జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇర‌కాటంలో ప‌డేసేలా ఫేక్ జీవో!

జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇర‌కాటంలో ప‌డేసేలా ఫేక్ జీవో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 62 నుంచి 65 ఏళ్ల‌కు పెంచుతూ జీవో ఎంఎస్ నంబ‌ర్ 15ను ఇవాళ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ట్టు జీవో కాపీ  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేష‌న్లు లేవ‌ని ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంగా ఉన్నారు. మ‌రోవైపు త‌మ బెనిఫిట్స్‌ను ప‌ట్టించుకోకుండా, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును అడ‌గ‌కుండానే ప్ర‌భుత్వం రెండేళ్లు పెంచింద‌ని ఉద్యోగులు విమ‌ర్శిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌రో మూడేళ్లు పెంచుతూ జీవో జారీ చేసిన‌ట్టు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప్ర‌భుత్వంపై కొన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త పెర‌గడానికి కార‌ణ‌మైంది. న‌ష్ట నివార‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య (ఏపీజీఈఎఫ్‌) చైర్మ‌న్ కాక‌ర్ల వెంక‌ట‌రామిరెడ్డి జీవో 15పై వివ‌ర‌ణ ఇచ్చారు.

ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమ‌ని ఖండించారు.  ప్రచారంలో ఉన్న జీవో కాపీ న‌కిలీద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఉద్యోగులెవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

ఎన్నిక‌లు స‌మీపించేకొద్ది వైసీపీకి న‌ష్టం క‌లిగించే ఇలాంటి ఫేక్ ప్ర‌చారాల‌ను ఇంకెన్ని చూడాల్సి వుంటుందో అనే చ‌ర్చ న‌డుస్తోంది. అక‌స్మాత్తుగా ఈ స‌మ‌యంలో ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుకు సంబంధించిన అంశం ఎందుకు తెర‌పైకి తీసుకొచ్చారో తేలాల్సి వుంది.