కోమటి నీతి.. బుజ్జగించడానికి వెళ్లినోళ్లకూ ఆఫర్లు!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయన బిజెపిలో చేరడం ఖాయం. కాకపోతే మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. ఈ శ్రావణ మాసం ముహూర్తాల్లోనే ఆయన ఈ పర్వం పూర్తి చేయవచ్చు. ముహూర్తం ఒక్కటే కాకుండా, కాంగ్రెస్ పార్టీ తనను చాలా చాలా బతిమాలుతోంది.. బుజ్జగించడానికి ప్రయత్నిస్తోంది.. ఆ పార్టీకి తాను వెళ్తే దిక్కులేకుండా పోతుంది అనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి కూడా ఆయన ఇలా చేరికను ఆలస్యం చేస్తున్నారనేది కొందరి వాదన. 

కాంగ్రెస్ పార్టీ కూడా.. ఆయన వ్యూహానికి తగినట్టుగానే.. కోమటిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక వనరుల పరంగా బలమైన నాయకుడు కావడంతో ఆయనను వదులుకోవడం పార్టీకి ఇష్టం లేదు. అందుకోసం ఆయన తనంతగా వెళ్లిపోతున్న నిర్ణయం ప్రకటించే వరకు వేచిచూడాలని అనుకుంటోంది. 

సాధారణంగా అయితే.. మరొక నాయకుడి విషయంలో వ్యవహారం ఇంతవరకు వచ్చిందంటే.. ఈ పాటికి సస్పెన్షన్ విధించడం జరిగిపోయేది. పార్టీనుంచి డిస్మిస్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ కోమటిరెడ్డిపై అలాంటి చర్యలు తీసుకోకపోగా.. పార్టీలోనే ఉంటే గౌరవం కల్పిస్తామని అంటూ.. ఇంకా రకరకాల ఆఫర్లతో ఆయనను బుజ్జగించడానికి రాయబారులను ఆయన వద్దకు పంపుతోంది. 

సరిగ్గా ఇక్కడే కోమటి మార్కు రాజకీయ బయటకు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లొద్దు అని బుజ్జగించడానికి ఎవరైనా నాయకులు తన వద్దకు వచ్చినా, ఫోన్లు చేసినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి ఎదురు ఆఫర్లు ఇస్తున్నారట. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మునిగిపోయే నావ. ఆ పార్టీలో ఉండి మీరు సాధించేదేమీ లేదు. నాతోపాటు బిజెపిలోకి వచ్చేయండి.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. మీకు మంచి ఆఫర్ దక్కేలాగా నేను మాట్లాడతాను. ఎటూ కేంద్రంలో కూడా అధికారంలోకి ఖచ్చితంగా వచ్చే పార్టీనే కాబట్టి.. రాష్ట్రంలో విజయం ఎలా ఉన్నా.. రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు.. కాంగ్రెస్ లోనే ఉన్నారంటే.. మీ భవిష్యత్తు ఎటూ కాకుండాపోతుంది అని వారిని హెచ్చరిస్తున్నారట.

రాజగోపాల్ ను బుజ్జగించడానికి ఎవరినైనా పురమాయిస్తే.. వారు కూడా కమలదళంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నదని.. పార్టీ హైకమాండ్ భయపడినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి కమలదళంలో చేరిక ద్వారా.. చాలా పెద్ద భవిష్యత్తును ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తన చేరిక చాలా ఘనంగా ఉండాలని అనుకుంటున్నారు. 

తన వెంట.. వివిధ వర్గాలకు చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులను తీసుకుని కమలతీర్థం పుచ్చుకుంటే.. ఆ పార్టీలో తన గౌరవం ఇంకా పెరుగుతుందనేది ఆయన ఆలోచనగా ఉంది!