యార్లగడ్డ రాజకీయం ఇంతటితో సరా?

విశాఖలో సెటిల్ అయిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అంత తెలివైన రాజకీయ వేత్త మరెవరు లేరు. దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది లగాయతు ఆయన రాజకీయాలను తనకు అనువుగా వాడుకుంటూనే వస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా, అధికారపక్షాల్లోకి చొచ్చుకుపోతూ, తనకు వున్న స్నేహ బంధాలతో, సామాజిక బంధాలతో తన పనులు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ రాజకీయం ఇక ఓ డెడ్ ఎండ్ కు చేరినట్లు కనిపిస్తోంది.

ఎన్టీఆర్ తో రాజకీయం ప్రారంభించారు. ఆయనకు దగ్గరయ్యారు. హరికృష్ణ, మోహన్ బాబులకు ఆప్తుడుగా వున్నారు. కానీ తెలుగుదేశం పగ్గాలు చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక అక్కడ ఆటలు సాగలేదు. కానీ వెంకయ్య లాంటి పెద్దల సాన్నిహిత్యంతో భాజపాకు దగ్గరయ్యారు. హిందీ భాషాచార్యులు కనుక ఆ రూట్ లో కేంద్రానికి చేరువ అయ్యారు. ఆ విధంగా ముందుకు సాగుతుంటే వైఎస్ జమానా వచ్చింది.

దాంతో వైఎస్ ఎలాగూ యాంటీ చంద్రబాబు కనుక, అటు మళ్లారు. అటు దగ్గరయ్యారు. అయినా తన స్నేహబంధాలు, సామాజిక బంధాలు కొనసాగిస్తూనే వచ్చారు. మళ్లీ చంద్రబాబు రావడంతో గతంలో మాదిరిగా కేంద్రం వైపు మళ్లారు. జగన్ రాగానే అటు వచ్చారు. జగన్ కరుణతో అధికార భాషాసంఘం పదవి చేపట్టారు. ఇప్పుడు ఆవేశపడి దానిని వదులుకున్నారు.

ఇక తరువాత ఏంటీ? ఇదీ క్వశ్చను.

కేంద్రంలో లక్ష్మీప్రసాద్ కు గతంలో వుండే సన్నిహితులు ఇప్పుడు లేరు. అందువల్ల అక్కడ పనులు జరిపించుకోవడం కష్టం. జగన్ ఒక సారి దూరం పెట్టినా, దూరం జరిగినా మళ్లీ దగ్గరకు తీయడం అన్నది జరిగే పని కాదు. చంద్రబాబు మరి అన్నీ మరిచిపోయి లక్ష్మీప్రసాద్ ను దగ్గరకు తీస్తారా? అన్నది అనుమానమే. 

యార్లగడ్డకు విశాఖ లోకల్ మీడియా బాగానే దగ్గరకు తీసుకుంటుంది. అది చిరకాలంగా యార్లగడ్డ పెంచుకున్న వ్యవహారం. అందువల్ల ఇక యార్లగడ్డ విశాఖలో తన సంస్థల పనులు, వాటి సన్మాన కార్యక్రమాలు చేసుకోవడం మినహా రాజకీయం అంతగా వుండకపోవచ్చు.