Prince Review: మూవీ రివ్యూ: ప్రిన్స్

టైటిల్: ప్రిన్స్
రేటింగ్: 2.75/5
తారాగణం: శివకార్తికేయన్, మారియా, సత్యరాజ్ తదితరులు
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
సంగీతం: తమన్ ఎస్
నిర్మాత: సునీల్ నారంగ్, సురేష్ బాబు, రాం మోహన్ రావు
దర్శకత్వం: అనుదీప్ కెవి
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022

"జాతిరత్నాలు" ఫేం అనుదీప్ దర్శకత్వం వహించిన మలి చిత్రం ఈ "ప్రిన్స్". మధ్యలో "ఫస్ట్ డే ఫస్ట్ షో" ఇతని రచనతో తెరకెక్కినా దర్శకత్వ బాధ్యత తన మిత్రులకి అప్పజెప్పాడు. 

శివ కార్తికేయన్ కి ఓటీటీ ప్రేక్షకులనుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ హీరో సరసన ఉక్రైన్ కు చెందిన మారియా హీరోయిన్ గా నటించింది. బహుశా పూర్తి స్థాయిలో ఒక విదేశీయురాలు మెయిన్ హీరోయిన్ గా నటించిన దక్షిణ భారతీయ కమెర్షియల్ సినిమా ఇదేనేమో. 

ఇక విషయానికొద్దాం. ఒకసారి ఒకపద్ధతిలో తీస్తే పని జరిగింది కదా అని ప్రతి సినిమా అదే పంథాలో చేస్తున్నాడు ఈ దర్శకుడు. బహుశా ఇక తనని తాను ఈ జానర్ తోనే బ్రాండింగ్ చేసుకుంటున్నట్టున్నాడు . 

"జాతిరత్నాలు"లో పాత్రలు లో-ఐక్యూతో ఉంటాయి. కామెడీ కూడా పాత్రల స్వభావాల్ని పట్టి ఉంటుంది తప్ప రైటింగులో డెప్త్ అస్సలు ఉండదు. దాంతోటే కామెడీ పుట్టించడం ఆ సినిమాకి వర్కౌట్ అయ్యింది. 

బెయిలు ఏ పద్ధతిలో ఇస్తారో కూడా తెలియని ఒక అమాయక లాయర్ జాతిరత్నాల్లో హీరోయినైతే, పేర్లు వినడమే తప్ప ఏది ఏమిటో కూడా బొత్తిగా తెలియనితనం ఇక్కడ హీరో తండ్రిది. అదే సత్యరాజ్ పాత్ర. ఆ తెలియని తనంలోంచి అతను చెప్పే డయలాగులు నవ్విస్తాయి. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో తండ్రి హ్యుమానిటీకి విలువిచ్చే మంచి మనసున్నవాడు. కులమతాలకతీతంగా మానవత్వాన్ని చాటుతుంటాడు.... అది కూడా చాలా పాత పద్ధతిలో. ఎవరైనా రెండు వర్గాలు కులమతాల పేరుతో కొట్టుకుంటుంటే వాళ్లని ఆపి కత్తితో ఇరువైపుల ఉన్నవారి చేతులు కోసి.."చూడండి అందరి రక్తం ఎర్రగానే ఉంది. కాబట్టి అందరూ ఒక్కటే" అంటుంటాడు. ఎంత పాత సీన్ అయినా ఇది కూడా కామెడీలో కొట్టుకుపోతుంది... ఆ దృష్టితో చూస్తే! 

ఆలాంటి వ్యక్తి కొడుకు ఒక విదేశీయురాలిని ప్రేమిస్తాడు. కులమతాలకే కాకుండా, దేశాలు కూడా దాటి ఒక ఫారినర్ ని ప్రేమించినందుకు హీరో తండ్రి సంతోషిస్తాడు. కానీ ఆమె బ్రిటీషర్ అని తెలుసుకుని స్వాతంత్రోద్యమం గుర్తొచ్చి వద్దంటాడు. అది కూడా కామెడీయే. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగితే అతను చివరికి కథకు శుభం కార్డు పడేలా చేసాడనేది ప్రధాన కథ. 

తెరమీద అమాయక పాత్రతో అర్థవంతమైన కథని కామెడీ జానర్లో నడపడంతో దర్శకుడు మరో సారి పాసయ్యాడనే అనుకోవాలి. అయితే "జాతిరత్నాలు" సింపుల్ గా తీసిన లో బజెట్ సినిమా అయితే, ఈ "ప్రిన్స్" అలా కాదు. కథంతా రూరల్ బ్యాక్ డ్రాపులో జరుగుతున్నా కమెర్షియల్ ఫార్మెట్ లో భారీ సెట్లేసి పాటల్ని షూట్ చేసారు. 

సాంకేతికంగా తమన్ సంగీతం రొటీన్ గానే ఉంది. గత పదేళ్లుగా వింటున్నలాంటి పాటల్లాగే ఉన్నాయి. సాహిత్యంలో కూడా కొత్త మెరుపులేవీ లేవు. అయినా కూడా ఈ జానర్లో అవి అలా పాసైపోయాయి. 

కెమెరా, ఎడిటింగ్ వగైరాలు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ బామ్మ చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ చిత్రీకరించడానికి భారీగానే ఖర్చుపెట్టారు. ఆ ట్రాకులో సడెన్ గా తెలుగు సినిమాలోకి హాలీవుడ్ సీన్ వచ్చినట్టు అనిపిస్తుంది. వీఎఫెక్స్, సి.జి.ఐ టీముని కూడా ఇక్కడ అభినందించాలి.

కంటెంట్ పరంగా మొదటి సగం సరదాగానే అనిపించినా ద్వితీయార్థంలో కాస్త ఎమోషన్ పాళ్లు ఎక్కువయ్యాయి.

తెలుగు, తమిళ బైలింగువల్ గా వచ్చిన "ప్రిన్స్" లో దర్శకుడు, నిర్మాతలు, కొందరు టెక్నిషియన్స్ తప్ప అసలు తెలుగుతనమే కనపడదు. ఇది పూర్తిగా అరవ చిత్రానికి తెలుగు డబ్బింగ్ అనిపిస్తుంది. 

కామెడీ సినిమాకి ప్రధానంగా కావల్సింది నేటివిటీ. అది మిస్సైతే ఫలితం డిస్కౌంటైపోతుంది. చిన్న పాత్రల నుంచి ప్రధానపాత్రలవరకు అందర్నీ తమిళ నటుల్నే పెట్టుకోవడం ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు. కనీసం ప్రేం జీ అమరన్ పాత్రనైనా తెలుగు వెర్షన్ వరకు పాపులర్ తెలుగు నటుడికి ఇవ్వాల్సింది. నిజానికి అదేమంత కష్టం కూడా కాదు. బైలింగువల్ గా తీస్తున్నప్పుడు ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టొచ్చు. అది కష్టమనుకున్నా కనీసం ప్యానిండియా మోడల్లో తెలుగు నటుల్ని కూడా పెట్టుకుని తీసుండాల్సింది.  

శివకార్తికేయన్ తన టైమింగుతో, డ్యాన్సులు-ఫైట్స్ తో ఆడియన్స్ ని కూర్చోపెట్టగలిగాడు. సాధ్యమైనంతవరకూ డబ్బింగ్ సినిమా ఫ్లావర్ నుంచి తెలుగు ఆడియన్స్ ని తన నటనతో డైవర్ట్ చేయగలిగాడు. 

చెప్పుకోవల్సిన విధంగా నటించిన మరొక నటుడు సత్యరాజ్. ఆద్యంతం తన క్యారెక్టరైజేషన్ తో నవ్వించాడు. సత్యరాజ్ ని తెలుగు ప్రేక్షకులు బాహుబలి టైమునుంచి ఓన్ చేసుకున్నారు కనుక ఈయన కూడా చాలావరకు అరవసినిమా చూస్తున్న ఫీలింగ్ ని తగ్గించాడు. 

అలాగే ఫారినర్ అయినా కూడా మారియా పాత్రకు తగ్గట్టు, తెలుగు సినిమాకి కావల్సిన హావభావాలని, డ్యాన్సుల్ని బాగానే చేసి మెప్పించింది. 

ఇలాంటి సినిమాల్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఒక స్టేట్ ఆఫ్ మైండుతో ఉండాలి. "జాతిరత్నాలు" నచ్చినవాళ్లు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎక్కడా లాజిక్కులు వెతక్కూడదు. 60 ఏళ్ల క్రితం బ్రిటన్లో యుద్ధమొస్తే అక్కడి జనం వలసపోయి భారతదేశంలో తలదాచున్న మాట నిజమా అని హిస్టరీ ప్రశ్నలు వేసుకోకూడదు. తెర మీద చూపిస్తున్న కథని మైండ్ ఆఫ్ చేసేసి, చూస్తున్నదంతా కామెడీ అనుకుని చూడాలి. అప్పుడే ఇది నచ్చుతుంది. 

బాటం లైన్: తమిళ రత్నాలు