ఎమ్బీయస్‍: అమీన్ సయానీ

తెలుగు శ్రోతలకు హిందీ పాటలను దగ్గర చేయడంలో ప్రముఖ పాత్ర వహించినది బినాకా గీత్‌ మాలా అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ బుధవారం రాత్రి 8 కాగానే రేడియో సిలోన్‌ ట్యూన్ చేయడానికి అవస్థపడడం, కౌంట్ డౌన్‌లో పాటలు వేస్తూంటే ఉగ్గబట్టుకుని వింటూ, చివరికి మనకు నచ్చినపాట నెంబర్ వన్ స్థానానికి రాగానే ఆనందంతో కేరింతలు కొట్టడం.. యివన్నీ ఒకతరం వారికి మధురమైన జ్ఞాపకాలు. బినాకా అనగానే గుర్తుకు వచ్చేది అమీన్‌ సయానీ. ఆయన వాయిస్ ఉర్రూత లూగించినంతగా మరే ఇతర కళాకారుడి వాయిస్ శ్రోతలను ఆకట్టు కోలేదని చెప్పడానికి సందేహించ నవసరం లేదు. ఇప్పటికీ రేడియో వ్యాఖ్యాతలు ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తారన్న విషయం అందరూ ఎరిగినదే.

అమీన్ సయానీ ఫిబ్రవరి 20న 91వ ఏట పరలోకగతులయ్యారని వినగానే ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అనాయాసంగా, ఆత్మీయంగా మాట్లాడుతూ శ్రోతలను చేరువ చేసుకోవడం! సాధారణంగా ఎనౌన్సర్లు బాస్ వాయిస్‌తో మాట్లాడుతూ తమను తాము గంభీరకంఠుడిగా చూపుకోవడానికి ప్రయత్నిస్తూ ఎక్కడో లోతుల్లోంచి మాట్లాడతారు.  అమీన్ అలాటి ప్రయత్నమేమీ చేయకుండా పైపైన సరదాగా మాట్లాడుతున్నట్లు తోస్తాడు. పైగా వక్తలు ఉన్నతమైన వేదిక నుంచి మాట్లాడుతున్నట్లు, పెద్దపెద్ద పదాలు వాడుతూ అబ్బో, యీయనకు చాలా తెలుసురోయ్ అని మన చేత అనిపిస్తారు. ఈయన సాధారణ హిందూస్తానీ, ఇంగ్లీషు కలగలిపి మాట్లాడుతూ మనలో మనిషే మనతో కబుర్లాడుతున్నాడు అని మనకు తోచేట్లు చేసేవాడు.

మా స్కూలు రోజుల్లో చాలామందికి హిందీ, ఉర్దూ, హిందూస్తానీ ఏదీ వచ్చేది కాదు. స్కూలులో ఒక సబ్జక్టుగా ఉన్నా హిందీ పూర్తిగా పరాయి భాషే! హిందీ పాటలు వినలేదా అంటే ట్యూన్ల కోసం వినేవాళ్లం. పాటల్లో మాటలు తెలుసుకోవాలని హిందీ పాటల పుస్తకాలు కొని చదివేవాళ్లం. మూడు సినిమాల పాటలను 8 పేజీల్లో కుదించి, చౌక పేపరుపై ముద్రించి పది పైసలకు అమ్మేవారు. ఆ పదాల్లో అచ్చుతప్పులున్నాయో లేదో తెలియదు. వాటి అర్థాలు అసలే తెలియదు కాబట్టి సరిదిద్దుకోలేము. ట్యూనుకి సరిపడేట్లా మాటలు కిట్టించి పాడేసుకునే వాళ్లం. రేడియో సిలోన్‌లో పాట ముందు ఎనౌన్సుమెంటులో పెద్దపెద్ద పదాలేవీ ఉండేవి కావు. గీత్‌కార్, సంగీత్‌కార్, ఆవాజ్.. యిలాటి పదాలే.

ఇలాటి వాళ్లం అనేక వాక్యాలు గబగబా దొర్లించే బినాకా ప్రోగ్రాం ఎందుకు వినేవాళ్లం? అమీన్ సయానీ భావవ్యక్తీకరణ కోసం! ఆయన పలికే పదాల అర్థం తెలియక పోయినా, అవి హిందీయో, ఉర్దూయో, ఫార్సీయో ఊహించలేక పోయినా మా గుండెలను స్పృశించేవి. మాటల కందని భావాలే మంచి కథలను చెపుతాయి.. అనే పాటలో చెప్పినట్లు, అవి హిందీ పాటల గురించి ఏవేవో ఊసులు చెప్పేవి. అందుకే అమీన్ సయానీ మా తరం వారికి ఆత్మీయుడు. మాది మానసిక బంధం. అప్పట్లో ఆయన ఫోటో కూడా చూడలేదు మేము. కానీ గొంతు ఏ యాడ్‌లో విన్నా యిట్టే పట్టేసేవాళ్లం. హైస్కూలు జీవితం, కాలేజీ జీవితం ఎవరికైనా సరే, మధురమైన ఘట్టాలు. మా విషయంలో అవి అమీన్‌ వాయిస్‌తో ముడిపడి ఉన్నాయి. ఆయన గురించి తలచుకుంటే మా బాల్యం, మా యవ్వనం మళ్లీ గుర్తుకు వచ్చి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

టీవీ వచ్చాక ఆయన్ని బుల్లితెరపై చూశాం. అందంగా, హుందాగా కనబడ్డాడు. చక్కటి చిరునవ్వు, హుషారైన మాట తీరు, మేం ఎలా ఊహించుకున్నామో అలాగే ఉన్నాడు. ఆయనది బొంబాయికి చెందిన గుజరాతీ ముస్లిము కుటుంబం. కానీ మాతృభాష గుజరాతీ కాదేమో! చిన్నప్పుడు బడిలో వేశాకనే గుజరాతీ నేర్చుకున్నానని చెప్పాడొకసారి. చదువు గుజరాతీ మీడియంలోనే సాగింది. కాస్త పెద్దవాడయ్యాక హిందీ, ఇంకా పెద్దయ్యాక ఉర్దూ, ఆ తర్వాత సంస్కృతం, ఫార్సీ నేర్చుకుంటూ పోయానన్నాడు. ఇంగ్లీషైతే చిన్నప్పణ్నుంచీ నేర్చుకున్నాడు. తండ్రి జాన్ మొహమ్మద్ డాక్టరు. పిల్లలు పుట్టాక పై చదువుల కోసం ఇంగ్లండు వెళ్లి, అక్కడి వాతావరణం పడక తిరిగి వచ్చేశాడు. సంపాదన పెద్దగా ఉండేది కాదట.

తల్లి ఖుల్సూమ్ విద్యావంతురాలు. కుటుంబమంతా గాంధేయవాదులు. స్వాతంత్ర్య పోరాటంలో, సామాజిక కార్యకలాపాల్లో పాలు పంచుకునేవారు. గాంధీగారి సూచనపై అక్షరాస్యత పెంపొందించ డానికి 1940 నుంచి 1960 వరకు ‘‘రాహ్‌బీర్’’ అనే పత్రికను హిందీ, ఉర్దూ, గుజరాతీలలో నడిపేది. చాలా తేలికైన భాషలో కథలు, వ్యాసాలు ఉండేవి. ఆ పనిలో అమీన్ తల్లికి సాయపడేవాడు. సామాన్యుడికి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయడం అక్కడే తర్ఫీదు పొందాడు. అన్నగారు హమీద్ ఆల్ ఇండియా రేడియోలో ఎనౌన్సర్. అమీన్ చిన్నపుడు శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు. ఒక వ్యాధి కారణంగా ఆర్నెల్ల పాటు యింట్లో మంచం మీదనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒంటరిగా ఉంటూ సంగీతం వినడం అలవాటయ్యింది.

చిన్న వయసులోనే అన్నగారు రేడియోలోనే ఇంగ్లీషు నాటకాలు వేయించేవాడు. బొంబాయి ఆలిండియా రేడియోలో ఎనౌన్సరుగా కూడా ప్రవేశ పెట్టాడు. అయితే అమీన్‌కు పేరు వచ్చినదంతా రేడియో సిలోన్ (అప్పట్లో శ్రీలంకను సిలోన్ అనేవారు)లో వెలువడే బినాకా గీత్‌మాలా ద్వారానే! వేసేవి హిందీ పాటలైనప్పుడు, అదేదో ఆలిండియా రేడియో ద్వారానే వేయవచ్చు కదా, మధ్యలో సిలోన్ ఎందుకు వచ్చింది అనే అనుమానం వస్తోందా? దానికో కథ ఉంది. ఆ కథకు మూలకారకుడు కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిగా 1952 నుంచి 1962 వరకు ఉన్న బివి కేస్కర్! ఆయన పరమ ఛాందసుడు. రేడియోలో సినిమా పాటలు వేయకూడదని, క్రికెట్ కామెంటరీ వినిపించకూడదని, వాయిద్యాలలో హార్మోనియంను ఉపయోగించ కూడదని నిషేధించాడు.

ఇక్కడో విషయం చెప్పాలి. భారత తొలి ప్రధాని నెహ్రూ అభ్యుదయవాది, సామ్యవాది కావడం వలన, కాంగ్రెసు ఆ బాటన నడడడం చేత దేశంలో అనేక అనర్థాలు జరిగాయని కొన్నేళ్లగా ఆరెస్సెస్ వారు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే కాంగ్రెసులో తీవ్ర రైటిస్టుల నుంచి తీవ్ర లెఫ్టిస్టుల దాకా అందరూ ఉండేవారు. ఎవరి మాటా పూర్తిగా నెగ్గలేదు. స్వాతంత్ర్యోద్యమ సమయంలోనే గాంధీని ధిక్కరించిన వారెందరో! స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూను లక్ష్యపెట్టని వారు యింకెందరో! ఇప్పటి ప్రధానుల్లా నెహ్రూ తను చెప్పినదే జరగాలని పట్టుబట్టే మనిషీ కాడు, శక్తిమంతుడూ కాదు. తనను తాను ‘ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్’గా చెప్పుకుంటూ కాంగ్రెసులోని వివిధ వర్గాలను సమన్వయం చేసుకుంటూ బండి లాక్కుని వచ్చాడు. పురుషోత్తమదాస్ టాండన్ వంటి ఛాందసవాది కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉంటూ నెహ్రూని ముప్పుతిప్పలు పెట్టాడు.

సామ్యవాదం మాటకొస్తే 1956లో ఆవడి (తమిళనాడు)లో జరిగిన కాంగ్రెసు సమావేశంలో నెహ్రూ పోరు భరించలేక ‘మాది సామ్యవాదం’ అని కాంగ్రెసు వారు తీర్మానం చేశారు కానీ, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వగైరా అంశాలను మూల పడేశారు. నెహ్రూ తన జీవితకాలంలో వాటిని అమలు చేయలేక పోయాడు. తర్వాత వచ్చిన శాస్త్రికి ఆ ఉద్దేశమే లేదు. ఆ తర్వాత వచ్చిన ఇందిర ప్రత్యర్థులైన ‘సిండికేటు’ నాయకులను దెబ్బ తీయడానికి వాటిని 1969లో అమలు చేసింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే కేస్కర్ వంటి తీవ్ర హిందూత్వవాదిని నెహ్రూ తన కాబినెట్‌లో పదేళ్ల పాటు మంత్రిగా ఉంచుకోవలసి వచ్చింది. అతని చాదస్తపు, నిరంకుశ విధానాల వలన ఆలిండియా రేడియో నష్టపోతున్నా సహించవలసి వచ్చింది.

కేస్కర్ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ముస్లిములు, ఆంగ్లేయుల కారణంగా భారతీయ సంగీతం భ్రష్టు పట్టిందని వాదించేవాడు. ముస్లిముల కారణంగా హిందూస్తానీ సంగీతం హైందవత్వాన్ని పోగొట్టుకుందని, ఆధ్యాత్మికత స్థానంలో శృంగారం వచ్చి చేరిందని నమ్మేవాడు. హార్మోనియం పాశ్చాత్య వాయిద్యం కాబట్టి రేడియోలో దాన్ని వాడడానికి వీల్లేదన్నాడు. క్రికెట్ ఇంగ్లీషు వాళ్ల క్రీడ కాబట్టి, దేశం నుంచి ఆంగ్లేయులను తరిమివేయగానే క్రికెట్ కూడా మాయమవుతుందని నమ్మాడు. అలా కాకపోవడంతో కనీసం రేడియో ద్వారా దాన్ని పాప్యులరైజ్ చేయకూడదని, కామెంటరీలు నిషేధించాడు. ఒత్తిడి భరించలేక కొన్నాళ్లకు సరేనన్నాడనుకోండి. సినిమాల కారణంగా సమాజం నాశనమై పోతుంది కాబట్టి సినిమా కార్యక్రమాలేవీ ఉండకూడదని, సినిమా పాటలు వేసినా ఎయిర్‌టైమ్‌లో 10శాతంకు మించి వేయకూడదన్నాడు. ఆ తర్వాత పూర్తిగా నిషేధించి పారేశాడు. గమనించ వలసినదేమిటంటే నెహ్రూ హయాంలో కూడా యింతటి తీవ్ర ఛాందసవాదం నడిచింది.

సరే, కేస్కర్ కారణంగా రేడియోకి శ్రోతలు తగ్గిపోయారని గమనించి, సిలోన్ ప్రభుత్వం తన రేడియో సిలోన్‌లో 1950లో ప్రారంభించిన తన హిందీ సెక్షన్‌ను బాగా అభివృద్ధి పరిచింది. సినిమా పాటలను దంచి కొట్టింది. తన బ్రాడ్‌కాస్టింగ్ కెపాసిటీని బాగా పెంచి, భారతదేశమంతా వినబడేట్లా చేసింది. బొంబాయిలో ఒక ఆఫీసు తెరిచి, మాకు యింతమంది శ్రోతలున్నారని చూపించి కంపెనీల నుంచి నుంచి బోల్డు యాడ్స్ సంపాదించింది. తర్వాతి రోజుల్లో మద్రాసులో కూడా ఆఫీసు తెరిచి, దక్షిణాది సినిమాల పాటలు కూడా వేసి, అక్కడి యాడ్స్ కూడా సంపాదించింది. సాయంత్రం తలా అర గంటా దక్షిణాది భాషల్లో సినిమా పాటలు వేసేది. 

మా హైస్కూలు రోజుల పాటికి కేస్కర్ దిగిపోయాడు. వారానికి ఓ పావు గంట మాత్రం ఆలిండియా రేడియోలో సినిమా పాటలు వచ్చేవి. అప్పుడు కూడా ‘హే కృష్ణా, ముకుందా, మురారీ..’ పాట వేసి, పావుగంటా అయిపోయింది ఫో అనేవారు. దాంతో పోలిస్తే రోజూ పావుగంట తెలుగు పాటలంటే ఎంత హుషారు వస్తుందో ఊహించండి. స్కూలు నుంచి వస్తూనే రేడియో ముందు కూర్చునేవాళ్లం. ఎనౌన్సరు తమిళంలోనే మాట్లాడేవారు. ఆ నాలుగు ముక్కలు మాకూ వచ్చేశాయి. ఇలంగై వానొలి, నేరం యిప్పొళుదు, గంటసాలావుమ్, సుశీలావుమ్... అంటూ అనుకరించి ఆనందించే వాళ్లం. క్రమేపీ మీనాక్షీ పొణ్నుదురై అనే ఎనౌన్సర్ ఒకావిడ వచ్చి తెలుగులో కొద్దిపాటి యాసతో మాట్లాడేది. అక్కడే పుట్టి పెరిగిన ఆవిడ 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో జరిగినప్పుడు వస్తే చూడడానికి జనం విరగబడ్డారు.

ఇది ఎందుకు చెప్పానంటే, ఆవిడకే అంత పాప్యులారిటీ ఉంటే అమీన్ సయానీకి ఎంత ఉండేదో ఊహించుకోవచ్చు. రేడియో సిలోన్ యింత పాప్యులర్ అయ్యి, మన కంపెనీల యాడ్స్ అన్నీ కొల్లగొడుతూంటే మన ప్రభుత్వం ఏం చేస్తోంది? అనే అనుమానం వచ్చిన 50 ఏళ్ల వయసు వాళ్లను దూరదర్శన్ కథ గుర్తు చేసుకోమంటాను. ప్రయివేటు ఛానెళ్లు వచ్చేందుకు ముందు దూరదర్శన్ ఎలా ఉండేదో జంధ్యాల తన సినిమాల్లో ఉతికి ఆరేశారు. మూర్ఖపు, చాదస్తపు విధానాలతో రేడియో తన శ్రోతలను పోగొట్టుకుంటూ వుంటే, కొంతమంది ఒత్తిడి పెట్టి 1957లో వివిధ భారతి పెట్టించారు. అది కమ్మర్షియల్ విభాగాన్ని ప్రారంభించేటప్పటికి 1969 వచ్చింది. నగరాలలో మెయిన్ స్టేషన్‌కు అనుబంధంగా మరో స్టేషన్ పెట్టి దానిలో పాటలు, యాడ్స్ వినిపించేవారు. అది పట్టణాలకు, ఆ తర్వాత గ్రామాలకు వ్యాపించే సరికి చాలాకాలమే గడిచింది.

ఏతావతా నా స్కూలు, కాలేజీ రోజులన్నీ రేడియో సిలోన్‌తోనే ముడిపడ్డాయి. ఏ కార్యక్రమం ఏ వారం ఎన్ని గంటలకు వచ్చేదో యిప్పటికీ గుర్తున్నాయి. వాటన్నిటిలో తలమానికమైనది ‘బినాకా గీత్‌మాలా’. దాన్ని అమీన్‌తోనే ప్రారంభించారు. బినాకా టూత్‌పేస్ట్ తయారీదారులు దాన్ని స్పాన్సర్ చేసేవారు. చాలాకాలం తర్వాత ’బినాకా’ యాజమాన్యం చేతులు మారి, అది ‘సిబాకా’ అయింది. ఏ పేరుతో వచ్చినా ఆ పేస్టు వాడినవారు నాకెవ్వరూ కనబడలేదు. బినాకా పేరు మారుమ్రోగిందంటే కారణం ఆ కార్యక్రమమే. మా బ్యాంకులో పని చేసిన ఒకావిడ తన కూతురికి ‘బినాకా’ అని పేరు పెట్టిందని అమీన్ పోయిన తర్వాతనే నాకు తెలిసింది. అదీ ఆ కార్యక్రమం మహిమ.

1952లో ఒక యాడ్ కంపెనీ వారు తమ క్లయింట్లయిన బినాకా వారి కోసం, 20 ఏళ్ల అమీన్‌తో కలిసి ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. 1953 వరకు పాటల ర్యాంకింగ్ ఉండేది కాదు. ప్రజాదరణ పొందిన 7 పాటలు వేసేవారు. ఏ పాటలు నచ్చాయో సూచిస్తూ ఉత్తరాలు రాయండి అంటూ శ్రోతలను కోరేవారు. వారం వారం వేలాది ఉత్తరాలు వచ్చి పడడంతో పోస్టాఫీసు వాళ్లు దణ్ణం పెట్టారు. ఓ వారం 9 వేల ఉత్తరాలు వచ్చాయట. దాంతో ఆ పద్ధతి మానేసి అమ్మకాల ప్రకారం ర్యాంకింగ్ యిస్తూ కౌంట్‌డౌన్ ప్రోగ్రాంగా మార్చేరు. ఆ వారం ప్రథమ స్థానంలో ఏ పాట వస్తుందో దాన్ని చివర్లో వేసేవారు. ఆ పద్ధతి వివాదం కాసాగింది. ఫలానా సంగీతదర్శకుణ్ని ప్రమోట్ చేయడానికే అంకెల్ని మార్చేస్తున్నారని తక్కినవారు అనసాగారు. ఏదోలే, ఓ రేడియో కార్యక్రమం గురించి యింత బుర్ర బద్దలు కొట్టుకోవాలా అనుకునే వారు కాదు. ఫిల్మ్‌ఫేర్ ఎవార్డుల విషయంలో లాగానే వీటిపై కూడా చర్చలు జరిగేవి.

ఈ వివాదాలపై అమీన్ సయానీ ఏమంటారు? ఆయన ఒక పత్రికకు యిచ్చిన యింటర్వ్యూ నా కంటపడింది. దాన్ని దాచుకున్నాను. ‘‘హాసం’’ తొలి సంచిక (అక్టోబరు 01, 2001) లో దాని అనువాదం వేశాను. చిరంజీవి గారికి ‘‘హాసం’’ తొలి సంచిక బాగా నచ్చింది. మెచ్చుకుంటూ ఒక ఉత్తరం రాశారు. దానిలో యీ యింటర్వ్యూ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయనా అమీన్ అభిమాని అని తెలిసింది. ఆ యింటర్వ్యూ యిక్కడ యిస్తున్నాను.

హిందీ చిత్ర సంగీతం తొలిరోజుల గురించి :

'‘ఈ సంగీతాన్ని రెండు శకాలుగా విడగొట్ట వచ్చు, ఒకటి ప్లేబ్యాక్‌కు ముందు శకం, రెండోది తర్వాతి శకం. మొదట్లో నటీనటులే స్వయంగా పాట పాడడం రాక పోయినా – పాడవలసి వచ్చేది. దాంతో శ్రావ్యత తక్కువగా ఉండేది. సంగీతకారుల్లో భీష్ముడన దగిన అనిల్ బిశ్వాస్‌సు చూడండి. లతా, తలత్ వంటి ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చాక వారితో ఎంత అద్భుతంగా పాడించ గలిగాడో!’’

తనకు నచ్చిన సంగీత కారుల గురించి:

‘'గురుస్థానంలో నిలుప దగినవారు ఐదుగురు - అనిల్ బిశ్వాస్, రామచంద్ర, రోషన్, మదన్ మోహన్, ఎస్‌డి బర్మన్. ఆ తర్వాత 'సోల్‌ఫుల్' అనదగినవారు ఖయ్యాం, జయదేవ్. తర్వాత చెప్పాలంటే 'లైవ్లీ'గా ఉండే శంకర్-జైకిషన్, ఓపి నయ్యర్, సలిల్ చౌధురి. ఇక పాప్ చేసినది ఆర్డీ బర్మన్, కల్యాణ్‌జీ ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్. 40ల మధ్య నుండి 50ల మధ్య వరకు మహామహులు పని చేసారు. సంగీత దర్శకులు అనే కాదు, గీత రచయితలు కూడా! సాహిర్, హస్రత్, మజ్రూ, శైలేంద్ర.. ఇలా ఎందరో! స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, సంస్కృతిని పునర్మించుకొనే దశ అది. వ్యక్తిగతమైన అసూయా ద్వేషాలకు తావు లేని దశ. అందుకే అంత గొప్ప సంగీతం వెలువడింది.’’

బినాకా గీత్‌మాలా ఆవిర్భావంపై :

‘‘1952 సంవత్సరంలో ప్రారంభమయింది. అవి '‘మహల్'’, ‘'నాగిన్'’, ‘'ఉడన్ ఖటోలా'’ విడుదలైన రోజులు. 1952-53 వరకు వచ్చిన గీత్‌మాలాలో పాటలకు ర్యాంకు ఇచ్చేవాళ్ళం కాదు. 7 హిట్‌ సాంగ్స్ మాత్రం వేసే వాళ్ళం. 1954 నుండి కౌంట్‌డౌన్ షో (హిందీ సినిమా పాటలపై అదే ప్రప్రథమం) గా మారింది. 1954 సంవత్సరానికి టాపర్ గా వచ్చినది - 'జాయే జాయే కహాఁ' (తలత్ - టాక్సీ డ్రైవర్)’’

బినాకా కౌంట్ డౌన్ విధానం గురించి :

‘‘రికార్డుల ఆమ్మకం ఆధారంగా వాటి స్థానాన్ని నిర్ణయించేవాళ్లం. అంతే కాకుండా శ్రోతలను వాళ్లకేది నచ్చిందో రాసి పంపమనేవాళ్లం. ఈ రెండూ కలిపి సరైన స్థానాన్ని గుర్తించేవాళ్లం. కానీ కొన్ని రోజులు పోయాక చూస్తే కొంతమంది శ్రోతలు ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీలు పంపుతున్నట్లు తేలింది. దాంతో ఆ విధానానికి స్వస్తి చెప్పి రికార్డుల అమ్మకాన్ని బట్టి నిర్ణయించసాగాం. ఒక రికార్డులో రెండు పాటలున్నా, ఏ పాట గురించి ఆ రికార్డు కొంటున్నారో షాపు వాళ్లు చెప్పేవారు. ఒక్కొక్కసారి పాట మరీ హిట్ అయి రికార్డులన్నీ అమ్ముడు పోయి స్టాకు మిగిలేది కాదు. అప్పుడు ఆ వారంలో అమ్మకాలు తగ్గినట్టు అనిపించేది. దీన్ని అధిగమించ డానికై కొన్ని ఊళ్లలో రేడియో క్లబ్బులను పెట్టి శ్రోతల అభిప్రాయాలను సేకరించే వాళ్లం. కొద్దికాలానికి మాకెంత క్రెడిబిలిటీ వచ్చిందంటే ఎచ్ఎంవి వాళ్లు మా దగ్గర నుండి సమాచారం ముందుగా అడిగి తీసుకొని దాని ప్రకారం రికార్డులు తయారు చేసేవారు.’’

బినాకా గీతమాలాలో పక్షపాతం గురించి :

‘‘50, 60 లో శంకర్ జైకిషన్ ఓ ఊపు ఊపుతున్నారు. అందువల్ల వాళ్ల పాటలకు ప్రథమ, ద్వితీయ స్థానాలు వస్తూండేవి. దాంతో తక్కిన సంగీత దర్శకులు బినాకా పక్షపాతంతో అంకెలను తారుమారు చేసి శంకర్ జైకిషన్లకు ప్రాచుర్యం ఇస్తోందనీ, దాని వల్ల తక్కిన వాళ్ల కెరియర్ దెబ్బ తింటోందని ఫిర్యాదు చేసారు. సరేనని మేం ఒక ఏడాది పాటు 1,2,3, అని చెప్పకుండా పాప్యులారిటి ప్రకారం వేశాం. కానీ దానివలన 'కౌంట్‌డౌన్' ప్రోగ్రాం అనే మాటకు అర్థం లేకుండా పోయిందనిపించింది. అప్పుడు మేం నిష్పక్షపాతంగా ఉన్నామో లేదో చూడడానికి చిత్రరంగం నుండి ఒక యాంబుడ్స్‌మన్‌ని నియమించమని సూచించాం. జి పి సిప్పీ మొదటి యాంబుడ్స్‌మన్. తర్వాత బిఆర్ చోప్డా. ప్రతీవారం వాళ్ల దగ్గరికి వెళ్లి ఫిగర్స్, రేటింగ్స్ చూపించి వారి సంతకం పెట్టించుకొనేవాణ్ని.’’

బినాకా గీతా మాలా ప్రాభవంపై :

‘‘బినాకా గీత్‌మాలా కాలక్రమేణా సిబాకా గీత్‌మాలాగా  రేడియో సిలోన్‌లో ప్రాచుర్యం పొందడంతో వివిధ భారతిలో కూడా ప్రసారం కాసాగింది. సిబాకా గీత్‌మాలాగా సిలోన్‌లో గంట సేపు, సిబాకా సంగీత్‌ మాలాగా వివిధ భారతిలో గంటసేపు 39 ఏళ్ల పాటు గీత్‌మాలా రాజ్యమేలాక టీవీలో ‘సూపర్ హిట్ ముకాబ్‌లా' రావడంతో దీనికి ప్రజాదరణ తగ్గింది. 1994లో కార్యక్రమం నిలిపి వేయడం జరిగింది. ఇతర దేశాలలో రేడియో, టీవీ సహజీవనం సాగిస్తున్నా, మన దేశంలోనే యిలా జరిగింది. ఒక మంచి ప్రోగ్రాం రేడియో శ్రోతలకు దూరమైంది.’’

పాటలపై పాశ్చాత్యసంగీతపు ప్రభావం గురించి:

‘‘అది ఎప్పుడూ ఉంది. పంకజ్ మల్లిక్ 'పియా మిలన్ కో పాట చూడండి, వెస్టర్నయిజ్‌డ్ మార్చింగ్ ట్యూన్‌లో డ్రమ్ బీట్స్‌తో సహా.. ఉంటుంది. నౌషాద్ కూడా ఎంతో వెస్టర్న్ ఆర్కెస్ట్రా వాడారు. కానీ కొంతమంది వెస్టర్న్ గురించి  తెలియకుండానే పెద్ద ఆర్కెస్ట్రా పెట్టి హోరెత్తించేశారు. సలిల్ చౌధురి, ఆర్డీ బర్మన్ లాంటివాళ్ళు దానిని చక్కదిద్దారు. సలిల్‌కు వెస్టర్న్ సింఫనీపై చక్కని అవగాహన ఉంది. ఆర్‌డి ఇండియన్, వెస్టర్న్ సంగీతాలను చక్కగా మేళవించాడు. హిందీలో మొదటి ‘పాప్' పాట - ‘అప్ జైసా కోఈ' (నాజియా - కుర్బానీ) యే! ముందులో నాలాంటి పెద్దవాళ్లు ఇబ్బందిపడినా వినగా వినగా అది నచ్చింది కూడా.’’

ఈనాటి సంగీతంపై :

‘‘1980 నుండి సమాజమే మారిపోయింది. హింస ప్రజ్వరిల్లింది. చిత్రసంగీతంలోనూ అంతే. అయినా ప్రతీ తరం తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకునేందుకు ఒక పద్ధతి ఎంచుకుంటుంది. ఈనాటి సంగీతం ద్వారా ఈ తరం తమ భావాలను వెల్లడిస్తోంది. మధ్య మధ్య మాధుర్యంతో కూడిన పాటలు కూడా వస్తున్నాయి. చూద్దాం, ముందు ముందు ఏమవుతుందో!’’

బినాకాలో అమీన్‌ది ట్రేడ్‌మార్క్ ఒకటి ఉంది. అందరూ ‘భాయియోఁ ఔర్ బెహనోఁ’ అని ప్రారంభిస్తే, ఆయన ‘బెహనోఁ ఔర్ భాయియోఁ’ అని ప్రారంభించేవాడు. చివర్లో ‘ఫిర్ మిలేంగే’ అనేవాడు. అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. బినాకా, సిబాకా మొదట సిలోన్‌లో, తర్వాత వివిధ భారతిలో మొత్తం 42 సంవత్సరాలు నడిపాడు. నాలుగేళ్ల విరామం తర్వాత కాల్గేట్ సిబాకా గీత్‌మాలా పేరుతో పునరుద్ధరించి రెండేళ్లు నడిపాడు. ఏఐఆర్‌లో నాలుగేళ్ల పాటు  సారిడాన్ కే సాథీ, ఏడేళ్ల పాటు ఎస్ కుమార్స్ ఫిల్మీ ముకద్దమా చేశాడు. వీటితో పాటు షాలిమార్ సూపర్‌లాక్ జోడీ ఏడేళ్లపాటు, 14 ఏళ్ల పాటు మరాఠా దర్బార్, సితారోఁకి పసంద్, చమక్తే సితారేఁ మెహక్‌తీ బాతేఁ, సంగీత్‌కే సితారోం కే మెహఫిల్.. వగైరా కార్యక్రమాలు చేశాడు. బోర్నవిటా క్విజ్ కాంటెస్ట్‌ను ఇంగ్లీషులో నిర్వహిస్తున్న అన్నగారు 1975లో చనిపోతే, తను ఆ స్థానాన్ని భర్తీ చేసి 8 ఏళ్లు నడిపాడు. ఆలిండియా రేడియో కమ్మర్షియల్ సర్వీస్‌కై 1970 నుంచి, విదేశీ స్టేషన్లకై 1976 నుంచి పని చేశాడు.

60 సంవత్సరాల కెరియర్ ఆయనది. 54 వేల కార్యక్రమాలు చేశాడు. వాయిస్ ఫెమిలియర్ కావడంతో 19 వేల స్పాట్స్ లేదా జింగిల్స్ కూడా చేశాడు. (లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం) ఎడ్వర్టయిజింగ్ రంగానికి చేసిన సేవలకై 1991లో ఎవార్డు, 1993లో హాల్ ఆఫ్ ఫేమ్ ఎవార్డు, 2006లో లివింగ్ లెజెండ్ ఎవార్డు, 2007లో ‘‘హిందీ రత్న’’ ఎవార్డు, 2009లో పద్మశ్రీ పొందాడు. ‘‘భూత్ బంగ్లా’’ (1965) సినిమాలో ఓ క్లబ్బులో ఎనౌన్సరుగా, మరో 3 సినిమాల్లో తెరపై కనబడ్డాడు. 2 వేల స్టేజిషోలకు కంపియర్‌గా చేశాడు. వయసు మళ్లాక కూడా అనేక టీవీలకు ఇంటర్వ్యూలకు యిచ్చాడు. తన చిరునవ్వు ఎప్పటికీ చెదరలేదు. వ్యక్తిగత జీవితానికి వస్తే కశ్మీరీ పండిట్ రమ మట్టూను పెళ్లాడాడు. కొడుకు పేరు రాజిల్ సయానీ.

చివరగా రెండు విషయాలు. నా ‘‘కిశోర్ జీవనఝరి’’ పుస్తకాన్ని మా నాన్నకు అంకితం యిస్తూ ‘పరీక్ష రోజుల్లో కూడా బినాకా గీత్‌మాలా విననిచ్చినందుకు..’ అని రాశాను. మా నాన్నకు హిందీ సినిమా పాటలపై కాదు కదా, తెలుగు సినిమా పాటలపై కూడా ఆసక్తి లేదు. ఆయనకు కర్ణాటక సంగీతమంటేనే యిష్టం. ఏటేటా కచ్చేరీలను నిర్వహించేవాడు. కానీ నా వెర్రిని అర్థం చేసుకుని నాకా కన్సెషన్ యిచ్చాడు. అంకితం చూసి కొందరన్నారు – ‘పిల్లల యిష్టాయిష్టాలను మన్నిస్తే చనిపోయిన దశాబ్దాల తర్వాతైనా వాళ్లకు గుర్తుంటాం.’ అని. ఇక రెండోది – అమీన్ సయానీ చెవుల్లో నా పేరు పడింది. ఆ సందర్భమేమిటంటే నా స్నేహితుడు దుర్గాప్రసాద్ ఒక పేపరు మిల్లులో క్వాలిటీ కంట్రోల్ హెడ్‌గా ఉన్నపుడు బొంబాయిలో ఒక డీలరు యింటికి వెళ్లాడు. మాటల్లో బినాకా గురించి చెపితే ‘అమీన్ సయానీ మీ కిష్టమా? అతను నా స్నేహితుడు, పక్కనే ఉంటాడు. రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచి కలిపిస్తాను.’ అన్నాడా వ్యాపారి. మర్నాడు అమీన్‌తో మా దుర్గాప్రసాద్ ‘మేం కాలేజీ రోజుల్లో మీ గురించే మాట్లాడుకునే వాళ్లం. మా స్నేహితుడు ఫలానా ప్రస్తుతం వ(ర)ల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో ఆర్‌జెగా పని చేస్తున్నాడు.’ అని చెప్పాడు. ఆయన ‘ఓహో’ అన్నాడు కానీ నాకు అదే పదివేలు.

అమీన్ సయానీ భౌతికంగా వెళ్లిపోయాడు కానీ నా ‘‘సరిగమ కారవాన్’’ ద్వారా నాకు తోడుగా ఉంటాడు. దానిలో ఒక ఛానెల్‌ను బినాకా గీత్‌మాలాకై కేటాయించారు. ఆయనకు యిదే నా ఆత్మీయ నివాళి. (ఫోటో – ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లేలతో అమీన్ సయానీ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)  

[email protected]