ఏపీకి రాహుల్ గాంధీ అలా వస్తారట...?

కాంగ్రెస్ అగ్ర నేత. గాంధీల వారసుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ మీద చివరాఖరు పోరాటానికి పాదయాత్రను ఎంచుకున్న సంగతి తెలిసిందే. 150 రోజుల పాటు 13 రాష్ట్రాల మీదుగా సాగే రాహుల్ గాంధీ భారత ఐక్యతా పాదయాత్ర దేశంలో సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర అక్టోబర్ నాటికి ఏపీలో ప్రవేశిస్తుంది అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ ప్రకటించారు.

ఉత్తరాంధ్రా జిల్లాల్లో టూర్ చేస్తున్న ఆయన ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని అన్నారు. ఏపీలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ రెండూ జనాదరణ కోల్పోయాయని, ఇక జనాల ఆశలన్నీ కాంగ్రెస్ మీదనే అంటున్నారు.  

జగన్, బాబు లకు మోడీ జపమే తప్ప ఏపీ భవిష్యత్తు పట్టదని ఆయన సెటైర్లు వేశారు. తాము కాంగ్రెస్ పార్టీని ఏపీలో పటిష్టం చేస్తామని చెప్పుకున్నారు.

ఆరెస్సెస్ భావజాలం నిండా పుణికి పుచ్చుకున్న మోడీ దేశాన్ని తిరోగమనం దిశగా నడిపిస్తున్నారు అని శైలజానాధ్ మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల బీజేపీ ఏలికలకు అసలు విశ్వాసం లేదని ఆయన అన్నారు. 

ఈ దేశంలో కోట్లాది మంది పేదల సంపదను మోడీ సర్కార్ అదాని, అంబానీలకు దారాదత్తం చేస్తోందని అన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల మీద పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.