మరింత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ హాస్పిటల్, కొద్దిసేపటి కిందట హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ నిర్వహించిన తొలి రోజు పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన వెంటనే సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు.

ప్రాధమిక చికిత్స అనంతరం పీఈఎస్ వైద్య కళాశాల హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలను సంప్రదించారు కుటుంబ సభ్యులు.

బెంగళూరు నుంచి హృదయాలయ హాస్పిటల్ వైద్యులు కొంతమంది ప్రత్యేకంగా కుప్పం వచ్చి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని చెక్ చేశారు. షిఫ్ట్ చేయొచ్చని నిర్థారించుకున్న తర్వాతే రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బెంగళూరు హాస్పిటల్ కు తరలించారు.

అప్పట్నుంచి ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా తారకరత్న ఆరోగ్యం క్షీణించిందని ప్రకటించిన వైద్యులు, అత్యవసర చికిత్సను కొనసాగించక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.