Ramarao On Duty Review: మూవీ రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ

టైటిల్: రామారావు ఆన్ డ్యూటీ
రేటింగ్: 2/5
తారాగణం: రవితేజ, దివ్యాన్షి కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, భరణి, నరేష్, పవిత్ర లోకేష్, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ, అరవింద్ కృష్ణ తదితరులు
కెమెరా: సత్యన్ సూర్యన్ 
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
సంగీతం: శ్యాం సి.ఎస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శరత్ మండవ
విడుదల తేదీ: 29 జూలై 2022

రవితేజ హీరోగా "రామారావు ఆన్ డ్యూటీ" అనే క్యాచీ టైటిల్ తో సినిమా అనగానే సగటు ప్రేక్షకుడికి ఆసక్తి కలగడం సహజం. అంతకు మించి ప్రత్యేకార్షణలేవీ లేని సినిమా ఇది. ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి రీ-ఎంట్రీ ఇచ్చినా అది రవితేజ వయసు వాళ్లకి తప్ప నేటి యువ ప్రేక్షకులకి అండర్‌లైన్ చేసుకునే విషయమే కాదు. ఇంతకీ హీరోయిన్లు ఎవరా అంటే తెలుగు ప్రేక్షకులకి అనామకురాళ్లే. విలన్లెవరైనా బలమైన నటులున్నారా అంటే అదీ లేదు. సంగీత దర్శకుడు పేరేమైనా స్టార్డం ఉన్న పేరా అంటే అదీ కాదు. ఏ రకంగానూ ప్యాడింగ్ లేకుండా పూర్తిగా రవితేజ ఇమేజ్ ని నమ్ముకుని ఒక కొత్త దర్శకుడి భుజాలమీద పెట్టిన కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. 

పబ్లిసిటీలో భాగంగా పాటలు విడుదల చేస్తే అవేవీ అద్భుతం సృష్టించలేదు. రాజుని చూస్తే మొగుడ్ని మొత్తబుద్ధేసినట్టు "సీసా సీసా.." అనే ఐటం సాంగ్ పర్వాలేదనుకున్నా "ఊ అంటావా మమా" ని విన్న చెవులు పెద్దగా పట్టించుకోలేదు. అన్నట్టు ఐటం సాంగంటే గుర్తొచ్చింది. ఇందులో నటించిన నటి కూడా పెద్ద స్టారేమీ కాదు. 

అసలు లైనేంటంటే...ఒక గవర్న్మెంట్ ఆఫీసర్ (ఎమ్మార్వో) రైతులకెలా మేలు చేసాడు? తన కింది వారి చేత సిన్సియర్ గా డ్యూటీ ఎలా చేయించాడు. మిస్సైన తన మాజీ లవర్ భర్త గురించి ఎలా నేరపరిశోధన చేసాడు..అంతే! 

దీని చుట్టూ ఏం కథ అల్లి ఏం చెప్తే నిర్మాత ఓకే చేసాడో తెలీదు. బహుశా రవితేజకి నచ్చిందని చెప్పడంతో ఒప్పుకుని ఉండొచ్చు. మరి ఇందులో రవితేజకి నచ్చిన అంశమేంటో ఆయనకే తెలియాలి. 

రవితేజ తన సహజసిద్ధమైన ట్రేడ్ మార్క్ ఎనెర్జీని పక్కన పెట్టి అత్యంత నీరసంగా నటించిన సినిమా ఇది. తెర మీద ఏ పాత్ర చస్తున్నా ప్రేక్షకుడికి కించిత్తు కూడా బాధ కలగదు సరి కదా .. మిగిలిన పాత్రలు కూడా త్వరగా చచ్చిపోతే ఇంటికెళ్లిపోవచ్చన్న ఫీలింగ్ కలుగుతుంది. 

అసలు ప్రధమార్థంలో వచ్చే రైతుల గొడవ, దాంట్లో రవితేజ ఆడే డబుల్ గేం, చివరకి సహాయం కంటే నష్టపరిహారమైతే బెటరని అంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేసానని తాను కలెక్టర్ కి చెప్పడం...అంతా గందరగోళంగా సబ్ టైటిల్స్ లేని మళయాళ సినిమా చూస్తున్నట్టుంటుంది తప్ప తెలుగు సినిమాలాగ అర్థం కాదు. 

దర్శకుడు మనసులో ఏదో ఊహించుకుని ఏదో తీసేసి ఎడిటర్ కి ఇస్తే, చేసేది లేక ఉన్నంతలో అతుకులు పెట్టి జనం మీదకి వదిలినట్టుంది ఈ చిత్రం. 

1990ల్లో తమిళ కూలీల సామూహిక కాల్చివేత అనే వార్త నేపథ్యంలో సినిమా తీయడానికి మొత్తం కథ సెటప్పునే 1993-95 కి మార్చేసారు. మధ్యమధ్యలో ఇది ఆ పీరియడ్ కథ అని గుర్తుచేయడనైకి ముఠామేస్త్రీ, పెళ్లిసందడి పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటాయి. అసలే కథ ఎటు పోతోందో అర్థం కాని అయోమయంలో ఉంటే ఈ పాటలు ఇంకా చిరాకు పెడతాయి. 

ఇంతటి సీరియస్ సినిమాలో రిలీఫ్ లేదని బాధపడే వారికి ఆడియన్స్ తమకి తామే రిలీఫ్ అందించుకున్నారు. అదెలా అంటే పవిత్రాలోకేష్ తెర మీద కనిపించినప్పుడల్లా అరిచి. ఈ మధ్యన ఆవిడ వివాదాస్పద వార్తల్లో మెరవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందా అనుకుంటే పూర్తిగా నిజం కాదు. తెర మీద సినిమా ఏ రకంగానూ ఆకట్టుకోకపోవడం వల్ల ప్రేక్షకులు డైవర్షన్ కోసం ఆమెను ట్రోల్ చేస్తూ కాలక్షేపం చేసారు. 

ఇక సంభాషణల విషయానికొస్తే- "రైతు తన పది వేళ్లు మట్టిలో పెడితే తప్ప మనం ఐదు వేళ్లు నోట్లో పెట్టుకోలేం" అనే ఒక్క అర్థవంతమైన డయలాగ్ మినహాయించి ఇందులో చెప్పుకోదగ్గ సంభాషణ ఒక్కటీ లేదు. 

ఒక సన్నివేశంలో నాజర్ తన కొడుకు రవితేజ ఏం చేస్తున్నాడో అర్థం కాక బాధగా ఒక మాటంటాడు- "నీకున్నంత పరిజ్ఞానం నాకు లేదు కానీ నన్నిలా వదిలేయరా" అని. 

ప్రేక్షకులకి కూడా ఏం చెప్తున్నాడో అర్థం కాని దర్శకుడ్ని తలచుకుంటూ ఇదే డయలాగ్ కొట్టాలనిపిస్తుంది. 

హీరోయిన్స్ ఇద్దరితోనూ స్పెయిన్లో డ్యూయెట్స్ పెట్టాడు దర్శకుడు. ఈ జానర్ కి ఆ చేంజోవర్ ఓవర్ గా ఉంది తప్ప ఆహ్లాదంగా లేదు. ఏది ఏమైనా..ఆడియన్స్ కి పెయిన్, హీరోకి స్పెయిన్. 

చాలాసేపటి వరకు మెయిన్ హీరోయిన్ దివ్యాన్షి ఇంట్లో పనిమనిషిలాగ కనిపిస్తుంది తప్ప అసలీ కథకి తన అవసరమేంటో కూడా అర్థం కాదు. తర్వాతైనా ఒక పాటలో మెరవడం తప్ప ఆమె చేయగలిగిందేమీ లేదు. సెకండ్ హీరోయిన్ రజిషా విజయన్ కూడా అంతే. ఏ రకంగానూ లవ్ స్టోరీ హత్తుకోలేదు. 

రవితేజ నటన చాలా బ్యాడ్ గా ఉన్న సినిమా ఇది. వాచకం పరంగా కూడా సీమ యాస ప్రయత్నించి భంగపడ్డాడు. కుదరనప్పుడు తన సహజమైన పద్ధతిలో డయలాగ్స్ చెప్పాలి తప్ప అవకతవకగా చెబితే నాన్ సింక్ కొట్టి చూసే వాళ్లకి ఇబ్బంది కలుగుతుందని గ్రహించలేదెందుకో. ఇక్కడ రవితేజని చూస్తే పుష్పలో డయలాగ్స్ కి అల్లు అర్జున్ ఎంత కృషి చేసాడో అనిపిస్తుంది. 

అన్నట్టు ఈ సినిమా నేపథ్యమంతా శేషాచలం అడవులు, ఎర్రచందనం చెట్లు వగైరా. పుష్ప నేపథ్యాన్ని గుర్తు చేస్తుంది. అదే విధంగా ఆ సినిమాతో ఈ సినిమాకి తెలీయకుండానే మన మెదడు పోలిక పెట్టి దీనిని మొత్తబుద్ధేస్తుంది. 

ఎలా చూసుకున్నా ఇదొక అవకతవక కంగాళీ సినిమా. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్, లవ్..ఇలా అన్నీ కలిపేసి ఏదో పదార్థం వండే ప్రయత్నంలో అసలు అర్థమే అందకుండా చేసిన సినిమాకి ఇదొక ఉదాహరణగా మిగిలిపోతుంది. 

ప్రభుత్వాఫీసుల్లో ఉద్యోగులు డ్యూటీ టైములో నిద్రపోతారని ప్రతీతి. అదేమో కానీ ఇక్కడ రామారావుగారి డ్యూటీ చూస్తూ ఆడియన్స్ కి మాత్రం నిద్ర తన్నుకొస్తుంటుంది. 

అయితే ఎండ్ సీన్ చూసాక మత్తు వదిలిపోతుంది. ఈ కథలో అసలు విలన్ కనిపిస్తాడు. ఈ ఎమ్మార్వో రామారావుగారు టాస్క్ ఫోర్స్ కాప్ గా దర్శమిస్తారు (?!). అదెలా అని ప్రశ్న ఉదయిస్తే ఏం చెప్పలేం. పుష్ప టైపులో సీక్వెల్ కి సూచన అన్నమాట! 

బాటం లైన్: నిద్రమాత్ర లాంటి చిత్రం