సైకిల్ గుర్తు లేకుండా మొదటి సారి పోటీ!

ఎన్నడూ లేని విధంగా తన కంచుకోటలను పొత్తుకు రాసిచ్చేసింది టీడీపీ అధినాయకత్వం. అనకాపల్లిలో టీడీపీ అనేక సార్లు గెలిచింది. ఎంపీ సీటులో కూడా టీడీపీదే ఎక్కువ సార్లు విజయం. అలాగే పెందుర్తి టీడీపీకి బలమైన స్థానం. వీటితో పాటు ఎలమంచిలిలో టీడీపీ పుట్టాక ఎక్కువ సార్లు గెలిచింది.

ఈ సీట్లు అన్నీ ఇపుడు పొత్తుల పేరుతో జనసేన బీజేపీకి వెళ్లిపోయాయి. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో మూడు జనసేనకు వెళ్ళిపోయాయి. నాలుగు అసెంబ్లీ సీట్లలోనే టీడీపీ పోటీ చేస్తోంది. అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి కేటాయించింది. దాంతో ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తికమక వ్యవహారం కనిపిస్తోంది. అనకాపల్లి ఎంపీకి బీజేపీకి పువ్వు గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అడగాలి. అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు జనసేన గుర్తు గాజుగ్లాస్ కి వేయమని కోరాలి.

మిగిలిన చోట్ల అలాగే ఉంది. దాంతో మూడు గుర్తులతో ప్రచారం ఒక ఎత్తు అయితే ఓటర్లకు వీటి గురించి చెప్పి వారు తికమక పడకుండా ఈవీఎం మీటను నొక్కేలా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి పెద్దన్నగా టీడీపీ మీద ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు మరింతగా శ్రమించాల్సి వస్తోంది అని అంటున్నారు. అనకాపల్లి వంటి రాజకీయ కేంద్రంలో సైకిల్ గుర్తు లేకుండా మొదటి సారి ఎన్నికలకు వెళ్తున్నామని తమ్ముళ్ళు అంటున్నారు.

అనకాపల్లిని జిల్లా చేశారు. అలా చూస్తే కనుక జిల్లా కేంద్రంతో పాటు ఎంపీ సీటులోనూ సైకిల్ పార్టీ పోటీ లేకుండా పొత్తుల వల్ల ఇబ్బందిపడుతున్నామని తమ్ముళ్ళు అంటున్నారు. ఈ గుర్తుల గందరగోళంలో పడి ఓటర్లు ఎవరికి వేస్తారో అన్న టెన్షన్ కూడా ఉందిట. అదే వైసీపీ అయితే ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లూ అని సులువుగా చెప్పేస్తోంది. టీడీపీకి ఆఖరుకు గుర్తుల కష్టాలు కూడా వచ్చాయని అంటున్నారు.