వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తు బ‌దిలీ...ఇదీ తీర్పు!

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తు బ‌దిలీపై ఉత్కంఠ‌కు సుప్రీంకోర్టు తెర‌దించింది. ఆంధ్రాలో సీబీఐ విచార‌ణ‌కు అడ్డంకులు ఎదుర‌వుతున్నాయ‌ని, కావున ప‌క్క రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై జ‌స్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలో ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ఇప్ప‌టికే విచార‌ణ పూర్తి చేసింది.

ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించి, ఉత్కంఠ‌కు తెర‌దించింది. హ‌త్య కేసు విచార‌ణ‌ను తెలంగాణ రాష్ట్రానికి బ‌దిలీ చేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఉత్త‌ర్వులిచ్చింది. వివేకా కుమార్తె, భార్య ఏపీలో విచార‌ణ‌పై అసంతృప్తిగా ఉన్న నేప‌థ్యంలో, వారి ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బ‌దిలీ చేస్తున్న‌ట్టు సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

దీంతో వివేకా హ‌త్య విచార‌ణ అంశం తెలంగాణ ప‌రిధిలోకి వెళ్లిన‌ట్టైంది. ఇక మీద‌ట ఏపీ పోలీసులు, ఇత‌ర‌త్రా ప్ర‌భావం వివేకా హ‌త్య విచార‌ణ‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. విచార‌ణ తెలంగాణ రాష్ట్రానికి మారిన ప‌రిస్థితిలో సీబీఐ త్వ‌ర‌గా తేలుస్తుందా? లేక మ‌రేదైనా సాకుతో ఎప్ప‌ట్లానే తాత్సారం చేస్తుందా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

మొత్తానికి వివేకా కుమార్తె, కుటుంబ స‌భ్యులు కోరుకున్న‌ట్టుగానే త‌న అన్న పాలిస్తున్న రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి విచార‌ణ మారింది. ఇప్ప‌టికైనా ఆమెకు న్యాయం జ‌రుగుతుందేమో చూద్దాం.