ఆంధ్రలో హోటల్ పరిశ్రమ వెనుక చీకటి నిజాలు

నిన్నటికి నిన్న కమ్మ సామాజిక వర్గ పెద్దలు మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. అందులో హోటల్ పరిశ్రమను కూడా తామే అభివృద్ది చేసామని చెప్పారు. ఇది చెబుతుంటే ఓ చీకటి నిజం గుర్తుకు వస్తోంది. దాని వెనుక దాగిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ జ‌నరేషన్ జ‌నాలకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక సంచలనం మొదలైంది. అది ఇడ్లీ ఇన్ని గ్రామలు, చట్నీ, సాంబర్ ఇన్ని మిల్లీ లీటర్లు..ఇలా హొటల్ తినుబండారాలకు తూనికలు కొలతలు. అన్నపూర్ణ క్యాంటీన్ అంటూ టాంక్ బండ్ మీద ప్రభుత్వ నిర్వహణ. 

ఆ కాలంలో ఆంధ్ర అంతటా ఉడిపి హొటళ్లు వుండేవి. ఇప్పుడు ప్రతి చిన్న పట్టణంలో రాజ‌స్థాన్ స్వీట్ స్టాల్స్ వున్నట్లుగా ఉడిపి హొటల్ లోని ఊరు ఉండేది కాదు. ఈ తూనికలు కొలతల వ్యవహారం ఉడిపి హొటళ్లను అతలాకుతలం చేసేసింది. తూనికలు కొలతల శాఖ అధికారులు హోటల్ యజ‌మానులను బెంబేలెత్తించారు. ప్రతి హోటళ్లలో ప్రభుత్వ నిబంధనల బోర్డులు స్పష్టంగా వుంచాల్సి వచ్చింది. ఎవరైనా అడిగితే తూచి చూపించడానికి సాధనాలు వుంచాల్సి వచ్చింది.

చేతితో చకచకా చేసే ఇడ్లీని ఇన్ని గ్రాముల్లోనే వుండేలా ఎలా చేయాలన్నది హోటల్ సిబ్బందికి అలవికాని సమస్య అయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ వేధింపులు తట్టుకోలేక ఉడిపి హోటళ్లు చాలా అంటే చాలా మూతపడ్డాయి. దీనికి తొడు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసేలే రాజ‌కీయాలు నడిచాయి. మొత్తం మీద ఈ రోజు ఏమిటి పరిస్థితి. ఆంధ్రలో ఉడిపి హోటల్ అంటే వెదుక్కున్నా కనిపించవు. 

దీనికి వెనుక అసలు విషయం అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్టీఆర్ కు అప్పటి హోటల్స్ సంఘానికి మధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చాయని, హోటల్ సంఘం అధ్యక్షుడు అయిన వ్యక్తితో ఏదో వ్యక్తిగత వ్యాపార వివాదం ఎన్టీఆర్ కు ఏర్పడిందని గుసగుసలు వినిపించాయి.

గమ్మత్తేమిటంటే ఉడిపి హొటళ్లు ఆంధ్ర నుంచి మాయం అయ్యాక ఈ నిబంధనలు గాలికిపోయాయి. ఇప్పుడు ముందే చెప్పుకున్న సామాజిక వర్గం చేతిలో ఈ వ్యాపారం మెజారిటీ గా వుంది. మరి ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే పార్టీ ఆనాటి నిబంధనలను మళ్లీ అమలు చేయగలదా? అమలు చేస్తే ఎలా వుంటుంది?

ఇదిలా వుంటే ఆంధ్రలోని ఓ ప్రధాననగరం. అక్కడ ఓ ఉడిపి హొటల్ అద్భుతంగా రన్ అవుతూ వుండేది. అది జ‌స్ట్ చిన్న రెస్టారెంట్ మాత్రమే. దాని ఎదురుగా ఓ మీడియా పెద్దాయిన భారీ స్టార్ హోటల్ కట్టారు. కొన్నాళ్లకే ఈ ఉడిపి చిన్న రెస్టారెంట్ లో కార్మిక సంఘం అలజ‌డి మొదలైంది. సమ్మెలు ప్రారంభం అయ్యాయి. చివరకు సదరు యజ‌మాని హోటల్ మూసేసి తన రాష్ట్రానికి వెళ్లిపోయే వరకు గొడవలు జ‌రుగుతూనే వచ్చాయి.

ఇలాంటి సంఘటనలు చాలా వున్నాయి చెప్పుకుంటూ వెళ్లాలంటే. వ్యాపారవర్గం ఎదగడానికి చాలా కారణాలు వుంటాయి. గత అయిదు పదేళ్లలో ఆదానీ కంపెనీ ఆకాశం అంత ఎత్తుకు ఎదగడం వెనుక అనేక కధనాలు వచ్చాయి. అన్నిసార్లు సమర్థత మాత్రమే సరిపోదు. అండ దండ కూడా రాఙకీయంగా లభించాలి. 80 వ దశకం తరువాత అలాంటి అండ దండ ఈ సామాజిక వర్గానికి అందాయి అన్నది వాస్తవం కాదా? ఆంధ్ర నలుమూలలా రాజ‌కీయ, సామాజిక, వ్యాపార విస్తరణకు అది కూడా ఓ కారణం కాదని అనగలరా?