టాలీవుడ్ కు సంక్రాంతి కానుక-రేట్లు పెంపు

మూలిగే నక్క పై తాటిపండు సామెత లా వుంది ఈ వ్యవహారం. అసలే సినిమా బాగున్నా, బాగా లేకున్నా జ‌నాలు థియేటర్ కు రావడం అంతంత మాత్రం అయిపోయింది. బాగుంటే మూడు రోజులో వస్తున్నారు. బాగా లేకుంటే సాయంత్రానికే ఖాళీ అవుతున్నాయి. కేవలం ఓటిటి డబ్బుల మీద ఆధారపడి సినిమాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో నైజాంలో సినిమా థియేటర్లు తమ అద్దెలను పెంచాలని నిర్ణయించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ల అద్దెలు రకరకాలుగా వుంటాయి. ఊరిని బట్టి, సెంటర్ ను బట్టి, థియేటర్ క్రేజ్ ను బట్టి ఈ అద్దెలు వుంటాయి. ఒక్కోసారి సినిమా హిట్ అయితే తొలివారం తరువాత రెంట్లు పెంచి, ముక్కు పిండి వసూలు చేసే వ్యవహారాలు కూడా వుంటాయి. అయినా కూడా ఇఫ్పుడు వసూలు చేస్తున్న అద్దెలు ఏమాత్రం సరిపోవడం లేదని, నిర్వహణ కష్టంగావుందని థియేటర్ల యజ‌మానులు అంటున్నారు.

ఇంతకీ లేటెస్ట్ సంగతి ఏమిటంటే నైజాంలో థియేటర్ల అద్దెలు వారానికి 50 వేల వంతున పెరగబోతున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ నైజాంలో పంపిణీ సంస్థను ప్రారంభించిన నేపథ్యంలో ఆసియన్ సునీల్, దిల్ రాజు కలిసి ఇది వారికి ఇస్తున్న కానుక అనే జోక్ లు కామెంట్లు వినిపిస్తున్నాయి. అది ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే థియేటర్ల అద్దెలు పెరగడం పంపిణీదారుల మీద భారం గట్టిగానే పడుతుంది.

ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలైనపుడు ఇది క్లారిటీగా కనిపిస్తుంది. నైజాంలో ఓ పెద్ద సినిమా 300 థియేటర్లలో విడుదలైంది అనుకుందాం, వారానికి 50 వేల వంతున పెరిగితే టోటల్ గా కోటిన్నర పెరిగినట్లు. సినిమా నాలుగు వారాలు ఆడిందంటే లాభాల్లో ఆరుకోట్లు ఎగిరిపోతాయి. ఎలాగూ ఎన్ ఆర్ ఎ పద్దతిని చేస్తారు కనుక ఖర్చులు అవీ నిర్మాత ఖాతాలకే చివరిలో కన్నం పెడతాయి. ఈ లోగా పంపిణీ దారులు ఇబ్బంది పడతారు.

నైజాంలో ఈ తొలి దెబ్బను రుచి చూడబోతున్నది కొత్త పంపిణీ సంస్థ మైత్రీ నే.

Show comments