ఎమ్బీయస్‍: బుల్‌డోజర్ రాజకీయాలు

అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్య తీసుకుని కూల్చివేసి, ఆక్రమణదారులను హడలెత్తిస్తే హర్షించవలసినదే. ఎటొచ్చీ దాన్ని రాజకీయాలకు వాడుకుంటేనే సంశయాలు వస్తాయి. కెసియార్ ముఖ్యమంత్రి అవుతూనే హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో భవంతులను సగంసగం కూల్చారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ చెఱువు ఆక్రమించిందంటూ చర్యలకు ఉపక్రమించారు. అంతలోనే ఏమైందో! కూల్చివేతలు ఆగిపోయాయి. ఆ బిల్డింగులు యథాపూర్వ రూపానికి వచ్చేశాయి. అవి అక్రమైనవనే కదా కూల్చివేశారు. మరి హఠాత్తుగా ఆపివేశారేం? మళ్లీ కట్టుకోనిచ్చారేం? ఇప్పుడు అధికారం నాది, కావాలంటే ఏమైనా చేయగలను అనే సంకేతాన్ని ప్రజలకు పంపడానికే కెసియార్ అలా చేశారని అనుకోవాలి.

జగన్ అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చేశారు. శహభాష్ అన్నారు నాబోటి వాళ్లు. ప్రభుత్వం చేసినా తప్పు తప్పే. ముందుగా తన తప్పు సరిదిద్దుకుని యిక రాష్ట్రంలో తక్కిన అక్రమ కట్టడాలపై పడతాడు ముఖ్యమంత్రి అనుకున్నాను. అబ్బే! మరేదీ కూల్చినట్లు నాకు తెలియదు. ‘మొత్తం యిన్ని అక్రమ నిర్మాణాలుంటే, వాటిల్లో యిన్ని కూల్చాం, కోర్టు స్టేల కారణంగా తక్కినవాటి విషయంలో ముందడుగు వేయలేకపోయాం.’ అని ప్రభుత్వ ప్రకటన యిస్తే యీ సందేహాలు తీరతాయి. మధ్యలో గీతమ్ వాళ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకున్నారు. అమరరాజా వారి వాతావరణ కాలుష్యంపై చర్యలు తీసుకున్నారు. వారొక్కరే పాపాత్ములా? తక్కినవారందరూ పుణ్యాత్ములా? అనే సందేహం వస్తుంది కదా. రాజకీయంగా బెదిరించడానికి మాత్రమే చట్టాలు వాడుతున్నారనే భావం కలగదా?

ప్రస్తుతం యుపి ప్రభుత్వం బుల్‌డోజర్ ఉపయోగించే తీరుపై కూడా యిలాటి అనుమానాలే వస్తున్నాయి. సాధారణంగా అక్రమనిర్మాణాలు సమూహంగా ఉంటాయి. ప్రభుత్వభూమినో, ట్రస్టు భూమిలో ఆక్రమించేసి, కాలనీలు కట్టేసుకుంటారు. స్థానిక అధికారులకు లంచాలిచ్చేసి పదేసి, యిరవై ఏళ్లు అక్కడే కాపురం ఉంటారు. సడన్‌గా ప్రభుత్వం మేలుకుంటుంది. ఇవన్నీ ప్రభుత్వభూములు, ఖాళీ చేయాలి అంటున్నారు. మా చేత యిన్నాళ్లుగా యింటి పన్ను, నీటి పన్ను కట్టించుకుంటూ యిప్పుడు అక్రమమంటే ఎలా అంటూ వీళ్లు కోర్టుకి వెళతారు. కేసు కోర్టులో నానుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రజాప్రతినిథికో, ప్రభుత్వాధికారికో పూనకం వస్తుంది. కోర్టు సెలవులు ఉన్న రోజులో పొద్దున్నే బుల్‌డోజర్ వచ్చి అన్నీ కూల్చడం ప్రారంభిస్తుంది. మీడియా వాళ్లు వచ్చి హడావుడి చేస్తారు. కూల్చివేతలు సగంలో ఆగుతాయి. తర్వాతి వ్యవహారం కోర్టులో నడుస్తుంది.

ఈ కూల్చివేతలు యిలా అవుతూనే ఉంటాయి, యింకో పక్క చెరువులు ఆక్రమించేసి, అక్రమ నిర్మాణాలు సాగుతూనే ఉంటాయి. భారీ వర్షాలు వచ్చి కాలనీలు మునిగిపోయినప్పుడు మళ్లీ ఆక్రమణల గురించి చర్చ, ప్రకటనలు ప్రారంభమౌతాయి. ఎవరైనా వ్యక్తి రోడ్డునో, పక్కనున్న ఖాళీ స్థలాన్నో ఆక్రమించుకుని ఏదైనా కట్టేస్తే ప్రభుత్వం నోటీసులు పంపాలి. కానీ సాధారణంగా ఆ పని చేయరు. ఎప్పుడో బుద్ధి పుట్టినపుడు చేస్తుంది. అప్పటిదాకా ఎందుకు చేయలేదు అని అధికారులను ఎవరూ నిలదీయరు, దండించరు. అక్రమాన్ని సక్రమం చేశారని అందరూ సంతోషించి ఊరుకుంటారు.

అయితే యుపి ప్రభుత్వం యిప్పుడు యిలాటి అక్రమాలకు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు ముడిపెడుతోంది. అక్కడ వస్తోంది చిక్కు. నిరసనకారుల యిళ్లు మాత్రమే కూలగొడుతోన్నట్లు కనబడుతోంది. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు. ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలపై రాళ్లు రువ్వడం, దగ్ధం చేయడానికి ప్రయత్నించడం వగైరాలు నేరాలే. వాటికి తగిన శిక్షలున్నాయి. ఆ శిక్ష విధిస్తే అభ్యంతరం తెలపడానికి ఏమీ లేదు. కానీ యిళ్లు కూలగొట్టడమనే శిక్ష వేయడం ఏ విధంగా సబబు? ఒక హత్య కేసులో ముద్దాయి యిల్లు కూడా కూల్చేశారట. అంటే నేరనిరూపణ కాకుండానే శిక్ష వేసేయడం జరిగిపోయిందన్నమాట!

ఇంట్లో ఒక యువకుడు నిరసనలో పాలు పంచుకున్నాడనుకోండి, మామూలుగా అయితే అతనికి వారమో, నెలో శిక్ష పడవచ్చు, లేదా జరిమానా పడవచ్చు. కానీ అతని యిల్లు కూల్చివేస్తే, యింట్లో ముసలీముతకాతో సహా అందరూ రోడ్డున పడతారు కదా! వాళ్లు ఏ విధంగా శిక్షార్హులు? కోర్టు యీ ప్రశ్నలు అడుగుతూంటే యుపి ప్రభుత్వం తన అఫిడవిట్‌లలో అబ్బే, నిరసనలకు వీటికీ సంబంధం లేదు, యిది రొటీన్‌గా చేసే క్షాళన కార్యక్రమం అని చెప్తోంది. కానీ బయట సంఘీయులు, బిజెపి నాయకులు, ఆఖరికి పోలీసులు కూడా ‘మీకు బుద్ధి చెప్పడానికే యిది చేస్తున్నాం’ అని ఆందోళనకారులకు బాహాటంగా చెప్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ మీడియా అడ్వయిజర్ మృత్యుంజయ కుమార్ ‘‘ప్రతీ శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది జాగ్రత్త’’ అని ట్వీట్ చేశారు. అంటే మీరు శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్లర్లకు తెగబడితే, తర్వాతి రోజైన శనివారం నాడు కోర్టుకి వెళ్లలేని పరిస్థితుల్లో బుల్‌డోజర్ వచ్చి మీ యిళ్లు కొట్టేస్తుంది అని అర్థం. ఈ ట్వీట్‌కు బుల్‌డోజర్ బిల్డింగు పడగొడుతున్న ఫోటో జోడించాడు కూడా.

నూపుర్ శర్మ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా సంచలనం కలిగించాయని అందరికీ తెలుసు. బిజెపి పార్టీ సైతం దాన్ని హర్షించలేదు. ఆమెను అరెస్టు చేయించలేదు, పార్టీలోంచి పంపేయలేదు కానీ క్రమశిక్షణ చర్యగా అధికార ప్రతినిథి హోదా నుంచి తొలగించింది. అంటే ఆమె వ్యాఖ్య అనుచితమైనదని సాక్షాత్తూ బిజెపి అధినాయకత్వమే ఒప్పుకుంది కదా. అలాటప్పుడు ఆ వ్యాఖ్యల వలన మనోభావాలు గాయపడినవారికి నిరసన తెలిపే హక్కు ఉండదా? ఆ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారితే తగిన చర్యలు తీసుకోవలసినదే. నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగినపుడు ప్రయాగరాజ్ (ఇలాహాబాద్)లో రాళ్లు రువ్వే ఘటనలు జరిగాయి. వాటి వెనుక వెల్‌ఫేర్ పార్టీ నాయకుడు జావేద్ మొహమ్మద్ ఉన్నాడని జిల్లా డిఎస్‌పి అజయ్ కుమార్ అన్నాడు. జావేద్‌పై యుపి గాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసు మోపి జైల్లో పెట్టి, ఒకదాని తర్వాత మరో జైలుకి తిప్పారు. అక్కడి వరకు అర్థం చేసుకోవచ్చు.

దానితో బాటు జావేద్ భార్య ఫాతిమా యింటిని కూల్చేశారు. అది యిప్పుడు వివాదగ్రస్తమైంది. అక్రమ నిర్మాణాల పేర ఇళ్లు కూలగొట్టేటప్పుడు ముందుగా నోటీసు యిచ్చి, ఆ నోటీసు కాలపరిమితి పూర్తయిన తర్వాతనే యిల్లు కూలగట్టాలని ఇలహాబాద్ హైకోర్టు 2020 అక్టోబరులో ఆర్డరు యిచ్చింది. యోగి ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోవటం లేదని, 2022 జూన్‌ 12-15 నాటి వరుస కూల్చివేతల్లో యిది స్పష్టమైందని ఇలహాబాద్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గోవింద మాధుర్ ఆరోపిస్తున్నారు. యుపి ప్రభుత్వమే కాదు, ఎంపీ ప్రభుత్వం కూడా ముస్లిములకు వ్యతిరేకంగా కూల్చివేత కార్యక్రమాలు చేపట్టాయని జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు జూన్ 16న ‘‘కూల్చివేతలు చట్టబద్ధంగా మాత్రమే జరగాలి తప్ప, కక్షపూరితంగా జరగకూడదు. అంతా న్యాయబద్ధంగా జరిగినట్లు కనబడాలి.’’ అని వ్యాఖ్యానించింది.

ఇది జరిగిన నాలుగు రోజులకు జూన్ 20న యుపిలోని ఆలీగఢ్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో తమ మామూలు సరంజామాతో పాటు బుల్‌డోజర్‌ను కూడా ప్రదర్శనలో చేర్చారు. దాన్ని చూడగానే వ్యాపారస్తులందరూ తమ దుకాణాలు కట్టేసి పారిపోయారు. జనాలంతా భీతావహులై కకావికలై పోయారు. అగ్నిపథ్ స్కీముకి వ్యతిరేకంగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఆలీగఢ్ జిల్లాలోని జత్తారీ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అలాటి యువకులకు హెచ్చరిక జారీ చేయడానికి యీ బుల్‌డోజర్‌ను ప్రదర్శించారన్నమాట. కానీ బుల్‌డోజర్ పోలీసు ఆయుధం ఎప్పణ్నుంచి అయింది? ఫ్లాగ్ మార్చ్‌లో దాన్ని చేర్చినవారెవరు అని మీడియా అడగడంతో ఉన్నతాధికారులు ‘మాకేం సంబంధం లేదు. మేమేమీ లిఖితపూర్వక ఆదేశాలివ్వలేదు. ఎవరో అత్యుత్సాహవంతులైన కిందిస్థాయి పోలీసులు పట్టుకుని వచ్చి పెట్టేసుంటారు.’ అని తప్పించుకున్నారు. ‘అయితే వాళ్లపై చర్యలు తీసుకుంటారా?’ అని అడిగితే సమాధానం లేదు. కోర్టుకి చెప్పేదొకటి, చేతల్లో చేసేదొకటి!

ప్రయాగ్‌రాజ్, కాన్పూరు జిల్లాల్లో జరిగిన కూల్చివేతల విషయంలో జూన్ 22న యుపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో యుపి అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ చట్టానికి లోబడే కూల్చివేతలు జరిగాయి తప్ప అల్లర్లకు, వాటికి సంబంధం లేదని చెప్పింది. జావేద్ విషయంలో అది నివాసస్థలం కాగా, ఆఫీసు (రాజకీయపార్టీ ఆఫీసు)గా వాడుతున్నారని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అందుకని చర్యలు చేపట్టామని, ఆ పని అల్లర్ల కంటె ముందే ప్రారంభమైందని చెప్పుకుంది. ‘బిల్డింగు ప్రహారీగోడకి జావేద్ ఎమ్ అని నేమ్‌ప్లేట్ ఉంది. పైన ‘వెల్‌ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, జావేద్ మొహమ్మద్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ’ అని బోర్డు వేళ్లాడుతోంది.’ ఆ చుట్టూ ఉన్నవాళ్లు అక్కడ పార్టీ నడపడంపై అభ్యంతరాలు తెలుపుతూ మాకు ఫిర్యాదు చేశారు.’ అని చేర్చింది. ఫిర్యాదు చేస్తే పార్టీ ఆఫీసు తీసేయమని చెప్పాలి తప్ప ఏకంగా కూల్చేస్తారా? అని కోర్టు అడుగుతుందని కాబోలు నోటీసులిచ్చాం అని వివరణ యిచ్చింది.

మే 24న మాముందు హాజరు కమ్మనమని మే 10న నోటీసు యివ్వబోతే కుటుంబసభ్యులెవరూ తీసుకపోవడంతో గోడ మీద అతికించాం. మే 24న ఎవరూ రాలేదు. మీరు అనధికారికంగా నిర్మించిన దాన్ని 15 రోజుల్లో, అంటే జూన్ 9లోగా మీరే కూల్చేసుకోండి అని కబురు పంపాం. వాళ్లా పని చేయకపోవడంతో జూన్ 12న ప్రయాగరాజ్‌ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్లు కూల్చేశారు. దీనికీ, అల్లర్లకు సంబంధం లేదు.’ అని చెప్పుకుంది. నిజానికి ఆ యిల్లు జావేద్ పేర లేదు. అతని భార్య ఫాతిమా పేర ఉంది. ఆమె తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది ‘‘ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది. నోటీసులు పంపించినట్లు ప్రభుత్వం ఆధారాలు చూపలేకపోయింది. నోటీసుల కాపీలంటూ కోర్టులో చూపినవి కూడా జావేద్ పేర ఉన్నాయి తప్ప యింటి యజమానురాలైన ఫాతిమా పేర లేవు. ఇక అక్రమ నిర్మాణం అంటున్నారు, ఆమె కరంటు బిల్లులు, వాటర్ బిల్లులు కడుతూనే ఉంది. అధికారులు కట్టించుకుంటూనే ఉన్నారు. అక్రమమని ఎప్పుడు చెప్పారు?’’ అన్నాడు.

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందో చూడాలి. కేసు యింకా నడుస్తోంది. జులై 13న జమాతే తరఫున వాదిస్తున్న సీనియర్ ఎడ్వకేట్ దుష్యంత్ దవే సుప్రీం కోర్టులో వాదిస్తూ బుల్‌డోజర్ సంస్కృతికి స్వస్తి పలకాలని అన్నారు. సుప్రీం కోర్టు జజ్ మెహతా కూల్చివేతల మీద బ్లాంకెట్ బ్యాన్ విధించలేం కదా అన్నారు. ‘‘మరి దిల్లీలో ఏ అనుమతులూ లేకుండా కట్టిన అనేక పోష్ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి కదా, వాటిని కూల్చివేయరేం? దక్షిణ దిల్లీలో ఉన్న సైనిక్ ఫామ్స్‌లో అనేక అక్రమనిర్మాణాలున్నాయి. వాటి జోలికి పోరేం?’’ అని అడిగారు దవే. తర్వాతి వాయిదా ఆగస్టు 10న. దవే ప్రశ్నలు వింటే కెసియార్ నవ్వుకుంటారు. ఈటల పీచమణచాలనుకున్నపుడు ఆయన భూముల మీదకు ఒక్కరోజులో అనేకమంది అధికారులను తోలారు. మల్లారెడ్డిపై కూడా అవే ఆరోపణలు కదాని రేవంత్ రెడ్డి అడిగితే దానికి సమాధానం లేదు. ప్రభుత్వాధినేతలు తాము ఏం చేద్దామనుకుంటే అది చేస్తారు. అదేమంటే రూల్సు వర్తిస్తారు. ఈ బుల్‌డోజర్ బాబా యింకేమి విన్యాసాలు చేయబోతారో, ఎంతమంది ముఖ్యమంత్రులు ఆదర్శప్రాయంగా నిలుస్తారో చూడాలి. (ఫోటో – ఆలీగఢ్ పోలీసు మార్చిలో బుల్‌డోజర్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

[email protected]