బాలినేని: మంతనాలు నిజం.. లోలోన భయం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మామయ్య అయ్యే సీనియర్ నాయకుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అల్లుడిమీద అలకపూనడానికి ప్రత్యేకమైన కారణాలేం అక్కర్లేదు. వైఎస్ కాలం నాటి నుంచి మంత్రిగా, సీనియర్ హోదాతో చెలామణీ అవుతున్న ఆయనను ‘మాజీ’ని చేసిన వైనం ఒక్కటీ చాలు! ఆయన అలక పూని ఉండే అవకాశం ఉన్నది గనుక.. ఆ అలకకు ముడిపెట్టి.. ఆయన పార్టీ మారుతున్నట్టుగా జనసేనలో చేరబోతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ.. ఆ ప్రచారం పూర్తి నిజమూ కాదు, పూర్తిగా అబద్ధమూ కాదు అని తెలుస్తోంది. 

బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద అలకపూని ఉన్నారు. ఎందుకంటే.. మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేసి పూర్తిగా కొత్తవారిని తీసుకునే ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నట్టుగా ముందుగా మీడియాకు లీక్ చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డే! తనతో జగన్ అలా చెప్పినట్లుగా ఆయన అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత పూర్తిగా మార్చడం కుదరకపోవచ్చు గానీ.. ముఖ్యులైన ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని, బొత్సలను మాత్రం కొనసాగిస్తారని మిగిలిన వారంతా కొత్తవారేనని ఒక పుకారు వచ్చింది. 

తీరా కేబినెట్ మార్పు చేర్పులు జరిగేసరికి.. రెడ్డి వర్గం నుంచి బుగ్గన, పెద్దిరెడ్డి ఇద్దరూ కంటిన్యూ అయ్యారు. కులాలతో నిమిత్తం లేకుండా ఇంకా చాలా మంది కంటిన్యూ అయ్యారు. బాలినేనికి మాత్రం పదవి పోయింది. ఇది ఆయనకు అవమానకరం అనిపించింది. మిగిలిన ఇద్దరు రెడ్లను కూడా తొలగించి ఉంటే ఆయన అంత ఫీలయ్యేవారు కాదేమో. ఏదో కంటితుడుపుగా రీజినల్ కోఆర్డినేటర్ అనే పదవి వచ్చింది గానీ.. అది ఆయనకు అంతగా రుచించలేదేమో.

పవన్ కల్యాణ్ ట్వీట్ కు మద్దతివ్వడం ద్వారా బాలినేని తాజాగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. చేనేత కార్మికులకు గురించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేసినందున తాను మద్దతు ఇచ్చానని అన్నారు. ఇలాంటి ట్వీట్లు అన్ని పార్టీల నాయకులూ చేస్తారు. కానీ.. బాలినేని పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిచ్చారు.. అనేది ఎవ్వరూ ఊహించలేని సంగతి కాదు. 

ఇలాంటి సంకేతం ద్వారా.. ఎలాంటి ప్రకంపనలు పార్టీలో అంతర్గతంగా పుడుతాయో ఆయన ఒకసారి చెక్ చేసుకోదలచుకున్నట్టున్నారు. పార్టీ మారుతున్నారనే ప్రచారం కాస్త శృతి మించగానే.. దానిని ఆయన ఖండించారు. రాజకీయ భిక్ష వైఎస్సార్ పెట్టారని, కష్టాలెన్ని వచ్చినా జగన్ వెంట ఉంటానని అన్నారు. 

కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన పవన్ కల్యాణ్ అండ్ కో తో టచ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ తో కలిసి రాజకీయ ప్రస్థానం ముందు ముందు ఎలా ఉంటుందో అనే భయం బాలినేని వెనుకకు లాగుతున్నట్టుగా తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్ కు నిలకడలేని నాయకుడుగా రాజకీయాల్లో చాలా గుర్తింపు ఉంది. అలాంటి పవన్ ను నమ్ముకుని .. ఇవాళ కాకపోతే రేపు అయినా మళ్లీ తనకు వైభవం దక్కే అవకాశం ఉన్న వైసీపీను వదులుకుని వెళ్లడం గురించి బాలినేని మీమాంసలో ఉన్నట్టుగా తెలుస్తోంది.