తెదేపా మేనిఫెస్టోపై ఆటాడుకున్న జగన్!

మాట తప్పను.. మడమ తిప్పను అనే వ్యక్తిత్వ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ప్రజాజీవితంలో రాజకీయం చేస్తూ పోతున్నారు. అలాంటి జగన్ కు .. మాటతప్పే నాయకుల పెడపోకడలు అసహ్యంగా కనిపిస్తాయనడంలో సందేహం ఏముంది.

పైగా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం మాటలు చెప్పినా.. ఎన్నికలు ముగిసి అధికారం దక్కితే.. చెప్పినదంతా మర్చిపోయి, పక్కన పెట్టేసి.. తనకు తోచిన రీతిగా పాలన సాగించుకుంటూ వెళ్లడం ఆయన తీరు. ఆ వ్యవహార సరళి మీదనే జగన్ తన తొలిరోజు ‘మేమంతా సిద్ధం’ సభల్లో ఓ ఆటాడుకున్నారు. మేనిఫెస్టో అనే పదాన్ని చంద్రబాబునాయుడు ఎంతగా అపహాస్యం చేశారో.. జగన్ ప్రజల కళ్లకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు.

2014 ఎన్నికలకు పూర్వం చంద్రబాబునాయుడు అతిపెద్ద ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కులాలు, వర్గాలు, వృత్తులు, మహిళలు ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరినీ ఏవో కొన్ని మాయమాటలు అందులో చేర్చారు. అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఏదో ఒక తీరుగా అధికారం దక్కింది. అయితే కొన్నాళ్లకే మేనిఫెస్టో సంగతి పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతకు ముందు.. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్ లో మేనిఫెస్టో పీడీఎప్ కాపీని ప్రజలందరికీ డౌన్లోడ్ చేసుకోడానికి వీలుగా అందుబాటులో ఉంచిన చంద్రబాబునాయుడు, అధికారంలోకి రాగానే.. దానిని వెబ్ సైట్ లోంచి తీయించేశారు.

ఎందుకంటే.. ఆ మేనిఫెస్టోలోని హామీలకు ప్రభుత్వం వ్యవహార సరళికి సంబంధమే లేకుండాపోయింది. పబ్లిక్ డొమైన్ లో ఆ మేనిఫెస్టో కాపీ ప్రజలకు అందుబాటులో ఉంటే వారు నిలదీస్తారనే భయం చంద్రబాబుకు పుట్టింది. అందుకే దానిని డిలీట్ చేయించారు. ఈ కుయుక్తుల తీరును జగన్ తన సభల్లో తీవ్రంగా ఎండగట్టారు. వెబ్ సైట్ నుంచి కూడా మేనిఫెస్టోను మాయం చేసిన మాయలఫకీరు చంద్రబాబునాయుడు అన్నట్టుగా ఆయన అభివర్ణించారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దాన పత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని నిందించారు. ప్రజలను మోసం చేయడానికి రంగురంగుల్లో మేనిఫెస్టోను ముద్రిస్తారని, యెల్లో మీడియాలో ప్రకటనలు కూడా ఇస్తారని కానీ అవన్నీ మోసాలేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం పనులను పూర్తిచేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పుకున్నారు. మేనిఫెస్టో లేనివి కూడా అనేకం అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిలుగా, ఖురానుగా పరిగణిస్తుందని జగన్ అన్నారు.

మొత్తానికి మేనిఫెస్టో అనే పేరుతో వందల అబద్ధాలను అందంగా వండి వార్చి, ప్రజలను బురిడీ కొట్టించి, ఆ తర్వాత కన్వీనియెంట్ గా అవన్నీ మర్చిపోయే చంద్రబాబునాయుడు తీరును జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎండగట్టడం విశేషం.