కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.. బీజేపీలో మ‌న‌గ‌లరా?

వైఎస్ఆర్ ఆశీస్సుల‌తో కోమ‌టిరెడ్డి సోద‌రులు రాజ‌కీయంగా ఎదిగారు. ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని వారు స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించుకుంటూ ఉంటారు. జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీని వీడి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన త‌రుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు వైఎస్ఆర్ ను కించప‌రిచే ప్ర‌క‌ట‌న‌ల‌కు వెనుకాడ‌లేదు. ఆ ద‌శ‌లో జ‌గ‌న్ వెంట నిల‌వ‌క‌పోయినా.. వైఎస్ఆర్ త‌ర‌ఫున మాత్రం వీరు వాద‌న వినిపించ‌గ‌లిగే వారు.  

రాష్ట్రం విడిపోయి ఉండ‌క‌పోతే.. క్ర‌మంగా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి ఉండేది. ఒక ద‌శ‌లో వీరు చేర‌బోతున్నార‌నే టాక్ కూడా వ‌చ్చింది. అయితే విభ‌జ‌న‌తో వీరు కాంగ్రెస్ తో ఉండిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల త‌ర్వాతి నుంచి వీరు అసంతృప్త‌వాదులుగా త‌యార‌య్యారు. జానా రెడ్డిని వ్య‌తిరేకించారు, కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని కూడా తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర అస‌హ‌నంతో కాంగ్రెస్ కు దాదాపు దూరం అయ్యారు ఈ అన్న‌ద‌మ్ములు. రాజ‌గోపాల్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడ‌గా, వెంక‌ట్ రెడ్డి కూడా వీడే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అస‌లు ఎవ‌ర‌ని? అత‌డు చంద్ర‌బాబు తొత్తు అంటూ వీరు వాదిస్తున్నారు. రేవంత్ ను వీరు లెక్క చేసే ప‌రిస్థితి లేదు!

ఇదంతా బాగానే ఉంది కానీ, వీరు బీజేపీలో ఏ మేర‌కు మ‌న‌గ‌ల‌రు? అనేది మ‌రో ప్ర‌శ్నార్థ‌కం. కాంగ్రెస్ లో వీరు త‌మ అస‌హ‌నాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు బాహాటంగా చాటారు. పార్టీకి అధికారం లేక‌పోయినా, వీరి నోటికి మాత్రం తాళం వేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది కాదు. జానా రెడ్డిపై సెటైర్లు వేసేవారు, ఉత్త‌మ్ పై విరుచుకుప‌డే వారు, రేవంత్ రెడ్డిని ఒక బ‌చ్చాగా తీసి పడేయ‌గ‌లిగారు. త‌మ‌కు పీసీసీ ప‌ద‌వి కావాల‌ని డిమాండ్ చేయ‌గ‌లిగారు. మ‌రి వీరు చేర‌గానే బీజేపీ వీరికి ఏ మేర‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తుంద‌నేది శేష ప్ర‌శ్న‌!

ఆల్రెడీ తెలంగాణ బీజేపీ అంటే బండి సంజ‌య్, బండి సంజ‌య్ అంటే తెలంగాణ బీజేపీ అనే ప‌రిస్థితి ఉంది. పార్టీలో సీనియ‌ర్, కేంద్ర మంత్రి అయిన కిష‌న్ రెడ్డి కూడా హంగూఆర్బాటాల విష‌యంలో బండితో పోటీ ప‌డే ప‌రిస్థితి లేదు. మ‌రి బీజేపీలోకి వీరు చేరేది ఒట్టి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం కాక‌పోవ‌చ్చు. అవైతే కాంగ్రెస్ ద్వారా కూడా ద‌క్కుతాయి. 

టీఆర్ఎస్ లో తాము సెట్ కామ‌ని ఫిక్స‌యిపోయి వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టుగా ఉన్నారు. అయితే బీజేపీలో మాత్రం కాంగ్రెస్ లో ఉన్నంత స్వ‌తంత్రం కానీ, అంత ప్రాధాన్య‌త అయినా ఉంటుందా?  ఆల్రెడీ చేరి గెలిచిన ఈట‌ల రాజేంద‌ర్ కూడా గ‌ట్టిగా మాట్లాడితే బండి సంజ‌య్ అడ్డుత‌గులుతున్నారు! మ‌రి వీరి ప‌రిస్థితి ఎలా ఉంటుందో!