అక్కడ బీచ్ భయపెడుతోంది...

విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సహజసిద్ధమైన సౌందర్యంతో విశాఖ అలరారుతూ ఉంటుంది. అలాంటిది పర్యాటక దినోత్సవం వేళ విశాఖ అందాలకు పేరు గడించిన యారాడ బీచ్ ఒక్కసారిగా భయపెట్టింది. సముద్రపు హోరుతో ఎగిసిపడిన కెరాటాలు ముందుకు దూసుకురావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.

సముద్రపు అలలు అలా ఒక్కసారిగా  దూసుకుంటూ ముందుకు వచ్చి యారాడ రోడ్డుకు తాకడంతో ప్రజలు భీతిల్లిపోయారు.  ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ అలల తాకిడికి సముద్ర తీరం భారీ కోతకు గురి కావడం జరిగింది.  ఇలా సముద్రం అకస్మాత్తుగా ముందుకు చొచ్చుకురావడంతో అక్కడ నివసించేవారికి ఏమీ అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.

ఏదైనా ఉపద్రవం జరుగుతోందా అని అనుమానిస్తూ జనాలు వెనక్కు పరుగులు తీశారు. ఆ తరువాత కొంత సేపటికి సముద్రం వెనక్కి వెళ్ళినా జనాల భయం మాత్రం తగ్గలేదు. అయితే అపుడపుడు ఇలా యారాడ బీచ్ తో పాటు మరి కొన్ని చోట్ల విశాఖ సాగరం ముందుకు వచ్చి భయపెడుతోంది.

ప్రతీ రోజూ కెరటాలతో అలరిస్తూ సందడి చేసే సాగరం ఇలా విశ్వరూపం చూపిస్తే తట్టుకోవడం కష్టమే అని స్థానికులు అంటున్నారు. దీనికి సరైన కారణాలు అయితే తెలియరావడం లేదు అయితే ఇవన్నీ మామూలుగా సాగరంలో సంభవించే ఆటుపోట్లుగా కూడా కొందరు అంటున్నారు.