ఎమ్బీయస్‍: పొన్నియిన్ సెల్వన్ నేపథ్యం

భారీ బజెట్‌తో రెండు భాగాలుగా వస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ సినిమా ‘‘పొన్నియిన్ సెల్వం’’ సినిమాను ను అర్థం చేసుకోవాలంటే, ఆస్వాదించాలంటే దాని చారిత్రక నేపథ్యం కొంతైనా తెలియకపోతే కష్టం. మనకు మన చరిత్రే సరిగ్గా తెలియదు. తెలుగు రాజుల గురించి చెప్పమంటే కృష్ణదేవరాయలు- తిమ్మరసు (మేక కళ్లు), రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, యుగంధరుడు (ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అనే కట్టుకథ కారణంగా), రాజరాజనరేంద్రుడు – సారంగధరుడు (అదో కట్టుకథ).. యిలాటివే గుర్తుకు వస్తాయి. ఈ మధ్య గౌతమీపుత్ర శాతకర్ణి తెలిశాడు. రాజవంశాలు చెప్పమంటే కాకతీయులు, శాతవాహనులు తప్ప వేరెవరూ గుర్తుకు రారు. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు యిలా పేర్లు చెపితే విన్నట్లే ఉందంటాం తప్ప వారిలో గొప్ప రాజులెవరో తెలియదు.

ఏదైనా విషయం తెలుసుకోవాలంటే మనకు దాని అవసరం పడాలి, నేర్చుకున్నాక గుర్తుండాలంటే ఉపయోగించాలి. చిన్నపుడు మార్కుల కోసం చరిత్ర చదువుతాం. తర్వాత అవసరం పడదు కాబట్టి మర్చిపోతాం. ఇలా చారిత్రాత్మక చిత్రం ఏదైనా వస్తే అప్పుడు లేచి కూర్చుని అసలు చరిత్ర ఏమిటి? వీళ్లెంత మార్చేశారు అని ఆచూకీ తీయడానికి, చరిత్ర తెలుసుకుంటాం. ఇప్పుడు యీ మణిరత్నం సినిమా ఎలా ఉన్నా, ఓ సారి చూడడానికి ఉత్సాహపడతాం. కనీసం దాని గురించి చర్చిస్తాం. అందువలన ఆ సినిమా కాలం నాటి చరిత్ర గురించి కొంత చెపుతున్నాను. చోళులు, పాండ్యులు ఎవరు, సినిమాలో వచ్చే పాత్రల అసలు చరిత్ర ఏమిటి? అనేది చెప్తాను. నేను ఆ భారీ నవల చదవలేదు. రచయిత కల్కి కృష్ణమూర్తి ఎంత ఫిక్షన్ కలిపారో కరక్టుగా తెలియదు. సినిమాగా తీసేటప్పుడు మణిరత్నం ఏం మార్చారో సినిమా చూసినా కనుక్కోలేను.

అయితే యీ కసరత్తు ఎందుకు అంటారేమో, ఆ సినిమాను కాస్తయినా ఫాలో అవ్వాలంటే ముఖ్యపాత్రల గురించైనా అవగాహన ఉండాలి. 50 పాత్రలు, వాటిలో ముఖ్యమైనవి 15 పాత్రలు ఉన్నాయిట. యూట్యూబ్‌లో దాని గురించి వీడియోలు చూస్తూ ఉంటే బోల్డు పేర్లు దొర్లుతున్నాయి. అన్నీ టిపికల్ తమిళ పేర్లు. గుర్తుంచుకోవడం కష్టం. మణిరత్నం సినిమాల్లో డైలాగులు హాలీవుడ్ సినిమాల్లోలా పొడిపొడిగా ఉంటాయి. చెవులు రిక్కించుకుని వినాలి. ఏ పేరు మిస్సయిపోయినా, కథలో ట్విస్టులు అర్థం చేసుకోలేక గందరగోళ పడిపోతాం. అందుకని ఎవరెవరో కాస్త తెలుసుకుని పెట్టుకుంటే, కథాగమనాన్ని అర్థం చేసుకోవచ్చని ఆశ.

ఈ నవలకు కథానాయకుడు రాజరాజ చోళుడు. పొన్నియిన్ సెల్వన్ అనేది అతని బిరుదనామమే. గుర్తు పెట్టుకోవాలంటే కావేరీపుత్రుడు అనుకుంటే సరిపోతుంది. కావేరీనదికి మరో పేరు పొన్ని, ఇతను ఒకసారి ఆ నదిలో మునిగిపోతూ ఉంటే ఆ నదే యితన్ని రక్షించిందని చెప్పుకోవడం చేత యితన్ని పొన్ని నదీపుత్రుడు అన్నారు. ఈ రాజరాజ పేరు కూడా సింహాసనం ఎక్కాక పెట్టుకున్న పేరు. అతని అసలు పేరైన అరుళ్ మొళి వర్మన్ (ఇంగ్లీషులో స్పెల్లింగు చూసి మొజి అనుకోకండి) పేరే యీ సినిమాలో ఎక్కువగా వినబడుతుంది (మనం మాత్రం రాజరాజు అనే చెప్పుకుందాం). ఎందుకంటే అతను రాజు కావడానికి పూర్వగాథ యిది. ఎన్నో మంచి పనులు చేసి, తంజావూరులోని బృహదీశ్వరాలయం కట్టించిన యీ రాజరాజ చోళన్‌కి తెలుగువాళ్లకి కనక్షన్ ఉంది. ఇతని దౌహిత్రుడే (కూతురు కొడుకు) మన రాజరాజ నరేంద్రుడు. మాతామహుడి పేరే అతనికి పెట్టారు. అంతటి చక్రవర్తి కుమార్తెను రాజరాజ నరేంద్రుడి తండ్రి ఎలా పెళ్లాడాడు అనేది మరో వ్యాసంలో చెప్తాను.

ఇంతకీ యీ నవల, సినిమా అంతా చోళ, పాండ్య రాజుల చరిత్రను ఆధారం చేసుకుని చేసిన కల్పన. చరిత్రలో స్థూలంగా ఉన్న విషయాలను తీసుకుని, కొన్ని సంఘటనలు ఎందుకు, ఎలా జరిగి ఉంటాయో ఊహించుకుని కథ రాసుకున్నారు. అందువలన కొన్ని నిజమైన పాత్రలు, కొన్ని కల్పితపాత్రలు. ముఖ్యమైన పాత్రల గురించి చరిత్ర ఏం చెప్తోందో యీ వ్యాసంలో చెప్తాను. దానికి ముందు తమిళనాట ఆ కాలంలో నెలకొన్న రాజ్యాల గురించి కాస్త తెలుసుకోవాలి. పల్లవులు కంచిని రాజధానిగా చేసుకుని దక్షిణ తెలుగు, ఉత్తర తమిళ ప్రాంతాలను క్రీ.శ.300 నుంచి 600 ఏళ్లపాటు ఏలారు. కథాకాలం నాటికి పల్లవుల ప్రభావం క్షీణించింది. వారి వంశీకుడు ఒకడు చోళ యువరాజుకి సాయపడ్డాడు. పల్లవుల తర్వాత ప్రాభవంలోకి వచ్చిన చోళ, పాండ్య, చేర రాజ్యాలు తమిళనాడు, కేరళ మాత్రమే కాక శ్రీలంక, ఆగ్నేయాసియా లోని అనేక దేశాలను ఏలారు. ఒక్కో కాలంలో ఒక్కొక్కరు యితరుల ప్రాంతాలను జయించారు.

కావేరీ నదీ తీరప్రాంతీయులైన చోళులు చాలాకాలమే ఉన్నా 9వ శతాబ్దం మధ్య నుంచి 1300 సం.వరకు అంటే 450 ఏళ్లు బాగా వెలిగారు. వీళ్ల రాజధాని తొలుత పళయారై. తర్వాత తంజావూరుకి మారింది. వైగై నదీ ప్రాంతీయులైన పాండ్యులూ చాలాకాలమే ఉన్నారు. చోళులతో వాళ్లకు నిత్యఘర్షణ నడిచేది. చోళుల కంటె మరో 50 ఏళ్లు ఎక్కువ వెలిగారు. వాళ్ల రాజధాని మధురై. ఇంచుమించు యిదే సమయంలో పశ్చిమ తమిళనాడు, మధ్య కేరళ ప్రాంతాలను చేరులు పాలించారు. వాళ్ల రాజధాని మొదట్లో వంచి, తర్వాత కరూరు. ఈ కథలో చేరుల ప్రస్తావన లేదు కాబట్టి వారి గురించి ప్రస్తుతం మనకు అనవసరం. కథలో చోళప్రత్యర్థులైన రాష్ట్రకూటుల ప్రస్తావన ఉంది కానీ అది తక్కువే. దీనిలో హీరోలు చోళులు, విలన్లు పాండ్యులు. వాళ్ల గురించి తెలుసుకుంటే చాలు. వాళ్లనీ వదిలేయవచ్చు. కథాకాలం నాటికి సుందర చోళుడు (రాజయ్యే ముందు అతని పేరు రెండవ పరాంతక చోళుడు, పరిపాలనా కాలం క్రీ.శ. 962 – 980) రాజుగా పాలిస్తున్నాడు. అంటే వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కథ అన్నమాట.

ఈ సుందర చోళుడికి (సుందరుడు అనుకుందాం, ప్రకాశ్ రాజ్) ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ (పాత్రధారి విక్రమ్, మనం ఆదిత్యుడిగా చెప్పుకుందాం), కుందవై (త్రిష), అరుళ్‌మొళి వర్మన్ (మనం రాజరాజుగా చెప్పుకుందాం, పాత్రధారి జయం రవి). ఆదిత్యుడు మహావీరుడు, ఆవేశపరుడు. సుందర చోళుడు గద్దె నెక్కేనాటికి చోళ రాజ్యం క్షీణించి, పాండ్యులది పైచేయిగా ఉంది. సుందరుడు యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపచేసి, తర్వాతి రోజుల్లో పెద్ద సామ్రాజ్యంగా కావడానికి పునాదులు వేశాడు. అతను మరణించిన ఐదేళ్లకు రాజ్యానికి వచ్చిన అతని రెండో కుమారుడు రాజరాజు 29 ఏళ్ల పాటు పాలించి, చక్రవర్తి అయ్యాడు. అతని కుమారుడు రాజేంద్ర చోళుడు, తన 30 ఏళ్ల పాలనలో యింకాయింకా విస్తరించి అనేక రాజ్యాలను, యిప్పటి లెక్కలో చెప్పాలంటే అనేక దేశాలను జయించాడు.

సుందరుడు రాజుగా ఉండే రోజుల్లో ఆదిత్యుడు దళపతిగా ఉంటూ  పాండ్య రాజైన వీరపాండ్యుణ్ని చేవూరు యుద్ధంలో ఓడించాడు. అతను పారిపోతే వెంటాడుతూ వెళ్లి అతని తలను తెగ్గోశాడు. దాంతో అతనికి ఆ మేరకు బిరుదు వచ్చింది. అతని తండ్రి అతన్ని యువరాజుగా, తనకు వారసుడిగా చేశాడు. ఆ పదవిపై ఆశ పెట్టుకున్న ఉత్తమ చోళుణ్ని అది మండించింది. వారసత్వం కోసం కుట్రలు జరిగాయి. వీరపాండ్యుడి హత్యకు బదులు తీర్చుకోవాలనుకున్న పాండ్యులు తమ గూఢచారుల ద్వారా పన్నాగాలు పన్నారు. వారిలో ముఖ్యమైన వాడు ఐంద్రజాలికుడైన రవిదాసన్ (పాత్రధారి కిశోర్). చివరకు క్రీ.శ 969లో ఆదిత్యుడి హత్య జరిగింది. రాజు కావలసినవాడు హతుడయ్యాడు. దాంతో ఉత్తముడు యువరాజు అయ్యాడు. 980లో సుందరుడి మరణం తర్వాత ఉత్తమ చోళుడు ఐదేళ్లు పాలించాడు. 985లో అతను మరణించిన తర్వాత రాజరాజు తనే గద్దె కెక్కాడు.

ఈ ఆదిత్యుడి హత్య ఎలా జరిగింది? ఎవరు చేయించారు అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. పాండ్యులు కుట్ర పన్నారని అనుకున్నా, వారికి సహకరించిన వారెవరు? ఉత్తమ చోళుడా? లేక అన్నగారి అడ్డు తొలగించుకోవాలనుకున్న రాజరాజా? ఆదిత్యుడి హత్య ఫలానా విధంగా జరిగి ఉండవచ్చు అని ఊహించి రాసిన నవల ‘‘పొన్నియిన్ సెల్వన్’’. రాజుల కథలన్నిటిలో లాగానే దీనిలో కూడా కుట్రలు, కూహకాలు, రాజుల అక్రమ సంతానాల పగలూ, ప్రేమ-ద్వేషం అన్నీ ఉంటాయి. అందుకే అది రసవత్తరమైన కథ అయింది. ప్రజాదరణ పొందిన నవల అయింది. ఇప్పుడు సినిమాగా రాబోతోంది.

ఇంతకీ గద్దెపై ఆశ పెట్టుకున్న ఉత్తమ చోళుడు ఎవరు? అతను సుందరుడికి బాబాయి అవుతాడు. మొదటి పరాంతకుడికి (873-955) ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు. పరాంతకుడు 955లో పోయాక రెండో కొడుకు గండరాదిత్యుడు సింహాసనం ఎక్కాడు. ఆరేళ్లు పాలించాక మరణించాడు. అప్పుడు అతని కొడుకు ఉత్తముడు బాగా పసి పిల్లవాడు కావడంతో గండరాదిత్యుడి తమ్ముడు అరింజయుడు సింహాసనం అధిష్టించాడు. ఒక ఏడాది పాలించి అతను మరణించాడు. అప్పటికింకా ఉత్తముడు పసివాడే కదాని కాబోలు సుందరుడు రాజయ్యాడు. కాస్త పెద్దవాడయ్యాక తనను యువరాజు చేస్తాడేమోడని ఉత్తముడు ఆశ పెట్టుకుంటే, సుందరుడు ఉత్తముణ్ని పక్కకు పెట్టి, తన పెద్ద కొడుకు ఆదిత్యుణ్ని యువరాజుగా చేశాడు. అందువలన అతను పగబట్టి, సుందరుణ్ని దింపివేయడానికి ప్రయత్నించాడని యీ నవలలో రాశారు. అంతే తప్ప ఆదిత్యుణ్ని చంపించినట్లు రాయలేదు.

అయితే చరిత్రలో లేని ఒక విషయాన్ని కల్కి యీ నవలలో కల్పించారు. ఉత్తముడి అసలు పేరు మధురాంతకన్. తండ్రి గండరాదిత్య, తల్లి సెంబియన్ మహాదేవి (జయచిత్ర వేసిన పాత్ర). అతనే ఉత్తముడిగా రాజయ్యాడని చరిత్ర చెపుతోంది. అయితే కల్కి మధురాంతకన్‌ను విలన్‌గా చూపి, ఉత్తముడి పేరుతో గద్దె కెక్కినవాడు సెందన్ అముదన్ అనే వేరే వ్యక్తి అని కల్పించారు. సుందరుణ్ని పదభ్రష్టుణ్ని చేసి, మధురాంతకుణ్ని రాజుని చేయాలని సామంతరాజులు కుట్ర చేయడం గురించి నవలలో చాలా భాగం నడుస్తుంది. ఆదిత్యుడి మరణం తర్వాత సుందరుడు మధురాంతకుణ్ని యువరాజుగా ప్రకటించబోతే అతని తల్లి సెంబియన్ మహాదేవి అభ్యంతరం తెలిపింది. ఇది మధురాంతకుణ్ని ఆశ్చర్యపరిచింది. నువ్వు నా కన్నతల్లివేనా? అని అడిగాడు. అప్పుడామె కాదంటూ గతం చెప్పింది.

ఆమెకు పుట్టిన బిడ్డ పుట్టీపుట్టగానే విగతజీవుడయ్యాడు. అప్పుడామె ఆ పిల్లవాణ్ని ఒక మూగామెకి (ఈమె నందిని తల్లి మందాకినికి కవలసోదరి) యిచ్చి ఆమె వద్దనున్న పిల్లవాణ్ని తీసుకుని తన పిల్లవాడిగా ప్రకటించి పెంచింది. అతనే మధురాంతకుడు. అయితే యీ మార్పిడి జరిగిన ఐదేళ్లకు మహాదేవి మూగావిడ యింటికి వెళితే అక్కడ ఒక ఐదేళ్ల బాబు కనబడ్డాడు. ఆమెకు సందేహం వచ్చి అడిగితే మూగామె ‘మీరు చచ్చిపోయాడనుకున్న శిశువు నిజంగా చచ్చిపోలేదు. మా యింటికి తీసుకుని వచ్చాక బతికాడు. నేను పెంచుకుంటున్నాను.’ అంది. అతనే సెందన్ అముదన్. ఇప్పుడతను యువకుడు. మధురాంతకుడు రాజవంశీకుడే కాదు కాబట్టి సింహాసనం ఎక్కడానికి అనర్హుడు. ఇది వింటూనే మధురాంతకుడు కోపంగా వెళ్లిపోయాడు. మహాదేవి అప్పుడు అముదన్‌ను తన కొడుకుగా ప్రకటించింది. సుందరుడు అతన్ని యువరాజుగా చేశాడు. సుందరుడి మరణం తర్వాత రాజరాజు ఏ పేచీ పెట్టకుండా అముదన్‌నే రాజుగా చేశాడు. అతనే ఉత్తముడనే పేర రాజ్యం చేశాడు. అతని మరణం తర్వాత రాజరాజు సింహాసనం ఎక్కాడు.  

ఆ మూగామె సోదరి ఐన మందాకినికి మధురాంతకన్‌తో పాటు యింకో కూతురు కూడా ఉంది. ఆమె పేరు నందిని (ఐశ్వర్యా రై వేసిన పాత్ర). దుష్టపాత్ర. చరిత్రలో యీమె గురించి ఏమీ లేదు. కల్కి కల్పించిన పాత్రే యిది. ఈమె తండ్రి ఎవరన్నది రచయిత స్పష్టంగా చెప్పలేదు. ఈమె తల్లి మందాకిని అందగత్తెయే కానీ మూగది. కొంతకాలం పాటు సుందరుడు శ్రీలంకలో ఉండగా అతనికి ప్రియురాలిగా ఉండేది. అతను తంజావూరు వచ్చేశాక వీరపాండ్యుడికి ప్రియురాలైంది. మధ్యలో కొంతకాలం మతి పోగొట్టుకుంది. నవల చివరి భాగంలో సుందరుడి అంతఃపురానికి వచ్చి కాస్త గందరగోళాన్ని సృష్టించింది. ఇక నందిని అద్భుత సౌందర్యవతి. ఆదిత్యుణ్ని ప్రేమించి, తర్వాత అతనిపై పగ బూనింది. అతని చావుకి కారకురాలైంది. అంతేకాదు, పాండ్యులతో చేయి కలిపి చోళ వంశాన్ని నాశనం చేయడానికి సమకట్టింది. చోళ సామ్రాజ్యంలో అధికారులుగా ఉన్న నలుగురు పాండ్యుల తరఫున పని చేస్తూ ఆమెకు సాయపడ్డారు.

ఈ కుట్రల గురించి అవీ చెప్పడానికి, పాత్రలను పరిచయం చేయడానికి కల్కి ఒక పాత్రను ఎంచుకున్నారు. అతని పేరు వల్లవరాయన్ వందిదేవన్ (కార్తీ వేసిన పాత్ర). ఆదిత్యుడికి స్నేహితుడు. కంచిలో మాతామహుడి దగ్గర ఉన్న ఆదిత్యుడు తాను కట్టిన బంగారు భవనాన్ని చూడడానికి రమ్మనమని తంజావూరులో ఉన్న తండ్రిని, పళయారైలో ఉన్న చెల్లెలు కుందవైని ఆహ్వానిస్తూ ఆ సందేశాన్ని వందిదేవుడితో పంపడంతో నవల ప్రారంభమౌతుంది. అతని ప్రయాణంలో సామంతరాజుల కుట్ర తెలియడం, అనుకోకుండా కుందవైని, గూఢచారి నంబిని కలవడం, నంబి ద్వారా జరిగిన చరిత్రను తెలుసుకోవడం జరుగుతాయి.

అనాథగా ఉన్న నందిని (ఆమె మధురాంతకుడికి చెల్లెలనే విషయం తర్వాత ఎప్పుడో తెలుస్తుంది) నంబి యింట్లోనే పెరిగింది. నంబి ఆమెను చెల్లిగా భావించాడు. రాజకుటుంబంతో పాటే నందిని  పెరిగింది. ఆమె అసమాన సౌందర్యవతి. తలచుకుంటే ఏ మగవాణ్నయినా యిట్టే పడగొట్టగలదు. అయితే రాజు కూతురు కుందవై కూడా అందగత్తెయే. పైగా చాలా తెలివైనది. తండ్రికి సలహా లివ్వగలదు. అందరి గౌరవాన్నీ పొందేది. ఆమెను చూసి నందిని కుళ్లుకునేది. ఆదిత్యుడు, నందిని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ రాచకుటుంబం, ముఖ్యంగా మహాదేవి దాన్ని ఆమోదించలేదు. దాంతో నందిని చోళ రాజ్యంపై పగబట్టింది. హఠాత్తుగా అంతర్ధానమై పోయింది.

ఆదిత్యుడు (విక్రమ్ వేసిన పాత్ర) వీరపాండ్యుణ్ని (నాజర్ వేసిన పాత్ర) యుద్ధంలో ఓడించి, అతన్ని తరుముతూ ఒక గుడిసెలోకి వెళ్లినపుడు అతని గాయాలకు సపర్యలు చేస్తూ నందిని కనబడింది. ఆదిత్యుడు ఆశ్చర్యపడ్డాడు. కోపంతో వీరపాండ్యుడిపై కత్తి దూశాడు. వద్దువద్దంటూ నందిని అడ్డుపడింది. అయినా వినకుండా ఆదిత్యుడు వీరపాండ్యుడికి శిరచ్ఛేదం చేసి, అతని తలను బయటకు పట్టుకుని వచ్చి, అందరికీ ప్రదర్శించి, ప్రశంసలు పొందాడు. నందిని పగతో రగిలిపోయింది. వెంటనే చోళ రాజ్యానికి వచ్చి, పెరియ పళవేట్టురాయన్ (గుర్తు పెట్టుకోవడానికి పెరియవన్ అనే పేరు వాడతాను, శరత్ కుమార్ యీ పాత్ర వేశాడు) అనే 60 ఏళ్ల సామంతరాజుని పెళ్లాడింది. అతను చోళరాజ్యానికి కోశాధికారి. అతను, అతని తమ్ముడు చిన్న పళవేట్టురాయన్ (చిన్నవన్ అని వాడతాను) రాజుకి అంతరంగికులు. కానీ నందిని మోహంలో పడిన పెరియవన్ తన తమ్ముడితో కలిసి అస్వస్థుడిగా ఉన్న రాజుకి ద్రోహం తలపెడుతున్నాడు. అతన్ని దింపేసి మధురాంతకుణ్ని రాజుగా చేయాలని కుట్రలు పన్నుతున్నాడు.

ఈ విధంగా నేపథ్యం తెలుసుకున్న వందిదేవుడు ఆ తర్వాత రాజుని కలిశాడు. కుందవైను కలిసినప్పుడు యిద్దరూ ఒకరంటే ఒకరు యిష్టం పెంచుకున్నారు. ఆమె కోరికపై చోళ అధీనంలో ఉన్న ఉత్తర శ్రీలంకలో ఉన్న ఆదిత్యుడి తమ్ముడు రాజరాజు వద్దకు పయనించాడు. అక్కడ అతన్ని కలిసి స్నేహితుడయ్యాడు. అక్కడే మందాకినిని చూసి నందినికి ఆమెకు గల పోలికలు గమనించి ఆశ్చర్యపడ్డాడు. ఆదిత్యుడు యీ లోపున తన స్నేహితుడైన పార్థిబేంద్ర పల్లవన్‌ను కూడా తమ్ముడి దగ్గరకు పంపాడు. వీళ్లందరూ శ్రీలంకకు సముద్రమార్గం ద్వారానే వెళ్లేవారు. రాజరాజు, వందిదేవుడు, పార్థిబేంద్ర కలిసి బయలుదేరుతూండగా రాజుగారు మిమ్మల్ని బందీలుగా తెమ్మన్నారు అంటూ పెరియవన్ సైన్యం వారిని ఓడ ఎక్కించింది. అక్కడ ఘర్షణ జరిగింది. రాజరాజు ఉన్న ఓడ తుపానులో చిక్కుకుంది. అతను మధ్యదారిలో నాగపట్నం వద్ద ఉన్న చూడామణి విహారం అనే బౌద్ధారామంలో తలదాచుకున్నాడు.

నందిని రాజవ్యవహారాలు చర్చించడానికి తనను కడంబూరు రాజభవనంలో కలవమని ఆదిత్యుడికి కబురు పెట్టింది. నందిని కుట్రదారు అని తెలిసినా ఆదిత్యుడు అక్కడకు చేరాడు. అంతకు ముందే వందిదేవుణ్ని నందిని రప్పించింది. అతను చాటుగా దాక్కుని వారి మాటలు విన్నాడు. ఇది కీలకమైన ఘట్టం అనుకోవచ్చు. అప్పుడే ఆదిత్యుడి హత్య జరిగింది. వందిదేవుడే చంపాడని నేరం ఆరోపించబడింది. నవల క్లయిమాక్స్‌లో ఎవరు చంపారు, ఏమిటి అనేది తెలుస్తుంది. ఆదిత్యుడి మరణంతో రాజరాజుని యువరాజుని చేద్దామని సుందరుడు అనుకోవడం, రాజరాజు వచ్చి నేను కాదు మధురాంతకుడే యువరాజు కావాలనడం, మహాదేవి మధురాంతకుడు నా కొడుకు కాదు, అముదనే అనడంతో అతన్ని యువరాజుని చేయడంతో నవల ముగుస్తుంది.

సినిమాకై నవలను సంక్షిప్తీకరించడంలో ఎన్ని పాత్రలు ఉంటాయో, ఎన్ని ఘట్టాలు ఉంచుతారో తెలియదు. పైగా చరిత్రలో లేనివాటిని నవలా రచయిత కల్పించినట్లు, నవలలో లేని కొన్నిటిని మణిరత్నం కల్పించవచ్చు. కథను రేఖామాత్రంగా చెప్పాను. మొత్తం చెప్పేస్తే యింట్రస్టు పోవచ్చు. ఇవన్నీ మనకు పూర్వపరిచయం లేని పేర్లు కాబట్టి యీ వ్యాసం కాస్త గందరగోళంగానే తోచవచ్చు. వ్యాసం కాబట్టి ముందుకి వెనక్కి చదువుకోవచ్చు. యూట్యూబులో అయితే రీవైండింగ్ తలకాయనొప్పి ఉంది. సినిమాలో 15 ముఖ్యమైన పాత్రలున్నాయి కాబట్టి మరో వ్యాసంలో ‘‘పొన్నియిన్..లో పాత్రలు-పాత్రధారులు’’ అనే పేరుతో వ్యాసం రాస్తే యింకా కాస్త అర్థమౌతుందని నా అభిప్రాయం. దీనికి వచ్చిన స్పందన బట్టి దాన్ని రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

[email protected]