పవన్ రథం వృధాయేనా?

ఫుల్ స్టీల్ బాడీతో ప్రత్యేకమైన ఏర్పాట్లతో ఓ బస్ రథాన్ని తయారుచేయిస్తున్నారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఈ సంగతి తెలిసిందే. మిలటరీ ట్రక్ గుర్తుకువచ్చేలా, ఎన్టీఆర్ చైతన్య రథం గుర్తుకు వచ్చేలా దీన్ని డిజైన్ చేసారు. అయితే ఇది కాదు సంగతి. అసలు పవన్ రథయాత్ర ఎప్పుడు వుంటుంది అన్నది. ముందుగా దసరా 2022 నుంచి రథయాత్ర అనే ఫీలర్లు వచ్చాయి. అది దాటిపోయి మూడు నాలుగు నెలలు అవుతోంది. ఇదిగో యాత్ర..అదిగో యాత్ర అనడం తప్ప మరేం లేదు.

అమరావతి రైతులు యాత్ర స్టార్ట్ చేయడంతో పవన్ వెనక్కు తగ్గారని, తను కూడా యాత్ర చేస్తే రెండింటికి సరైన కవరేజ్ రాదని పవన్ వెనక్కు తగ్గారని రాజ‌కీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఇదిలా వుంటే అమరావతి యాత్ర ఆగిపోయింది. ఆగినా కూడా కాస్త హడావుడి చేసి చల్లార్చేసారు. ఇక ఇలా కాదని లోకేష్ బాబే రంగంలోకి దిగుతున్నారు. దాదాపు 400 రోజులు ఈ యాత్ర సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.అంటే ఏడాది పాటు అన్నమాట.

ఆ యాత్ర సాగుతున్నపుడు పవన్ మరో యాత్ర స్టార్ట్ చేయరు. అది పక్కా..ఎందుకంటే ఎంత ఖండించినా, ఆ రెండు పార్టీల నడుమ వున్న అండర్ స్టాండింగ్ అలాంటిది .2023 అంతా లోకేష్ యాత్ర సాగుతుంది. 2024 నాటికి ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక పవన్ కు ప్రత్యేకంగా యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నికల వేళ పర్యటనలు చేసుకుంటే చాలు. అప్పడు బాబు..చినబాబు..జ‌గన్ ఇలా అందరూ పర్యటిస్తారు. అందువల్ల పెద్దగా ప్రత్యేకత ఏమీ వుండదు. ఎటొచ్చీ ఎలాగూ రథం చేయిస్తున్నారు కనుక వాడుకోవచ్చు అంతే.

బహుశా ఇవన్నీ మైండ్ లో వుండబట్టే పవన్ వరుసగా మూడు సినిమాలు ఓకె చేసి లైన్ లో పెట్టారు. శని ఆదివారాలు రాజ‌కీయాలు మిగిలిన రోజులు షూటింగ్ లతో గడిపేస్తారు అన్నమాట. ఇక యాత్రలు లేనట్లే అనుకోవాల్సిందే.

కొసమెరుపు ఏమిటంటే సినిమా రంగంలో పవన్ ను తెలిసిన వారు… ఆయనకు ఓపిక తక్కువ. కాస్త బద్దకం కూడా..ఆయన ఎక్కడ యాత్రలు చేస్తారు అంటున్నారు. అదీ సంగతి.