రఘురామ విచార‌ణ‌లో సిట్ ట్విస్ట్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విచార‌ణ‌లో ట్విస్ట్‌. ఇవాళ విచార‌ణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని సిట్ ఈమెయిల్ ద్వారా స‌మాచారం అందించింది. సిట్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందో అనే ఆలోచ‌న‌లో ర‌ఘురామ ప‌డ్డారు. తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో నిందితుల‌తో ర‌ఘురామ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర‌లో ర‌ఘురామ త‌న వంతు పాత్ర పోషించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి విచార‌ణ సంస్థ సిట్‌కు ఆధారాలు దొరికాయ‌ని అంటున్నారు. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చ‌డానికి విచార‌ణ‌కు రావయ్యా ర‌ఘురామ అని నోటీసు పంపింది. ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌క‌ల్లా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వుంది. అయితే ర‌ఘురామ ఇప్ప‌టికీ ఢిల్లీలో ఉన్నారు.

ఎప్ప‌ట్లాగే విచార‌ణ అంటే ఆయ‌న‌కు అనారోగ్యం బాధ పెట్ట‌డం తెలిసిందే. ర‌ఘురామ ఢిల్లీలోనే వుండ‌డం, మ‌రోవైపు ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యిస్తుండడంతో సిట్ త‌న వ్యూహాన్ని మార్చుకుంది. ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్‌కు డిసెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా హైకోర్టు స‌డ‌లింపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ర‌ఘురామ‌కు కూడా కోర్టులో ఊర‌ట ల‌భిస్తుంద‌ని సిట్ భావించింది.

దీంతో హైకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వ‌ర‌కూ వెళ్ల‌కుండా, అంత‌కు ముందే సిట్ తెలివిగా ర‌ఘురామ‌కు నోటీస్ పంపింది. ఇవాళ విచార‌ణకు హాజ‌రు కాన‌వ‌స‌రం లేద‌ని, మ‌ళ్లీ అవ‌స‌ర‌మ‌నుకుంటే పిలుస్తామంటూ ర‌ఘురామ‌కు మెయిల్ పంపింది. డిసెంబ‌ర్ 5వ తేదీ త‌ర్వాత బీఎల్ సంతోష్ విష‌యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసుకుని, ఆ త‌ర్వాత ర‌ఘురామ ప‌నిప‌ట్టే ప‌నిలో సిట్ వున్న‌ట్టు స‌మాచారం. ఏపీ సీఐడీని బోల్తా కొట్టిస్తున్న‌ట్టుగా, త‌మ ద‌గ్గ‌ర ఆట‌లు సాగ‌వ‌ని సిట్ త‌న వ్యూహాల‌తో చెప్ప‌క‌నే చెప్పింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.