లోకేశ్ ప్ర‌త్య‌ర్థి...అక్క‌డి నుంచి పోటీ!

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి స్థాన చ‌ల‌నం త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగ‌ళ‌గిరి నుంచి 2014, 2019ల‌లో వ‌రుస‌గా రెండుసార్లు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గెలుపొందారు. రెండోసారి చంద్ర‌బాబునాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్‌పై గెలుపొంది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. లోకేశ్‌పై గెలిపిస్తే ఆళ్ల‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే మంత్రి ప‌ద‌వి మాత్రం ద‌క్క‌లేదు. జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకోలేద‌నే అసంతృప్తి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిలో బ‌లంగా వుంది.

ఇదిలా వుండ‌గా 2024 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌నున్నాయి. గెలుపే ప్రాతిప‌దిక‌న అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు సీఎం జ‌గ‌న్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ ప‌రిస్థితిలో మంగ‌ళ‌గిరిలో ఆళ్లను మార్చి, మ‌రొక బ‌ల‌మైన అభ్య‌ర్థికి ఇచ్చేందుకు జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని నిల‌బెట్ట‌డం ద్వారా లోకేశ్‌ను మ‌రోసారి ఓడించొచ్చ‌నే వ్యూహాన్ని జ‌గ‌న్ ర‌చిస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మంగ‌ళ‌గిరి అంటే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డే అనే రీతిలో ప‌రిచ‌యమ‌య్యారు. ఈ ద‌ఫా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ప‌ల్నాడు జిల్లాలో ఓ మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి పంపనున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. స‌ద‌రు మంత్రిపై అక్క‌డ వ్య‌తిరేక‌త ఉండ‌డం, అభ్య‌ర్థి మార్పు ద్వారా గెలుపు అవ‌కాశాల‌ను మెరుగుప‌ర‌చుకోవ‌చ్చ‌నే ఎత్తుగ‌డ‌తో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని అక్క‌డికి పంప‌నున్నార‌ని తెలిసింది. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌.

ఆ త‌ర్వాత 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలుపొందాయి. ప్ర‌స్తుతం అక్కడి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మంత్రి గుంటూరుకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఎప్ప‌టి నుంచో ఉన్నార‌ని టాక్‌. ఒక‌వేళ మ‌ళ్లీ ఆయ‌న‌కు అదే సీటు ఇచ్చినా గెల‌వ‌లేడ‌ని స‌ర్వే నివేదిక‌లు చెబుతున్నాయ‌ని వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా లాభం పొంద‌వ‌చ్చ‌ని సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకోనున్నార‌ని తెలిసింది.