Alluri Review: మూవీ రివ్యూ: అల్లూరి

చిత్రం: అల్లూరి
రేటింగ్: 2.25/5
తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీరాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు 
కెమెరా: రాజ్ తోట
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
దర్శకత్వం: ప్రదీప్ వర్మ
విడుదల తేదీ: 23 సెప్టెంబర్ 2022

శ్రీవిష్ణు చక్కని ప్రతిభగల నటుడు. ఇప్పటికి దాదాపు 30 కి అటుఇటుగా సినిమాలు చేసాడు. తన సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈ మధ్యన మాత్రం మాస్ హీరో అనిపించుకోవలనే తపన ఈ నటుడిలో పెరిగినట్టుంది. అందుకే తన ట్రేడ్ మార్క్ నుంచి పక్కకు జరిగి "భళా తందనానా"తో ఆ మధ్యన పలరించాడు. అది నిరాశపరిచింది. మళ్లీ ఇప్పుడు "అల్లూరి"తో ముందుకొచ్చాడు. 

ఇది ఒక ఫిక్షనల్ బయోపిక్. అంటే బయోపిక్ లాగ అనిపించే ఒక కల్పిత కథ. సింపుల్ గా చెప్పాలంటే "విక్రమార్కుడు" రవితేజ లాంటి పాత్ర చుట్టూ తిరిగే కథ. ఒకటి రెండు సన్నివేశాలు ఆ సినిమాలోని కీలక ఘట్టాలని కూడా గుర్తుచేస్తాయి. 

కథగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సిన్సియర్ పోలీసాఫర్. అతనికొక అందమైన భార్య. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ప్రత్యర్థులు ఎంత పరపతి ఉన్నవారైనా సరే కాంప్రమైజ్ అవ్వని ఎస్సై మన హీరో. తేడా వస్తే సీనియర్ ఆఫీసర్స్ ని కూడా లెక్కచెయ్యకుండా చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి తిరుగుబాటుని ప్రకటించే టైపు. 

ఒకటి కాదు రెండు కాదు...వరసపెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్స్ లో పాల్గొంటుంటాడు. పోలీసు కర్తవ్యాన్ని గురించి పవర్ఫుల్ డయలాగ్స్ కొడుతూ మొటివేట్ చేస్తాడు. 

అటువంటి పోలీసు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటాడు? అదే కథంతా. 

హీరోలోని యాక్షన్ యాంగిల్ ని బయటపెట్టేందుకు అనేకమైన ఫైట్స్ సమాహారంగా తెరకెక్కింది ఈ చిత్రం. వాటిల్లో కొన్ని అమెచ్యురిష్ గా అనిపించినా కొన్ని ఘట్టాల్లో ఎమోషన్ డామినేట్ చేసి డ్రామాని నిలబెట్టాయి. ముఖ్యంగా ఫస్టాఫులో కాలేజీ అమ్మాయిల మీద ర్యాగింగ్ సీనొకటి పెట్టారు. అది ర్యాగింగులా లేదు, రేప్ వాతారవరణంలాగ చిత్రీకరించారు. ఆ సమయంలో హీరో వచ్చి మోటివేట్ చెయ్యగానే ఆ అమ్మాయిలు చెంపపిన్నులు, చేతి కంకణాలతో "అయిగిరి నందిని.." మ్యూజిక్ బ్యాక్ డ్రాపులో ఆ రౌడీలని చితక్కొట్టేస్తారు. ఈ సీన్ పాయింటుగా బాగానే ఉన్నా చిత్రీకరించిన తీరు అమెచ్యూర్ గా ఉంది. 

అలాగే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక ఎస్సై నక్సల్స్ ని మీటయ్యి వాళ్లకి నక్సలిజం చరిత్ర చెప్పడం కూడా లో-ఐక్యూ రైటింగ్ అనిపించుకుంది. 

కానీ ఇంటర్వల్ ఫైట్ గానీ, క్లైమాక్స్ లో వచ్చే టెర్రరిస్ట్ ఆపరేషన్ గానీ ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఒక పాయింట్ మీద అని కాకుండా చాలా క్రైం ఎలిమెంట్స్ ని ప్రవేశపెట్టి వాటన్నిటినీ హీరో ఎలా ఛేదించాడనే విధంగా రాసుకున్న ఈ కథ వెబ్ సిరీస్ కైతే బాగుండేదనిపిస్తుంది. 

ఎమోషన్ లో వేరియేషన్ లేకుండా వరుసపెట్టి రకరకాల యాక్షన్ ఎపిసోడ్స్ రావడం వల్ల చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది. 

పైన చెప్పుకున్నట్టు విక్రమార్కుడు సినిమాని గుర్తుకు తెచ్చే సీన్స్ కొన్నున్నాయిందులో. ముఖ్యంగా శ్రీవిష్ణు సుమన్ తో భయం గురించి చెప్పే డయలాగు విక్రమార్కుడు లోని ప్రకాష్ రాజ్-రవితేజ మధ్యన సాగే సంభాషణను గుర్తుచేస్తుంది. 

తనికెళ్ల భరణి ట్రాక్ మొత్తం ఒక నీతికథలాగ సాగుతుంది. విడిగా కట్ చేస్తే ఆయన ట్రాకొక్కటీ ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది. 

ఒక్క సినిమాలోనే ఎన్నో ట్రాకులు నడపాలన్న దర్శకుడి ఉత్సాహం వల్ల ప్రేక్షకుడికి చూస్తున్నంతసేపూ హెవీగా అనిపిస్తుంది. అదే ఒకటి రెండు ట్రాకులతో ఉత్కంఠతో నడిపితే మంచి స్క్రీన్ ప్లే అయ్యుండేది. 

టెక్నికల్ గా సినిమా సంగీత-సాహిత్య విభాగాల్లో వీక్ గా ఉంది. సంభాషణలు అక్కడక్కడ బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది కానీ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండుంటే బాగుండేది. 

ఈ సినిమాకి ఒక ఎసెట్ హీరోయిన్. కయ్యదు లోహర్ చూడడానికి చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా పర్వాలేదు. ఆమె పక్కన శ్రీవిష్ణు స్క్రీన్ ప్రెజెన్స్ లో తేలిపోయాడనే చెప్పాలి. 

పర్ఫామెన్స్ పరంగా శ్రీవిష్ణు బాగానే చెసాడు కానీ పెద్దగా వైవిధ్యం లేని పాత్ర నడక ఇది. సీరియస్ పోలీసాఫీసర్ కావడం వల్ల శ్రీవిష్ణు మార్కు కామెడీ టైమింగ్ వగైరాలు కనపడవు. 

కథగా కొత్తదనం లేదు. కథనంలో ఉత్కంఠ పెద్దగా ఉండదు. అంతా ప్రెడిక్టిబుల్ గానే సాగుతుంటుంది. శ్రీవిష్ణు ఫిల్మోగ్రఫీలో అద్భుతమనిపించుకునే స్థాయి ఈ చిత్రానికి లేదనే చెప్పాలి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒక రొటీన్ కాప్ స్టోరీ చూడాలనుకుంటే చూడొచ్చు. పెద్దగా చిరాకుపెట్టదు, అలాగని అద్భుతంగా ఆహ్లాదపరచదు. 

బాటం లైన్: కొత్తదనం లేని పోలీసు కథ