బాబు మౌనం...అమ‌రావ‌తి ప‌ని అయిపోయిన‌ట్టేనా?

రాజ‌ధాని అంశంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ...భ‌విష్య‌త్‌లో ఏం జ‌ర‌గ‌నుందో అంద‌రి కంటే బాగా చంద్ర‌బాబుకు తెలిసొచ్చింది. సుప్రీంకోర్టు కామెంట్స్ జ‌గ‌న్ స‌ర్కార్‌కు షాక్ అని ఎల్లో మీడియా డిబేట్లు చేస్తూ, అదో తుత్తి అన్న‌ట్టు వ్యవ‌హ‌రిస్తోంది. కానీ అమ‌రావ‌తి క‌థ అయిపోయిన‌ట్టే అని చంద్ర‌బాబు, ఆయ‌న అనుచ‌రుల‌కు అర్థ‌మైంది. అమ‌రావ‌తి అంశంపై విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు, లోకేశ్‌, రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కులు ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు.

దీనికి కార‌ణం... నిన్నటి కోర్టు ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా లేవని వారు భావించ‌డ‌మే. ఏ చిన్న సానుకూల అంశం ఉన్నా ఈ పాటికి చంద్ర‌బాబు, లోకేశ్‌, అమ‌రావ‌తి అనుకూల‌వాదులంతా చిందులేసేవారు. కానీ సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌లు మీడియా ముందుకొచ్చి స్వాగ‌తించారే త‌ప్ప‌, ప్ర‌తిప‌క్షాల వైపు నుంచి ఆ మాట రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది చాల‌దా...  అమ‌రావ‌తికి భ‌విష్య‌త్ లేద‌ని చెప్ప‌డానికి. అమ‌రావతినే ఏకైక రాజ‌ధాని చేయాల‌నే వాద‌న‌లో న్యాయం లేద‌నే సంకేతాలు జ‌నంలోకి వెళ్లాయి.

దీన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అమ‌రావ‌తి అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు అసాధార‌ణ‌మైన‌వ‌ని న్యాయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు ఏమైనా టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌మెంటా? లేక ఇంజ‌నీరా? అని ప్ర‌శ్నించ‌డం దేనికి నిద‌ర్శ‌నం! అలాగే పాల‌నా వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే ...ఇక ప్రజా ప్రతినిధులు, మంత్రి వర్గం ఎందుకు? అని జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం ప్ర‌శ్నించ‌డం టీడీపీ, అమ‌రావ‌తి వాదుల‌కు పెద్ద దెబ్బే.

నిజానికి సుప్రీంకోర్టులో అమ‌రావ‌తిపై విచార‌ణ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఏపీ ప్ర‌జానీకంలో గౌర‌వాన్ని పెంచాయ‌ని చెప్పొచ్చు. నిష్ప‌క్ష‌పాత విచార‌ణ జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం, విశ్వాసాన్ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌జానీకంలో క‌లిగించింది. ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు మేనేజ్‌మెంట్ స్కిల్స్‌కు కాలం చెల్లింద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. రాజ‌ధాని వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు అత్యంత చ‌ర్చ‌నీయాంశ‌మైన త‌రుణంలో, అమ‌రావ‌తి త‌ర‌పు వారి నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డం వారి నైరాశ్యానికి నిద‌ర్శ‌న‌మ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Show comments