Kalyanam Kamaneeyam Review: మూవీ రివ్యూ: కళ్యాణం కమనీయం

చిత్రం: కళ్యాణం కమనీయం
రేటింగ్: 2/5
తారాగణం: సంతోష్ శోభన్, ప్రియ భవాని శంకర్, సత్యం రాజేష్, దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్, సప్తగిరి తదితరులు
కెమెరా: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటింగ్: జి సత్య
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: యువి కాన్సెప్ట్స్
దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల
విడుదల తేదీ: జనవరి 14, 2023

కొత్త కాన్సెప్ట్ కథలతో పలకరిస్తూ ఈ మధ్యన తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్న నటుడు సంతోష్ శోభన్. తన సినిమా అంటే రొటీన్ గా ఉండకుండా ఏదో ఒక విశేషం ఉంటుందని ప్రేక్షకులకి ఒక అంచనా. అయితే ఆ అంచనాలు ఈ "కళ్యాణం కమనీయం" అందుకుందా! చూద్దాం. 

శ్రుతి (ప్రియ), శివ (శంతోష్) కొత్తగా పెళ్లైన జంట. శ్రుతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. శివకి టేలెంట్ ఉన్నా అనేక కారణాల వల్ల ఉద్యోగం రాదు. శ్రుతి శివని చిరాకుపడుతూ ఉంటుంది. తన భర్తకి ఉద్యోగం లేదన్న విషయం తనకి తలవొంపులుగా ఉంటుంది. మొత్తానికి అన్ని మార్గాలు బెడిసి కొట్టడంతో చేసేది లేక సాఫ్ట్ వేర్ ఉద్యోగమొచ్చిందని అబద్ధమాడి ప్రియకి తెలియకుండా క్యాబ్ డ్రైవర్ గా పని మొదలుపెడతాడు శివ. మరో పక్క శ్రుతితో తన మేనజర్ (సత్యం రాజేస్ష్) అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. అక్కడి నుంచి ఆ జంట ఎదుర్కునే సవాళ్లు వగైరా తక్కిన కథ.  

ఇంతకంటే ప్లాట్ ఏం లేదు. చాలా సాదాసీదా కథ. ఈ కథని చెప్పకపోయినా మొదటి 30 నిమిషాలు చూసాక తర్వాతి 76 నిమిషాలు ఎలా ఉండబోతున్నాయో ఇట్టే చెప్పేయొచ్చు. అవును..సినిమా నిడివి కేవలం  1 గంట 46 నిమిషాలు ఉండడం చాలా ప్లస్సయ్యింది. లెంగ్త్ కోసం అనవసరంగా లాగకుండా ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పి ముగించిన విధానం బాగుంది. 

రచనలో లోపాలున్నాయి. తెర మీద పాత్రలు షాకౌతుంటాయి కానీ, ఎన్నో సినిమాలు చూసిన అనుభవమున్న ప్రేక్షకులు అస్సలు టెన్షన్ పడరు. ఎందుకంటే అంత ప్రెడిక్టిబుల్ గా నడుస్తుంటుంది కథనం. చారి పాత్ర ఎలా టర్న్ తీసుకుంటుందో చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారేమో. అయితే అంతా రొటీన్ గానే ఉన్నా హీరో హీరోయిన్ల ఆంగిక, అభినయాలు ఎక్కడా విసిగించకుండా కూర్చోబెడతాయి.  

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది పాటల గురుంచి. సందర్భోచితంగా వచ్చే గీతాల్లో సాహిత్యం యాప్ట్ గా ఉంటూ ట్రెండీగా కూడా ఉంది. మ్యూజిక్ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా బాగుంది. కెమెరా పనితనం వగైరాలు ఓకే. ఎడిటర్ ఈ సినిమాకి హీరో అని చెప్పాలి. సెన్సార్ సర్టిఫికేట్ మీద 106 నిమిషాలు అని కనపడగానే పెద్ద రిలీఫ్ కలుగుతుంది. 

రచన, దర్శకత్వం విషయాలకి వస్తే రచన పాత పద్ధతిలోనే ఉంది. తాను స్వయంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యుండి, తన కంపెనీలోనే అతనికొక ఉద్యోగం కోసం ప్రయత్నించి కూడా భర్తకి ఎంత సబ్జెక్ట్ తెలుసో కనీసం అంచనా వేయకపోవడం, తన సొంత ట్యాలెంటుతో ఉద్యోగం సంపాదించినా వేరే వాళ్ల డబ్బు పవర్ వల్లో, లాబీయింగ్ వల్లో చేతికొచ్చిన ఉద్యోగాలు పోవడం, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకొస్తే గద్దలాగ ఎవడో తన్నుకుపోవడం ఇవన్నీ 1990ల నాటి సినిమా కష్టాలు. ఇందులో ఏదీ కొత్తది లేదు. దర్శకత్వం మాత్రం ట్రెండ్ కి తగ్గట్టే ఉంది. 

సంతోష్ శోభన్ మంచి నటుడుగా మరోసారి నిరూపించుకున్నాడు. లవబుల్ గా మారుతున్నాడు. సరైన కథలు పడితే అతని కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది. 

ప్రియ భవాని శంకర్ చూడడానికి బాగుంది. నటన కూడా బాగా చేసింది. 

సత్యం రాజేష్, దేవి ప్రసాద్, కేదార్ శంకర్ తమ ఉనికిని చాటుకున్నారు. పవిత్ర లోకేష్ ఓకే. చారి పాత్రధారి, హీరో ఫ్రెండ్ గా కనిపించిన సద్దాం కూడా తమ పరిధుల్లో పర్వాలేదనిపించారు. 

ఈ సినిమాలో ప్రధానమైన ప్లస్ నిడివి అయితే, ముఖ్యమైన మైనస్ ఎక్కడా ఊహించని ట్విస్టులు లేకపోవడం. అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, అజిత్, విజయ్ ల సినిమాలు పులుల్లాగ, సింహాల్లాగ థియేటర్స్ వద్ద వీరంగం చేస్తున్న ఈ పండగ తరుణంలో ఒక జింకపిల్లలాగ ఈ "కళ్యాణం కమనీయం" కూడా రావడం సాహసమే. నిజానికి ఈ సీజన్ పుణ్యామా అని గట్టెక్కొచ్చేమో కూడా. పెద్దగా ఖర్చు కూడా కంటికి కనపడని చిత్రమిది. 

బాటం లైన్: కళ్యాణమే కానీ కమనీయం కాదు