ఏపీని విభ‌జించి.. కాంగ్రెస్ బావుకున్న‌ది ఇది!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త‌న నిర్ణ‌యంతో విభ‌జ‌న‌కు ఏ ముహూర్తాన శ్రీకారం చుట్టిందో కానీ.. ఆ త‌ర్వాత అడుగ‌డుగునా కాంగ్రెస్ పార్టీ నిస్తేజం అయిపోవ‌డ‌మే త‌ప్ప‌, తెలంగాణ‌ను ఏర్పాటు చేసిన పాపానికో, పుణ్యానికో.. ఎలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్నీ పొందే ప‌రిస్థితుల్లో లేదు ఇప్ప‌టికీ! తెలంగాణ విభ‌జ‌న జ‌రిగాకా.. కేసీఆర్ ఏమో సీఎం అయ్యారు. 

ఇప్ప‌టికి ఎనిమిదేళ్లు గ‌డిచిపోయాయి. కేసీఆర్ వార‌సులు ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రెడీ అవుతూ ఉన్నారు. టీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యింది. మ‌రి తెలంగాణ‌లో ఏ ప్ర‌భుత్వం మీద అయినా ప్ర‌జావ్య‌తిరేక‌త త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకుంటే.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మునుప‌టికి మించిన స్థాయి విజ‌యాన్ని న‌మోదు చేసింది. విభ‌జ‌న చేసినా తొలి సారి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వ‌లేదు. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డం కాంగ్రెస్ పార్టీ స‌రిదిద్దుకోలేని త‌ప్పు అయ్యింది.

ఇక మ‌రోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల్సిన ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీకి వ‌ర‌స ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. స‌రిగ్గా ఒక్కసారి త‌ర‌చి చూసుకుంటే..2014లో విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లం అని చెప్పుకున్న వారు ఇప్పుడెంత మంది ఆ పార్టీలో మిగిలారు? అంటే వేళ్ల మీద లెక్క‌బెట్ట‌వ‌చ్చు. చాలా మందిని టీఆర్ఎస్ త‌న‌లోకి విలీనం చేసుకుంది. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు... సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, వారూ, వీరూ అనే తేడాలేవీ లేకుండా కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా టీఆర్ఎస్ లోకి క్యూ క‌ట్టారు. దగ్గ‌రుండి సోనియా చేత ఏపీ విభ‌జ‌న చేయించిన వారంతా.. అప్ప‌ట్లో సోనియాను దేవ‌తంటూ ఇప్పుడు కేసీఆర్ ను దేవుడంటూ ఉన్నారు. మ‌రి టీఆర్ఎస్ ఒక‌వైపు కాంగ్రెస్ ను అడుగ‌డుగునా క‌బ‌లిస్తూ ఉంది. మ‌రోవైపు బీజేపీ కూడా చొచ్చుకుపోతోంది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో జ‌రిగిన ప‌లు ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర్వాతి స్థానంలో బీజేపీ నిల‌బ‌డటం, టీఆర్ఎస్ కు బీజేపీనే పోటీ ఇవ్వ‌డం, టీఆర్ఎస్ పై బీజేపీ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేయ‌డం కూడా తెలిసిన సంగ‌తే. మ‌రి ఏదో ఒక ద‌శ‌లో కాంగ్రెస్ కోలుకుంటుంద‌ని న‌మ్ముతున్న వారికి ఆ పార్టీ నేత‌లే షాక్ ఇస్తున్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చాన్నాళ్లుగా అసంతృత‌ప్త స్వ‌రాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి నేప‌థ్యంలో ఏదో ఒక ద‌శ‌లో ఆయ‌న పార్టీతో స‌ర్దుకుంటాడ‌ని కొంత‌మంది భావించారు. అయితే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కురాజీనామా చేయ‌డ‌మే కాదు, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది.

ఒక‌వైపు బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ తెలంగాణ లీడ‌ర్లు కారాలూమిరియాలూ నూరుతున్న ద‌శ‌లో అమిత్ షాతో వెళ్లి స‌మావేశం అయ్యారు వెంక‌ట్ రెడ్డి. రాజ‌గోపాల్ రెడ్డి, వెంక‌ట్ రెడ్డిలు వేర్వేరుగా షాతో స‌మావేశం అయ్యారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డిపై వెంక‌ట్ రెడ్డి విరుచుకుప‌డ్డాడు. అక్క‌డ‌కూ రేవంత్ రెడ్డి స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నా.. వెంక‌ట్ రెడ్డికి అప్ప‌టికే అవ‌కాశం ద‌క్కింది. మ‌రోవైపు తెలంగాణ ఇంటి పార్టీని ఎవ‌రిని అడిగి రేవంత్ విలీనం చేసుకున్నాడంటూ.. వెంక‌ట్ రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. 

గ‌త ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి ప‌ని చేసిన చెర‌కు సుధాక‌ర్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవ‌డాన్ని వెంక‌ట్ రెడ్డి ఆక్షేపించారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మ‌యానికి వెంక‌ట్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. ప్ర‌స్తుతానికి అయితే వెంక‌ట్ రెడ్డి రేవంత్ పై విరుచుకుప‌డ‌టం జ‌రుగుతోంది. కోమ‌టిరెడ్డి సోద‌రులు వేర్వేరు పార్టీల్లో ఉంటార‌నుకోవ‌డం కూడా అంత న‌మ్మే అంశం కాదు. ఉప ఎన్నిక‌ల నాటికి వెంక‌ట్ రెడ్డి కూడా త‌మ్ముడి వైపే నిల‌బ‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

వీరు మాత్ర‌మే కాదు.. మ‌రి కొంద‌రు కూడా కాంగ్రెస్ ను వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. త‌దుప‌రి కాంగ్రెస్ కు చోటు చేసుకునే రాజీనామాలు టీఆర్ఎస్ వైపు వెళ్లే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే జ‌గ్గారెడ్డి, మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌లు టీఆర్ఎస్ తో ట‌చ్లో ఉన్నార‌ని, రేవంత్ రెడ్డిని గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న వీళ్లు టీఆర్ఎస్ లోకి చేర‌డం ఖాయ‌మ‌నే టాక్ ఉంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకెళ్ల‌డానికి , ఇద్ద‌రూ క‌లిసి ఒకేసారి చేరాల‌నే ప్ర‌తిపాద‌న‌తో భ‌ట్టి విక్ర‌మార్క సంప్ర‌దించాడ‌నే టాక్ ఉంది. అయితే రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీ దారిలో వెళ్తున్నారు. 

మొత్తానికి కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయ‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసినా, రెండ‌డుగులు వెనుక‌ప‌డుతూ ఉన్నాయి. ఉమ్మ‌డి ఏపీని విభ‌జించి కాంగ్రెస్ మూట‌గ‌ట్టుకున్న‌ది ఈ రాజ‌కీయ వైఫ‌ల్యాల‌నే త‌ప్ప మ‌రోటి కాద‌ని ఇన్నాళ్లకు పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఏపీ విడిపోతే బీజేపీ కి రాజకీయంగా బ‌లం ద‌క్కుతుంద‌నే వాద‌న కూడా అప్ప‌ట్లో వినిపించేది. ఆ విశ్లేష‌ణ కూడా వ‌మ్ము కాలేద‌నే స్ప‌ష్ట‌తా వ‌స్తోంది.