ఎమ్బీయస్‍: రాజశ్రీ వారి ‘దోస్తీ’

సంగీతభరిత కుటుంబగాథా చిత్రాలకు పేరుబడిన రాజశ్రీ ప్రొడక్షన్స్ మూలసంస్థ రాజశ్రీను తారాచంద్ బర్జాత్యా 1947లో డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ముంబయిలో ప్రారంభించారు. అంటే ప్రారంభించి 75 ఏళ్లు అయిందన్నమాట. అనేక చిత్రాలను పంపిణీ చేసి, లాభాలార్జించాక 1962లో ‘‘ఆరతి’’ సినిమాతో సినీనిర్మాణంలోకి దిగారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు తీశారు. వాటిల్లో కొన్నిటి పేర్లు చెపితే రాజశ్రీ ఘనత తెలుస్తుంది. ‘‘దోస్తీ’’ (1964), ‘‘ఉపహార్’’ (1971), ‘‘పియా కా ఘర్’’ (1972), ‘‘సౌదాగర్’’ (1972), ‘‘గీత్ గాతా చల్’’ (1975), ‘‘చిత్‌చోర్’’ (1976), ‘‘దుల్హన్ వహీ జో పియా మన్‌భాయే’’ (1977), ‘‘అఖియోంకె ఝరోఖోం సే’’ (1978), ‘‘సారాంశ్’’ (1984),‘‘మైఁ నే ప్యార్ కియా’’ (1989), ‘‘హమ్ ఆప్‌కే హైఁ కౌన్’’ (1994), ‘‘హమ్ సాథ్ సాథ్ హైఁ’’ (1999), ‘‘వివాహ్’’(2006), ‘‘ప్రేమ్ రతన ధన్ పాయో’’ (2015)... తాజాగా క్రితం నెలే విడుదలైన ‘‘ఊంచాయీ’’ ఓ మాదిరిగా ఉందన్నారు.

సినిమా ఖర్చులో ముప్పావు తారాగణం పారితోషికాలకు, డైరక్టర్ పారితోషానికి ఖర్చు పెట్టే యీనాటి నిర్మాతలు రాజశ్రీ ప్రొడక్షన్స్ నుంచి చాలా నేర్చుకోవాలి. వాళ్లు చక్కటి కథను ఎంచుకునే వారు. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను, అవి చిన్న తరహా సినిమాలైనా సరే, హిందీలోకి రీమేక్ చేసేవారు. కొత్తవాళ్లను, పేరు లేని తారలను పెట్టుకునేవారు. కొత్త టెక్నీషియన్లకు అవకాశాలిచ్చేవారు. మార్కెట్ డిమాండ్ ఉన్న డైరక్టర్ల జోలికి వెళ్లకుండా, ప్రతిభావంతులై ఉండి, ప్రస్తుతం తీరికగా ఉన్న డైరక్టర్లకు సినిమాలను అప్పగించేవారు. వాళ్లు కథ, స్క్రీన్‌ప్లే వగైరాలను పక్కాగా తయారుచేసుకుని, షూటింగు ప్లాను చేసుకుని, సాధ్యమైనంత వరకు ఇన్‌డోర్‌లో, అతి తక్కువ ఖర్చులో సినిమాను తీసేవారు. పాటలపై ఎంతో శ్రమించి, సంగీతభరిత చిత్రాలుగా రూపొందించేవారు. రాజశ్రీవాళ్లు పిసినారితనానికి పేరుబడ్డారు. కానీ వాళ్ల సినిమాల్లో వేసినవారిలో ఎందరో పెద్దపెద్ద తారలయ్యారు. వారి సినిమాల్లో ‘‘దోస్తీ’’ (1964) గురించి, దానిలో నటించిన యువకుల జీవితాల గురించి రాస్తాను.

‘‘దోస్తీ’’ (1964) రాజశ్రీ వారి రెండో చిత్రం. మొదటిది 1962లో అంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టిన 15 ఏళ్లకు, తీసిన ‘‘ఆరతీ’’ ఒక నాటకం ఆధారంగా ఫణి మజుందార్ దర్శకత్వంలో తయారైంది. అప్పటికి పెద్ద తారలైన మీనాకుమారి, ప్రదీప్ కుమార్, అశోక్ కుమార్, శశికళ ముఖ్యతారాగణం. ప్రసిద్ధ సంగీతదర్ళకుడు రోషన్ (‘కభీతో మిలేగీ’, ‘అబ్ క్యా మిసాల్ దూఁ’, ‘ఆప్‌నే యాద్ దిలాయా’ వంటి మంచి పాటలున్నాయి)ను పెట్టుకున్నారు. సినిమాకు పేరూ వచ్చింది, డబ్బూ వచ్చింది. ఆ ఉత్సాహంలో రెండో సినిమా మరింత ఖర్చు పెట్టి తీయాలని అనుకోలేదు. రూ. 4 లక్షల్లో ప్లాను చేశారు. అగ్రదూత్ అనే దర్శకుడు తీసిన బెంగాలీ సినిమా ‘‘లాలూ-భూలూ’’ (1959) అనే సినిమాను ‘‘దోస్తీ’’ పేర సత్యేన్ బోస్ దర్శకత్వంలో తలపెట్టారు.

అది యిద్దరు మిత్రుల కథ. ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. కుంటివాడు మౌత్‌ఆర్గన్ వాయించడంలో నిపుణుడు కాగా గుడ్డివాడు మంచి పాటగాడు. అనాథలై రోడ్డున పడ్డ యీ యిద్దరూ కలిసి బిచ్చమెత్తుకోసాగారు. ఓ రోగగ్రస్తురాలైన పాప వీరి సంగీతం విని ఆత్మీయురాలైంది. ఆ పాపకు ఆయాగా చేరినామెను పాప అన్న యిష్టపడ్డాడు. ఆ అయా గుడ్డివాడి అక్కే. వరదల్లో విడిపోయారు. తను ఫలానా అని తెలిస్తే పాప అన్నగారు దూరం పెడతాడనే భయంతో ఆయా, గుడ్డివాడు తన తమ్ముడే ఐనా, ఎవరో తెలియదన్నట్లు నటించింది. కుంటివాడికి చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చిందన్న బాధ ఉంది. గుడ్డివాడు తను బిచ్చమెత్తుతూ మిత్రుణ్ని చదివిస్తానన్నాడు.

కుంటివాడి శ్రద్ధ చూసి స్కూల్లో మేస్టారు గార్డియన్‌గా ఉండి యింకా చదివిస్తాను, కానీ ఆ గుడ్డివాణ్ని, ఆ ముష్టి వాతావరణాన్ని వదిలేసి రావాలని షరతు పెట్టాడు. చదువుపై లోభంతో కుంటివాడు సరేనన్నాడు. గుడ్డివాడు ఒంటరి అయ్యాడు. అటు అక్క తనను నిరాకరించిన విషయం కూడా అతనికి తెలిసి బాధతో కృంగిపోయాడు. మేస్టారు చనిపోవడంతో తన స్నేహితుడి పరీక్ష ఫీజు కట్టలేక పోతున్నాడని తెలుసుకుని, అనారోగ్యంతో ఉన్నా పాటలు పాడి, డబ్బు సంపాదించి ఫీజు కట్టాడు. ఆస్పత్రి పాలయ్యాడు. అక్క వచ్చి సేవలు చేసి, క్షమాపణ కోరింది. కుంటివాడికి మిత్రుడి త్యాగం తెలిసి అతనూ వచ్చి చేరువయ్యాడు. కథ సుఖాంతమైంది.

కథలో హీరోలు యిద్దరూ పేద కుర్రాళ్లే. ఒకరు గుడ్డి, మరొకరు కుంటి. పైగా దారిద్ర్యపు బాధలు. కాస్త కంటికి నదురుగా కనబడేది, పాప అన్నగా వేసిన సంజయ్ ఒక్కడే. అతని వేషం చిన్నది. సినిమాలో చిన్న పాప ఉంది కానీ ఆమె అనారోగ్యం పాలై చచ్చిపోతుంది. ఈ విషాదగాథలో గుడ్డివాడి పాటలే ప్రేక్షకులను అలరించాలి. 1964లో రిలీజవుతున్న సినిమాలు రాజ్ కపూర్, వైజయంతిమాల, రాజేంద్ర కుమార్ నటించి, తొలిసారి విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘‘సంగమ్’’, గ్లామర్ క్వీన్ సాధనా, శమ్మీ కపూర్ జంటగా నటించిన ‘‘రాజ్‌కుమార్’’, శమ్మీ కపూర్, అందాల తార శర్మిలా టాగోర్ నటించిన ‘‘కశ్మీర్ కీ కలీ’’. మూడూ వర్ణచిత్రాలే. రెండిటికి సంగీతదర్శకులు శంకర్-జైకిషన్. మూడోదానికి ఓపి నయ్యర్. వారితో పోటీ పడడానికి యీ బ్లాక్ అండ్ వైట్ సినిమాకు సంగీతదర్శకులుగా లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌లను ఎంచుకుంది రాజశ్రీ.

కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీలతో పాటు అనేక మంది సంగీతదర్శకుల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసిన లక్ష్మీ-ప్యారేలకు అప్పటికే విడిగా అవకాశాలు రాసాగాయి. ‘‘పారస్‌మణి’’ (1963) మ్యూజికల్ హిట్ కాగా ‘‘హరిశ్చంద్ర తారామతి’’ (1963)లో రెండు పాటలు బాగుంటాయి. 1964లో ‘‘దోస్తీ’’తో పాటు ‘‘ఆయా తూఫాన్’’, ‘‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’’, ‘‘సంత్ జ్ఞానేశ్వర్’’, ‘‘సతీ సావిత్రి’’ విడుదలయ్యాయి. అన్నీ లోబజెట్ సినిమాలే అయినా మంచి సంగీతానికి పేరుబడ్డాయి. ‘‘దోస్తీ’’ సంగీతం ఎంత గొప్పగా ఉందంటే 1965 ఫిల్మ్‌ఫేర్ ఎవార్డులకై ‘‘సంగమ్’’,‘‘ఓ కౌన్ థీ’’లతో పోటీ పడి ఎవార్డు గెలుచుకుంది. లక్ష్మీ-ప్యారేల విజయప్రస్థానం తిరుగులేకుండా సాగింది. ‘‘దోస్తీ’’లో ప్రతీ పాటా ఆణిముత్యమే. రఫీ కెరియర్‌లో గర్వంగా చెప్పుకోదగిన పాటలవి.

ఈ సినిమాలో రోగగ్రస్తురాలైన పాప అన్న పాత్ర వేసిన సంజయ్ (తర్వాత సంజయ్ ఖాన్ అని పేరు మార్చుకున్నాడు) ‘‘హకీకత్’’ (1964)లో ఒక సైనికుడి పాత్ర వేశాడంతే. ‘‘దోస్తీ’’తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 1966లో వచ్చిన ‘‘దస్ లాఖ్’’తో పెద్ద హీరో అయిపోయాడు. ఇక ముఖ్యపాత్రలకై తారాచంద్ ఎంపిక చేసిన యిద్దరు కుర్రవాళ్లలో ఒకతను గుడ్డివాడిగా వేసిన సుధీర్ కుమార్ సావంత్. శాంతారాం స్టూడియోస్‌లో చీఫ్ మేకప్‌మన్‌గా ఉన్న ప్రభాకర్‌కు మేనల్లుడు. చదువుకుంటూండగానే ‘‘సంత్ జ్ఞానేశ్వర్’’ సినిమాలో ప్రధానపాత్ర వేశాడు. అదీ లో-బజెట్ సినిమాయే. దానికీ లక్ష్మీ-ప్యారేయే సంగీతదర్శకులు. ‘జ్యోత్ సే జ్యోత్ జలాతే చలే’ పాటు దుమ్ము దులిపేసింది. ‘‘దోస్తీ’’ తర్వాత రిలీజై సూపర్ హిట్టయింది. కుంటివాడిగా వేసినది సుశీల్ కుమార్ సోమయా. తండ్రి పోవడంతో యితను పదో ఏటే ఒక సింధీ సినిమాలో బాలనటుడిగా చిత్రసీమలో ప్రవేశించి ‘‘ధూల్ కా ఫూల్’’ (1959) ‘‘జీనా సీఖ్ లియా’’ (1960), ‘‘కాలాబజార్’’ (1960) వంటి 23 సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేశాడు.

నటులిద్దరూ స్కూలుకి వెళ్లే వయసులో ఉన్నారు కాబట్టి, స్కూలుకి సెలవులు యిచ్చినపుడే నిర్మాత షూటింగు పెట్టుకున్నారు. నెలకు రూ.200 జీతంపై ఐదేళ్లపాటు మూడు సినిమాలకు కాంట్రాక్టు రాయించుకుని అవకాశమిచ్చారు. ‘‘దోస్తీ’’ షూటింగు నాలుగు నెలల్లో పూర్తయిపోయింది. సినిమా రిలీజైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. పిల్లలిద్దరికీ ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ బయటకు వెళ్లి చేద్దామంటే రాజశ్రీతో ఒప్పందం అడ్డుపడింది. దాని కారణంగా సుశీల్ ఎంజిఎం తీసిన ఇంగ్లీషు సినిమా ‘‘మాయా’’ (1966) ఛాన్సు వదులుకోవలసి వచ్చింది. అది సాజిద్‌కు పోయింది. అలాగే, ‘‘గునాహోం కా దేవ్‌తా’’ (1967), ‘‘అనోఖీ రాత్’’ (1968) కూడా వదులుకోవలసి వచ్చింది. ‘‘దోస్తీ’’ అద్భుత విజయం తర్వాత వీళ్ల జీతాన్ని నెలకు రూ.300 చేశారు. ఏడాదిన్నర పాటు ప్రతీ రోజూ రాజశ్రీ ఆఫీసుకి వెళ్లడం, అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టడం, నెల తిరిగేటప్పటికి జీతం తీసుకోవడం.. యిదే వాళ్ల పని.  

‘‘దోస్తీ’’ అఖండ విజయం సాధించినా, రాజశ్రీ వాళ్లు తర్వాతి సినిమా తీయడానికి తాత్సారం చేశారు. చివరకు ‘‘తక్‌దీర్’’ (1967) అనే సినిమా తీస్తూ చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేశారు. వారిలో జలాల్ ఆఘా, సుభాష్ ఘాయ్, ఫరీదా జలాల్ ఉన్నారు. పబ్లిసిటీ బాగానే యిచ్చారు కానీ సినిమా ఫెయిలైంది. సుశీల్‌కు రూ.2000 పారితోషికంగా యిచ్చారు. రాజశ్రీ వారి కాంట్రాక్ట్ ముగిసినా, సుశీల్‌కు సినిమా ఛాన్సులేవీ రాలేదు. డిగ్రీ పూర్తి చేసుకుని, బ్లేజ్ ఎడ్వర్టయిజింగ్ సంస్థలో నెలకు రూ.200ల జీతంపై చేరాడు. రెండేళ్లు పనిచేశాక 1969లో ఎయిర్ ఇండియాలో పర్శర్ (కాబిన్ మేనేజరు)గా రూ.790 జీతంపై చేరాడు. ఇంటర్వ్యూలో తను ‘‘దోస్తీ’’లో కుంటివాడిగా వేశానని చెప్పగానే యింటర్వ్యూ చేసే అధికారి లేచి షేక్‌హేండ్ యిచ్చాడు. అదే ఉద్యోగంలో 2003 వరకు పని చేసి, జీవితాన్ని సుఖంగా గడిపి ముంబయిలో స్థిరపడ్డాడు.

ఇద్దరిలో ఎక్కువ పేరు తెచ్చుకున్న అంధబాలుడు పాత్రధారి సుధీర్ జీవితం మరోలా సాగింది. దక్షిణాదికి చెందిన ఎవిఎం సంస్థ తమిళంలో తాము తీసిన ‘‘అన్నై’’ సినిమాను హిందీలో ‘‘లాడ్లా’’ (1966)గా తీస్తూ ఒక ప్రధానపాత్రను సుధీర్‌కు ఆఫర్ చేసింది. రాజశ్రీ వాళ్లు ఒప్పందం పేరుతో కాలడ్డారు. కాదంటే తమకు భారీ పరిహారం యిమ్మన్నారు. ఎవిఎం వాళ్లిచ్చిన భూరి పారితోషికంలోంచి రాజశ్రీకి చెల్లించేసి, అతను కాంట్రాక్టు నుంచి బయటపడ్డాడు. ‘‘లాడ్లా’’లో బలరాజ్ సాహ్ని, నిరూపా రాయ్ వంటి ప్రముఖులున్నా, లక్ష్మీ-ప్యారే సంగీతం ఉన్నా సినిమా ఫెయిలయింది. సుధీర్ వెంటనే మరాఠీ సినిమాలు ఒప్పుకున్నాడు. ‘‘ఘర్చీ రాణీ’’, ‘‘మా’’, ‘‘అన్నపూర్ణా’’,‘‘వాహిని తూ జావో నక్కో’’ వంటి సినిమాల్లో వేసినా అవీ ఆడలేదు. కానీ సుధీర్‌కు తను పెద్ద హీరోనన్న అహంభావం తలకెక్కి పోయింది. కొందరు మిత్రులు వచ్చి నాటకాల్లో వేయమన్నా వేసేవాడు కాడు. ‘‘నా ఫ్రెండు జితేంద్రకు రూ.5 లక్షలిస్తున్నారు. నాదీ అదే స్థాయి. నాటకాల్లో వేస్తే అది తగ్గిపోతుంది.’’ అనేవాడు.

వేషాలు రావడం మానేసినా సుధీర్ తన ధోరణి మార్చుకోలేదు. 9వ తరగతిలోనే చదువుకి స్వస్తి చెప్పాడు కాబట్టి, ఉద్యోగాలు రాలేదు. విపరీతంగా సిగరెట్లు, మద్యం తాగేవాడు. 35వ ఏట పెళ్లి చేసుకున్నాడు. భార్య ఉద్యోగం చేస్తూంటే తను నిర్వ్యాపారంగా కూచునేవాడు. షోకులు మాత్రం మానేవాడు కాదు. కూతురు పుట్టినా బాధ్యతలు తలకెత్తుకోలేదు. చివరకు గొంతు కాన్సర్‌తో 1993లో 45వ ఏట చనిపోయాడు. అలా అతని జీవితం విషాదంగా ముగిసింది. ‘‘దోస్తీ’’ సినిమాను తెలుగులో ‘‘స్నేహం’’ పేర బాపు దర్శకత్వంలో తీశారు. దానిలో గుడ్డివాడి పాత్రలో వేసిన సాయికుమార్ తర్వాతి రోజుల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కుంటివాడి పాత్ర వేసిన రాజాకృష్ణ అనే అతను తర్వాత సినిమాల్లో ఎక్కడా కనబడలేదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]