పామును పెంచారు.. వారిపైనే బుస కొడుతోంది..!

పాముకు పాలు పోసి పెంచినా.. అది విషమే కక్కుతుందనే సామెత నూటికి నూరుపాళ్ళు నిజం! భారతీయ జనతా పార్టీ నాయకులు ఇన్నాళ్లు ఒక పామును పెంచి పోషించారు. అది తన సహజ బుద్దిని ఎందుకు దాచుకుంటుంది? ఇప్పుడు పెంచి పోషించిన వారిని కాటు వేయడానికి ఎగబడుతోంది! బుసలు కొడుతూ ఉంది. ఇదేమి ఖర్మరా భగవంతుడా అంటూ తల పట్టుకోవడం బిజెపి నాయకుల వంతు అయింది.

ఇదంతా గుజరాత్ ఎన్నికల ముచ్చట. గుజరాత్ లో అతి భయంకరమైన నేర చరిత్ర ఉన్న వారిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ వచ్చింది... తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించింది.. అని నిరూపించే విషయం ఇది! అలాంటి వారితో ఇప్పుడు పార్టీకే తలనొప్పులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే...

గుజరాత్ వడోదరలో వగోడియా ఎమ్మెల్యే మధు సిరివాత్సవ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు! 1995 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన మధును.. నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఆహ్వానిస్తే బిజెపిలోకి వచ్చాడని ప్రచారం ఉంది. ఈ విషయం ఆయనే చెప్పుకుంటున్నారు. అప్పటినుంచి ఆ స్థానంలో ఆయన ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూనే ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికలలో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహించిన మధు, తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తొడ కొడుతున్నారు. అక్కడితో ఆగడం లేదు.. నియోజకవర్గంలో తనకు మద్దతు ఇచ్చే వారిని అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని నడిరోడ్డుపై కాల్చి చంపుతానని బెదిరిస్తున్నారు. అంటే స్థానిక బిజెపి శ్రేణులకు ఇది హెచ్చరిక అన్నమాట!

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూడా అధికారంలో ఉన్న పార్టీని.. నడిరోడ్డుపై కాల్చి చంపుతా అనే స్థాయిలో బెదిరించాలంటే.. ఆ వ్యక్తికి చాలా గుండె ధైర్యం ఉండాలి. నేర చరిత్ర కూడా ఉంటే తప్ప అంత దీటైన మాటలు రాకపోవచ్చు. నేరచరిత్ర విషయంలో మధు సిరివాత్సవకు లోటు ఏమీ లేదు. పుష్కలమైన నేరచరిత్ర ఉంది.

తన బతుకు తెరువు రీత్యా ల్యాండ్ డెవలపర్ అయిన మధు, 2002 గుజరాత్ అల్లర్లలో కీలక నిందితుల్లో ఒకడు. ముస్లిం మతానికి చెందిన 18 మందిని సజీవ దహనం చేసిన బెస్ట్ బేకరీ కేసులోనూ సహనిందితుడు. మరో ఎనిమిది కేసుల్లో మధు నిందితులుగా ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తున్నారనే కారణంతో 2008లో వడోదర పోలీసులు మధును అరెస్టు కూడా చేశారు. 2014లో 'లయన్ అఫ్ గుజరాత్' అనే సినిమాలో ఆయన హీరోగా కూడా నటించారు. బహుశా ఈ హీరోయిజం ప్రేరణ కూడా.. ఆయనలోని రౌడీయిజం లక్షణాలే అయి ఉండొచ్చు కూడా! మోడీ ఆహ్వానంతో పార్టీలోకి వచ్చిన తనకు, గత పాతికేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూనే ఉన్నప్పటికీ.. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంలో ఔచిత్యం ఏమిటని మధు ప్రశ్నిస్తున్నారు. 

ఈ పరిణామాలను గమనిస్తే భారతీయ జనతా పార్టీ పోకడలు కొంచెం అవగాహన అవుతాయి. హిందూ అతివాద వ్యక్తులను చేరదీసి ప్రోత్సహించడం ద్వారా రాజకీయంగా ఎదగడాన్ని  బిజెపి ఒకప్పట్లో కోరుకుంది. ఇప్పుడు నెమ్మదిగా ముస్లింలపై హత్యాకాండ జరిపిన వారి ఇమేజ్ నుంచి బయట పడాలని కోరుకుంటూ ఉంది. ఆ క్రమంలోనే బెస్ట్ బేకరీ కేసులో కీలక నిందితుడైన మధు కు టికెట్ నిరాకరించి ఉండొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పామును ఒకసారి చేరదీసి పెంచి పోషించిన తర్వాత.. దాని విషాన్ని, ఆ పోషకులు జీవితాంతం భరించాల్సిందే.. అనడానికి మధు వ్యవహారం ఉదాహరణ.. అని విశ్లేషకులు భావిస్తున్నారు.