Top Gear Review: మూవీ రివ్యూ: టాప్ గేర్

టైటిల్: టాప్ గేర్
రేటింగ్: 2/5
తారాగణం: ఆది సాయికుమార్, రియా సుమన్, మిర్చి హేమంత్, బ్రహ్మాజి, సత్యం రాజేష్, మైం గోపి తదితరులు
కెమెరా: సాయి శ్రీరాం
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాత: కెవి శ్రీధర్ రెడ్డి
దర్శకత్వం: కె శశికాంత్
విడుదల: 30 డిసెంబర్ 2022

ఆది సాయికుమార్ వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఏది ఎప్పుడొస్తోందో తెలీకుండా పోతోంది. ఏ మాత్రం పసలేని సినిమాలు చేస్తూ కనీసం ప్రీ రిలీజ్ బజ్ కూడా వర్కౌటవ్వని విధంగా సాగుతోంది అతని కెరీర్. ఈ ఏడు అతిథి దేవోభవ, బ్లాక్, తీస్మార్ ఖాన్, క్రేజీ ఫెలో అని నాలుగు సినిమాలొచ్చినా ఊసులోలేకుండా పోయాయి. సంవత్సరాంతంలో "టాప్ గేర్" అంటూ ఈ రోజొకటి విడుదలయింది. టైటిల్లో ఉన్న ఫోర్స్ కనీసం సగంలో సగమున్నా ఈ సెలవల సీజన్లో ఒకవర్గం ప్రేక్షకులైనా ఆదరించే అవకాశముంది. ఇంతకీ ఎలా ఉంది? విషయంలోకి వెళ్దాం. 

కథానాయకుడు ఒక క్యాబ్ డ్రైవర్. అతనికి పెళ్లవడంతోనే ఫస్ట్ సీన్ మొదలవుతుంది. మరోపక్క ఒక డ్రగ్ డీలర్ తెరమీదకొస్తాడు. ఈ పాత్ర మైం మధు చేసాడు. అనుకోని పరిస్థితుల్లో మన హీరో ఆ డ్రగ్ మాఫియా ట్రాప్లో పడతాడు. పర్యవసానంగా అతని భార్య కూడా ప్రమాదంలో చిక్కుకుంటుంది. అక్కడి నుంచి ఎలా బయటపడతాడు, భార్యనెలా కాపాడుకుంటాడు అనేది తక్కిన కథ. 

కథ ఎలాగైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. విషయమంతా కథనంలోనే ఉంటుంది. విలన్ ఇంట్రడక్షన్ సీన్లో కలియుగ ధర్మం మీద ఒక డైలాగ్ కొడతాడు. అది విని మంచి డెప్త్ ఉన్న క్యారక్టర్లతో కూడిన కథ చూడబోతున్నాం అనిపిస్తుంది. కానీ క్రమంగా కథ రొటీన్ రొట్టకొట్టుడులోకి వెళ్లి చిన్నపిల్లలాడే దొంగాపోలీసాటలా మారుతుంది. 

సినిమా మొత్తాన్ని రోడ్ల మీద నైట్ ఎఫెక్ట్లో తీయడం విశేషం. వేరే లోకేషన్స్ హడావిడి లేదు. ఆ రకంగా నిర్మాతని సుఖపెట్టినట్టే. పేరున్న ఆర్టిస్టులున్నా వాళ్లందరివీ ఒకటి రెండు రోజుల కాల్షీట్ల వ్యవహారంలా ఉంది. అన్ని పాత్రలూ కేమియోకి ఎక్కువ, ఫుల్ లెంగ్త్ కి తక్కువ అన్నట్టున్నాయి. 

పేరుకి "టాప్ గేర్" కానీ అసలు కథ ఇంటెర్వల్ కి చేరినా కూడా ఫస్ట్ గేర్లో అక్కడక్కడే తిరిగి న్యూట్రల్లో పెట్టి ఆపినట్టుంటుంది. సెకండాఫులో అన్నా టాప్ గేర్ పడుతుందా అంటే అది ఇంకా దారుణం. ఫస్ట్ గేర్ వేసి స్లోప్ ఎక్కుతున్న ఫీలింగొస్తుంది. ఎక్కడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని గోళ్లు కొరుక్కునేలాంటి సన్నివేశాలు లేవు. క్రైం బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాకి ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలు ఇందులో లేవు. కథగా రాసుకున్నప్పుడు ఏవో కొన్ని ట్విస్టులు పెట్టుకున్నా అవి తెరమీదకి తేవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

సాంకేతికంగా చూసుకుంటే ప్రధమార్ధంలో ఒక పాటుంది. అది గుర్తుండేలా అయితే లేదు. ఇంకెక్కడా మనకి పాటలు వినపడవు. అయితే అది ఈ సినిమాకి మైనస్ కాదు..ప్లస్సే. ఎందుకంటే కనీసం ఇంకొక్క పాటున్నా ప్రేక్షకుల సహనానికి ఐఐటీ పరీక్ష పెట్టినట్టుండేది. నేపథ్య సంగీతం పర్వాలేదు. మైనస్సైతే కాదు. 

కథ రాసుకోవడంలోనే ఎక్కడా ఐక్యూ లేదు. అన్నీ తమకు అనుకూలంగా రాసుకోవడం వల్ల ఎక్కడా చాలెంజ్ కనపడదు. హీరోయిన్ సరిగ్గా కింద పడున్న వాకీటాకీ అందుకున్నప్పుడే ఫలానా వాడు హత్యలు చేసి తప్పించుకున్నాడని వినపడడం సీన్ అనుకూలంగా రాసుకోవడానికి పరాకష్ట. ఫస్టాఫులో లేజర్ గన్స్ తో వచ్చిన పోలీసులకి ఏదో గాజు గ్లాస్ విసిరి డైవెర్ట్ చేసి ప్రతిదాడి చేస్తాడు విలన్. అదేంటో సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు. హాలీవుడ్ దర్శకులే దీనికి భాష్యం రాయాలి.

ఎడిటింగ్ ని మాత్రం మెచ్చుకోవాలి. ఎక్కడా సాగతీత లేకుండా త్వరగా ముగించాడు ఈ బాలలచిత్రాన్ని. 

ఆది నటన బాగానే ఉంది కానీ అతని కథాకథనాల ఎంపికే దెబ్బకొట్టింది. రియా సుమన్ చూడ్డానికి బాగుంది. హీరోయిన్ గా పెద్ద నిడివైతే లేదు.

బ్రహ్మాజి, సత్యం రాజేష్ లు కాసేపు కనిపించినా వాళ్ల మార్కు క్యారెక్టరైతే లేదు. సుపారీ హంతకుల్లాగ కాసేపు కనిపించి టపా కట్టేసారు. 

మెయిన్ విలన్ గా మైం మధు మాత్రం నిండుగా ఉన్నాడు. పాత్రకి తగ్గట్టుగా సరిపోయాడు. దువ్వాసి మోహన్ లాంటి వాళ్లు ప్యాడింగ్ ఆర్టిస్టులుగా దర్శనమిచ్చారు. ఏసీపీగా శత్రు విగ్రహం బాగానే ఉన్నా అత్యంత పేలవమైన క్యారెక్టర్ కావడంతో తేలిపోయాడు. 

తక్కువ బజెట్లో చుట్టేసినట్టుగా ఉన్న సినిమాకి కాస్తైనా టెన్షన్ పెట్టే కథనం తోడై ఉంటే మంచి ఫలితం దక్కేది. ప్రేక్షకులు సినిమా చూస్తూ టెన్షన్ పడలేదు కాబట్టి నిర్మాత ఫలితాన్ని చూసి టెన్షన్ పడాల్సిరావొచ్చు. టాప్ గేర్ వేసుకుని బండి ముందుకు దూసుకుపోతుందనుకుంటే రివర్స్ గేరేసుకుని బండి వెనక్కెళ్లి గోడకి గుద్దేసుకున్నట్టయింది.  

బాటం లైన్: రివర్స్ గేర్