వియ్యంకుడి ద్వారా రఘురామ పైరవీ అందుకేనా?

రఘురామక్రిష్ణ రాజు.. మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ హోదాను అనుభవించి.. నిన్నటిదాకా జగన్ మీద నానా బురద చల్లే ఫైర్ బ్రాండ్ నాయకుడిలాగా చెలరేగిపోయి.. ఇప్పుడు హఠాత్తుగా అనాథలాగా ఎటూ కాకుండా పోయి బేలపలుకులు పలుకుతున్నారు. ఆయన బతుకు కరివేపాకులాగా అయిపోయింది. అందరూ ఆయనను జగన్ మీద విమర్శలు చేయించడానికి బాగానే వాడుకున్నారు గానీ.. తీరా ఎన్నికల ప్రస్తావన వచ్చేసరికి.. గెలుపు గుర్రాలను మాత్రమే ఎంచుకనే ఫార్ములాను అనుసరించారు.

జగన్ పెట్టిన టికెట్ భిక్షతో ఎంపీగా గెలిచినప్పటికీ.. అయిదేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గ ప్రజల మొహం కూడా చూడని ఈ నాయకుడు.. మళ్లీ పోటీచేసినా గెలిచేది లేదని.. అనవసరంగా తమ కూటమి ఖాతాలో ఒక సీటును తెలిసీ చేజార్చుకున్నట్టు అవుతుందని కూటమి పార్టీలు భావించాయి.

చంద్రబాబు, అమిత్ షా, పవన్ అందరూ క్లోజ్ అనుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎవరికీ కానివారయ్యారు. అయినా ఇప్పటికీ ఆయనలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలనే ఆశ చావడం లేదు. ఒకవైపు చంద్రబాబు తనకు న్యాయం చేస్తారు.. అంటూ, ఆయన ద్వారా గోదావరిజిల్లాల్లో ఎవరి టికెట్ నైనా లాక్కోడానికి మంతనాలు చేస్తూనే, మరోవైపు తన వియ్యంకుడి ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రఘురామక్రిష్ణ రాజు.. తన వియ్యంకుడు కెవిపి రామచంద్రరావు ద్వారా కనీసం కాంగ్రెస్ టికెట్ అయినా దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన తనకు నరసాపురం టికెటే కావాలని అంటున్నారు. ఏదో ఒక పార్టీ తరఫున బరిలో దిగాలని అనుకున్న ఆయనకు కూటమి పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి. కనీసం కాంగ్రెసు నుంచైనా పోటీచేయాలని ఆయన తలపోస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెసులో టికెట్లకు అసలు పోటీ లేదు కదా.. కావలిస్తే కళ్లద్దుకుని టికెట్ ఇస్తారు కదా.. అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ఆయన ఇన్నాళ్లూ మోడీని భజన చేసిన తీరుకు ఆయన పూర్తిగా కాషాయదళం మనిషి అన్నట్టుగా ముద్రపడ్డారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు రఘురామకు టికెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నదనే చెడ్డపేరు వస్తుందని వారు ఆలోచిస్తున్నారు.

అయితే.. కెవిపి ద్వారా రఘురామ తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించిన తొలిజాబితాలో నరసాపురంసీటు సంగతి లేదు. ఒకవైపు చంద్రబాుబ నాయుుడు తనకు న్యాయం చేస్తారని ఆయనను దువ్వుతూనే, మరోవైపు కాంగ్రెస్ తరఫున సీటుకోసం కర్చీఫ్ వేస్తున్నట్టుగా రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.