ఆ నియోజకవర్గాలపైన పవన్ టార్గెట్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన ఖరారు అయింది. ఆయన ఏప్రిల్  నెల 4 నుంచి 7 వరకూ నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర లోని కీలక నియోజకవర్గాలలో పర్యటన చేయనున్నారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉత్తరాంధ్రలో జనసేన పొత్తులో భాగంగా ఆరు సీట్లు దక్కాయి. అవి విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండగా ఉన్నాయి. ఈ ఆరింటిలో పవన్ ఎన్నికల పర్యటన ఉంటుందని అంటున్నారు. ఈ సీట్లను గెలిపించుకోవాలని పవన్ భావిస్తున్నారు. అందుకే వీటిలోనే ఆయన ప్రచారం కానీ వారాహి యాత్ర కానీ ఉంటుందని అంటున్నారు.

ఈ నియోజకవర్గాలను దాటి ఆయన వేరే చోటకు వెళ్ళడం లేదు అని తెలుస్తోంది. అయితే జనసేన వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఇది తొలి విడత పర్యటన అని అంటున్నారు. మలివిడత ఏప్రిల్ నెలలోనే మరోసారి ఉంటుందని చెబుతున్నారు. కానీ పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందువల్ల కేవలం జనసేన పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారని మిగిలిన సమయం పిఠాపురం కోసం కేటాయిస్తారని అంటున్నారు.

అంటే పవన్ ఈసారి పర్యటనలు ప్రచారం పరిమితంగానే ఉంటాయని అంటున్నారు. ఏపీలో జనసేన పోటీ చేసే సీట్లు కూడా 21 మాత్రమే కావడంతో పవన్ తన ప్రచారం మొత్తాన్ని తమకున్న శక్తియుక్తులు మొత్తం వాటికే వెచ్చిస్తారు అంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు.