‌లంటీర్ అనే ప‌ద‌విని ప‌క్క‌న పెట్టి, ఏ అధికారి త‌మ‌ను ప్ర‌శ్నించ‌కుండా చేసుకున్నారు. కూట‌మి నేత‌ల అతి వ‌ల్ల వ‌లంటీర్లు వైసీపీకి మ‌ద్ద‌తుగా నేరుగా రంగంలో దిగారు. ఇప్పుడు ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇంత కాలం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో తాము నేరుగా చేసిన సేవ‌ల గురించి వివ‌రిస్తున్నారు. కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా, ప్ర‌తిదీ ఇంటి వ‌ద్ద‌కే రావాలంటే మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఎంత వుందో ప్ర‌జానీకానికి వ‌లంటీర్లు వివ‌రిస్తున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా ల‌బ్ధిదారుల ఎంపిక‌, అలాగే ప్ర‌యోజ‌నాన్ని నేరుగా అందించ‌డం త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వ‌లంటీర్లు వివ‌రిస్తున్న తీరు స‌హ‌జంగానే అధికార పార్టీకి రాజ‌కీయంగా సానుకూల వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. చంద్ర‌బాబు ఇస్తాన‌న్న రూ.10 వేలు వ‌లంటీర్ల‌పై ఏ మాత్రం ప‌ని చేయ‌డం లేద‌ని క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు తెలియ‌జేస్తున్నాయి.