విశాఖ ఉక్కు రికార్డు టర్నోవర్ .. అయినా అమ్మేస్తారు!

ఉక్కు ఉత్పత్తి, అమ్మకం, టర్నోవర్‌లలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 2021-22లో 28,214 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌ సాధించింది. 2020-21లో సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించిందని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే వెల్లడించారు. 

రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ2017-18లో 16,618 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేసిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) 2021-22లో 28,214 కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు.

పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం చేసిన ఈ ప్ర‌క‌ట‌న విశాఖ ఉక్కు స‌త్తాను చాటుతోంది. అయితే ఇప్ప‌టికే ఈ ప్లాంట్ ను అమ్మేయ‌డానికి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుని ఉంది. కార్మికులు, ఏపీ ప్ర‌జ‌లు, ఏపీ ప్ర‌భుత్వం కూడా ఈ అంశంపై వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నా.. కేంద్రం మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అమ్మ‌డం త‌మ విధానం అని దేన్నీ ఖాత‌రు చేసే ప‌రిస్థితుల్లో బీజేపీ ప్ర‌భుత్వం లేదు. 

ఇలాంటి నేప‌థ్యంలో ప్లాంటుకు ఉన్న వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ను ఒప్పుకుంటూనే.. కేంద్ర ప్ర‌భుత్వం దీన్ని తూకానికి అమ్మేయ‌డానికి మాత్రం వెనుకాడ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.