Masooda Review: మూవీ రివ్యూ: మసూద

టైటిల్: మసూద
రేటింగ్: 2.5/5
తారాగణం: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
కెమెరా: నగేష్ బానెల్
కళ: క్రాంతి ప్రియం
ఎడిటర్: జెస్విన్ ప్రభు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
దర్శకత్వం: సాయికిరణ్
విడుదల తేదీ: నవంబర్ 11, 2022

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్లి రావా వంటి ప్రశంసలు పొందిన చిత్రాలు నిర్మించిన రాహుల్ యాదవ్ ఈసారి ఈ హారర్ చిత్రంతో ముందుకొచ్చారు. దీనికి సాయికిరణ్ దర్శకుడు. 

వేరే పెద్ద సినిమాలేవీ లేకుండా సోలో రిలీజ్ గా ఈ చిత్రం థియేటర్స్ కి రావడం ఒక ప్లస్ పాయింట్. లేకపోతే దీనిమీద ఆడియన్స్ దృష్టి పడడం కొంచెం కష్టమయ్యేది. 

విషయంలోకి వెళితే ఇదొక రొటీన్ హారర్ కథాంశమే. ఒకమ్మాయికి దెయ్యం పట్టడం, దానిని వదిలించడానికి తల్లి పడే తపన, ఆమెకి సాయం చేసే ఒక యువకుడు. ఇదే ప్రధాన కథ. అయితే ఇక్కడ పట్టిన దెయ్యం, విడిపించే వైనం అంతా ఇస్లాం మతానికి సంబంధించి ఉన్నాయి. అదొక్కటీ కాస్త కొత్తదనం అనుకోవచ్చు. 

సినిమా మొదలవడమే ఆసక్తికరంగా ఉంది. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఏం జరుగుతోందో తెలియకపోయినా ఏదో జరుగుతోందన్న ఆసక్తిని ఆ తొలి కొన్ని నిమిషాలు కలిగించింది. కానీ క్రమంగా నెరేషన్లో వీక్ పాయింట్స్ బయటపడ్డాయి. 

సినిమా మొదలై 45 నిమిషాలు గడుస్తున్నా కాన్-ఫ్లిక్ట్ పాయింట్ కనపడదు. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ సంభాషణలు. డైలాగ్స్, కౌంటర్స్ పరమ వీక్ గా రాసుకున్నారు. అలాగే ఎడిటింగ్ కూడా సహనపరీక్ష పెట్టింది. ఏకంగా 160 నిమిషాల సినిమా అంటే భరించడం ఎంత కష్టమో వెరే చెప్పక్కర్లేదు. కట్ చేయడానికి పెద్దగా ఏదీ లేదని బుకాయించడానికి కూడా లేదు. సెకండాఫులో డ్రాగ్ ని తగ్గించడానికి పూర్తి స్కోప్ ఉంది. 

ఆ రెండూ మినహాయిస్తే మిగిలిన విషయాల్లో కంప్లైంట్స్ కనపడవు. ఆర్టిస్టులు పెద్ద స్టార్స్ కాకపోయినా ఆయా పాత్రలకి తగ్గట్టుగా అభినయించారు. ఈ సినిమాకి అసలు హీరోలు బ్యాక్ గ్రౌడ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ. 

చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలున్నాయి. కొన్ని సీన్స్ ప్రెడిక్టెబుల్ గా ఉన్నా సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల హారర్ వర్కౌట్ అయింది. 

కథ పరంగా చూస్తే ఇక్కడ దెయ్యానికి అన్ని సినిమాల్లోలాగ రివెంజ్ డ్రామా ఉండదు. దానివల్ల హుక్ పాయింట్ బలంగా కనపడదు. హీరోకి, బాధిత కుటుంబానికి బంధమేమీ ఉండదు. ఫలితంగా డ్రామా కన్విన్సింగ్ గా అనిపించదు. హారర్ మాత్రం పండింది. 

ఇలాంటి సినిమాల్లో ఎంతో బలంగా ఉండాల్సిన ఇంటర్వల్ బ్యాంగ్ రొటీన్ గా ఉండి తేలిపోయింది. 

సెకండాఫులో ఉత్కంఠ గొలిపే సన్నివేశాలున్నా అవి డ్రాగ్ అయి నిట్టూర్పులు తెప్పిస్తాయి. 

ఇందులో సంగీత సైన్స్ టీచర్ గా కనిపిస్తుంది. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ కి కథలో పెద్ద పాత్ర లేదు. హీరో పక్కన ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉన్నట్టుందంతే. ఇంతకీ హీరో తిరువీర్ భయస్థుడి పాత్రలో ఎంతో వినోదాన్ని పంచే స్కోపున్నా స్క్రిప్ట్, డైలాగ్ సహకరించగ పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. నిజానికి అప్పుడేప్పుడో వచ్చిన "లింగబాబు లవ్ స్టోరీ" మాదిరిగా హీరో క్యారక్టరైజేషన్ మీద ఒక ట్రాక్ నడిపుండాలిసింది. 

దెయ్యం పట్టే పాత్రలో నటించిన అఖిల మాత్రం బాగా చేసింది. 

బాబాగా సత్యం రాజేష్, రిజ్వాన్ గా శుభలేఖ సుధాకర్ తమ పని తాము చేసారు. 

అక్కడక్కడ భయపెడుతూ, మధ్యమధ్యలో సహనపరీక్ష పెడుతూ...ఓవరాల్ గా పర్వాలేదననిపించే హారర్ చిత్రం ఈ "మసూద". అయితే తాము తీసిన సినిమా మీద విపరీతమైన నమ్మకమో ఏమో సీక్వెల్ కి లీడ్ ఇవ్వడానికి క్లైమాక్స్ ముగిసాక సుమార్ 5 నిమిషాలు తీసుకున్నారు. అంటే మసూద-పార్ట్ 2 కూడా ఉండవచ్చేమో. తక్కువ బడ్జెట్లో తీసినా కూడా ఈ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ వేల్యూ కలిపించాలనుకునే ఆలోచన బాగానే ఉంది. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఉన్నాయి కనుక భయపడాలనుకుంటే థియేటర్ కి వెళ్ళొచ్చు. ఓటీటీలో అంత భయం కలగకపోవచ్చు. 

బాటం లైన్: కొంత ఉలికిపాటు, కాస్త గగురుపాటు