జగన్ మీద సరికొత్త ఏడుపు

నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకిగా నిరూపించడానికన్నట్టుగా ఉన్నాయి. భారతదేశంలో ముస్లిములకి రక్షణలేదని, ఇక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆమె అంది.

"మానవ హక్కుల గురించి మీ బ్రిటీష్ వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.. మీరు ఇవన్నీ ఎక్కడ విన్నారో నాకు తెలీదు.." అని బదులిచ్చినా, ఆమె ఆపకుండా ఇంకా చిరాకుపెట్టే ప్రశ్నలు వేసింది. 

దానికి సమాధానంగా, "నేను మీడియాని హ్యాండిల్ చేయడమనే విషయంలో చాలా వీక్" అని కోపంగా అన్నాడు. 

నిజానికి ఆ సమయంలో మోదీ ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా ఎదుర్కున్నాడు. 

ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ ఒకటి చాలా ఫేమస్. ఇంటర్వ్యూ మొదలైన రెండున్నర నిమిషాల్లో మైకు తీసేసి మంచి నీళ్లు తాగి వెళ్లిపోయాడు మోదీ. 

ఈ అనుభవాలతో మీడియాని హ్యాండిల్ చేయడంపై దృష్టి పెట్టాడు. దానికి తోడు 2014 నాటికి సోషల్ మీడియా శక్తివంతమైంది. పైపై మాటలు కాకుండా గుండె లోతుల్లోంచి మాట్లాడే నాయకుడికి పట్టం కట్టింది దేశం. పదవొచ్చాక మీడియా హ్యాండ్లింగ్ మొదలుపెట్టాడు. సామదానభేదదండోపాయాలు వాడాడు. ఇక అక్కడి నుంచి కథ మనకి తెలుసు. 

ఇక్కడ టాపిక్ మోదీ కాదు... మీడియా. కనుక మీడియా గురించే చెప్పుకుందాం. మనం ప్రపంచాన్ని చూసేది మీడియా అనే అద్దాల్లోంచే. అయితే ఆ అద్దాలకి ఏ రంగూ లేకపోతే సత్యం కనిపిస్తుంది. కానీ ఏదో ఒక రంగు పులుముకోని మీడియాలు లేవు ఈ రోజుల్లో. అది ఒక వర్గంపై ఆ మీడియా యజమానికున్న వ్యక్తిగతమైన ఇష్టం కావొచ్చు, భయం కావొచ్చు, అవసరం కావొచ్చు! దాని వల్ల ప్రజలకి సత్యాలు తెలియవు. అయితే అర్ధసత్యాలు లేదా సత్యంలా అనిపించే అసత్యాలు... ఇవే మిగులుతాయి. 

ఉదాహరణకి పాకిస్తాన్ గురించి అడిగితే మనం ఏం చెప్తాం? అది మనకి శత్రుదేశమని, అక్కడ హిందువులకి స్వేచ్ఛ లేదని, అక్కడున్నవాళ్లంతా భారతీయుల్ని ద్వేషిస్తారని..! దానికి కారణం మనం చదివింది, మీడియాలో విన్నది.. అంతే కదా! 

కానీ "భజరంగి భాయిజాన్" సినిమాలో అక్కడి ప్రజలకి ఇక్కడి ప్రజలంటే ద్వేషమేం లేదు.. ఉన్నవన్నీ కేవలం ఆర్మీలు, ప్రభుత్వాలు గొడవలంతే అని చూపించారు. అయితే అది సినిమాయే కదా అని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు.  

ఒకవెళ ఎవరన్నా చూపించినా అదంతా పెయిడ్ జర్నలిజమేమో అని అనుమానం రావొచ్చు. అసలు జర్నలిజంతో సంబంధం లేని మన తెలుగువాడు ఎవరన్నా అక్కడికి వెళ్లి చూసి రికార్డ్ చేసి చూపిస్తే నమ్మాలనిపించొచ్చు. 

అలాంటి పని చరిత్రలో మొదటి సారిగా "రవి తెలుగు ట్రావెలర్" అనే వ్లాగర్ చేసాడు. అతను విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. అమెరికాలో బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నాడు. ప్రపంచయాత్ర అతని సరదా. అన్ని దేశాలూ చూపిస్తూ పాకిస్తాన్ ని మరింత ప్రత్యేక శ్రద్ధతో చూపిస్తున్నాడు. అతనిది అమెరికన్ పాస్పోర్ట్ కాబట్టి పాకిస్తాన్ టూరిష్ట్ వీసా వచ్చింది. అలాగని ఆ అవకాశం చాలామంది తెలుగువాళ్లకి కూడా ఉన్నా ఎవ్వరూ ఆ ప్రయత్నం చేయలేదు. 

ఇంతకీ "రవి తెలుగు ట్రావెలర్" వీడియోల్లో ఉన్న దాని ప్రకారం.. పాకిస్తాన్లో ప్రజలు భారతీయుల్ని గౌరవిస్తారు.

రవి ఏ బండి దగ్గరకో వెళ్లి ఏ లస్సీయో, ఫలూదానో తాగాక భారతీయుడినని చెబితే వాళ్లు డబ్బులు కూడా తీసుకోని విషయం చూపించాడు. ఎందుకని అడిగితే "ఆప్ హమారా మెహ్మాన్ హై" అంటున్నారు.

ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, కరాచి.. ఇలా ఏ ఊళ్లో తిరిగినా అతనిని ఇబ్బంది పెట్టిన అంశాలు ఎదురవ్వలేదు. 

ఇదిలా ఉంటే తాజాగా కరాచీలో ఉన్న ఒక తమిళ హిందూ కుటుంబాన్ని కలిసాడు రవి. ఆ ఇంటి యజమాని అక్కడే పుట్టి పెరిగాడు. నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అన్నేళ్లుగా అతనిని మతం మారమని ఎవ్వరూ కోరలేదు. వీళ్లింట్లో హిందూ దేవతల విగ్రహాలు అవీ ఉన్నాయి. పూజలు చేసుకుంటున్నారు. పండుగలకి ఇరుగుపొరుగువాళ్లకి వండుకున్నవి పంచుతారు, వాళ్లు రంజాన్ కి వీళ్లకి పిండివంటలు పంపుతున్నారు. ఇదీ వాళ్ల జీవితం. 

అలాగే అక్కడున్న కొందరు పాకిస్తాని ముస్లిములు గిటార్ వాయిస్తూ రెహ్మాన్ పాడినా "వందేమాతరం" పాడి వినిపించారు రవికి. పాకిస్తాన్ ని ఈ యాంగిల్లో ఊహించగలమా? 

అలాగని అక్కడ అరాచకాలు, మతోన్మాద చర్యలు, హిందువులపై దాడులు, భారత వ్యతిరేక నినాదాలు జరగవని కాదు. అవీ జరుగుతాయి. కానీ అక్కడ ఈ మతసహనం, సౌభ్రాతృత్వం, భారతీయుడిని ఆదరించి ఆశ్రయమిచ్చే స్వేచ్ఛ కూడా ప్రజల్లో ఉంది... ప్రభుత్వాన్ని పక్కన పెడితే!

అదలా ఉంటే పాకిస్తాన్లో సనా అంజాద్ అని ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ ఉంది. దాదాపు మిలియన్ సబ్స్క్రబర్లు ఉన్నారు ఆమె చానల్ కి. ఆమె ఇండియా గురించి, మోదీ గురించి, అబు ధాబీలో హిందూ దేవాలయం గురించి పాకిస్తాన్ యువతని అడిగింది. వాళ్లంతా మోదీ వ్యతిరేకంగా మాట్లాడడం, ఇండియాలో ముస్లిములకి మానవహక్కులు లేవని చెప్పడం, ముస్లిం దేశమైన అబుధాబిలో హిందూ దేవాలయం మీద నిరసించడం చేస్తుంటే ఈమె వాళ్లని ఎడ్యుకేట్ చేసే పనిపెట్టుకుంది. తనకి ఇండియాలో చాలా మంది ముస్లింలు తెలుసని, అక్కడంతా క్షేమంగా హాయిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. మోదీని పొగిడింది. అయినా ఆమె అక్కడ క్షేమంగానే ఉంది. 

నిజానికి పాకిస్తాన్లో డెమాక్రసీ లేకపోతే ఆమెని ఈ పాటకి టపా కట్టించేయాలి కదా ఆమె మాట్లాడిన భారత్-అనుకూల మాటలకి?! కనుక పాకిస్తాన్లో డెమాక్రసీ, స్వేచ్ఛ ఉన్నాయని అర్ధమవుతోంది. కానీ మనం దానిని ఒప్పుకోలేం. ఎందుకంటే మనం నమ్మే పాకిస్తాన్ వేరు. ఆ ఘనకార్యం మీడియాది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈనాడులో "హే జీసస్" అంటూ ఒక పెద్ద వ్యాసం. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశులో క్రైస్తవులకి కుచ్చుటోపీ పెట్టేసాడట. అసలు వాళ్లకి ఏమీ చేయలేదట, రాయతీలు అడ్డగోలుగా కోసేసాడట, చర్చిల నిర్మాణానికి నిథులివ్వలేదట...! 

అదేంటి ఇన్నాళ్లు ఆంధ్రరాష్ట్రం క్రైస్తవ్యమైపోయిందని, చర్చిలు తెగ కట్టేస్తున్నారని, ముఖ్యమంత్రి పాస్టర్లకు కోట్లు గుమ్మరిస్తున్నాడని ఈ వర్గమేగా రాసింది? మరిప్పుడు ఈ రాతలేంటి? ఏది నిజం అనుకోవాలి? పాతదా? ఇప్పటిదా?

పైగా చంద్రబాబు హయాములో క్రైస్తవులకి ఎంత న్యాయం జరిగిందో, ఆయనెన్ని కానుకలిచ్చాడో గ్రాఫులు గట్రా వేసి మరీ రాసారు ఈనాడు వారు! 

అంటే ఇది ఎన్నికల ముందు పక్కా రాజకీయలబ్ధి కోసం రాసుకునే పచ్చరాత అని అర్ధమవుతుంది. క్రైస్తవుల ఓట్లు మొత్తం గంపగుత్తగా వైకాపాకి పడతాయని తెలిసి ఈ ఒక్క వ్యాసంతో ఎంతో కొంత తెదేపావైపు మళ్లకపోతాయా అని భ్రమతో రాసుకున్నదిలా ఉంది. 

నిజానికి ఇచ్చాడో లేదో పుచ్చుకున్నవాళ్లకి తెలుస్తుంది. ఓటెయ్యాలో లేదో వాళ్లు చూసుకుంటారు. అయినా సరే, మీడియా చేతిలో ఉంది కనుక ఏదో ఒకటి రాసేయాలి, బురద వేసేయాలి. ఇలా రాయాలంటే జనం గొర్రెలని, వాళ్లకి మెమరీ ఉండదని బలంగా నమ్మేయాలి. 

ఆసేతుహిమాచలం మీడియా తంతు ఇలా ఉంది. మీడియాని హ్యాండిల్ చేయడం ఒక యుద్ధం లాంటిది. ఆ పని నరేంద్రమోదీ చేయగలిగాడు. తెలంగాణాలో కేసీయార్ తాను పదవిలో ఉన్నంతవరకూ చేసుకోగలిగాడు. జగన్ మోహన్ రెడ్డికి మాత్రం అది చేతనవలేదు. లేదా పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు అనుకోవాలి! 

పక్షపాతధోరణితో వార్తలు రాసుకోవడాన్ని ఆపడం కష్టం కానీ, మరీ అబద్ధాలని నిజాలుగా చెలామణీ చేయడం దారుణం. దానికి తోడు గతంలో రాసిన దానికి విరుద్ధంగా రాసేయడం మరొక దౌర్భాగ్యం. వార్తలకి, అభిప్రాయాలకి తేడా లేకుండా ప్రచురించడం అనైతికం. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశ మీడియాకి కూడా ఒక దిశానిర్దేశం జరగొచ్చు. ప్రభుత్వం తలచుకుంటే జరుగుతుంది. జరగాలి కూడా. 

- శ్రీనివాసమూర్తి