మైత్రీ సమర్పించు దానయ్య నిర్మాణం?

పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల జాబితా కాస్త పెద్దదే వుంది. కొత్తవి ప్రారంభిస్తారో, ప్రారంభించినవి పూర్తి చేస్తారో ఎవ్వరికీ తెలియదు. హరీష్ శంకర్ డైరక్షన్ లోని హరిహర వీరమల్లు సంగతి అసలే తెలియదు. 

ఈ మధ్యనే ఆయన కథ చెప్పారని కూడా వార్తలు వినవచ్చాయి. ఈ లోగా మరొ కొత్త గ్యాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూంది. నిర్మాత డివివి దానయ్య-మైత్రీ మూవీస్ రెండూ కలిసి పవన్ సినిమా నిర్మించే అవకాశం వుందన్నది ఆ గ్యాసిప్ సారాంశం.

దీని వెనుక వివరణ చాలానే వుంది. మైత్రీ మూవీస్ కు పవన్ ఏనాటి నుంచో ఓ సినిమా చేయాలి. అది అలా పెండింగ్ లో వుంది. ఈ మధ్య కొత్తగా దానయ్య కూడా ఓ సినిమా చేయాలని రెడీ అయ్యారు. మైత్రీ మూవీస్ కు హరీష్ శంకర్ దర్శకుడు..దాని టైటిల్ భవదీయుడు భగత్ సింగ్. దానయ్య సినిమాకు సుజిత్ దర్శకుడు. అది రీమేక్.

ఈ రీమేక్ వ్యవహారం ఏమిటంటే తెరి అనే సినిమాను తెలుగులో పవన్ తో తీయాలని మైత్రీ సంస్థ కొంత వర్క్ చేసింది. సంతోష్ శ్రీనివాస్ చేత మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో సంతోష్ కు రెమ్యూనిరేషన్ కొంత ఇచ్చి, అది అలా పక్కన పెట్టారు.

ఇప్పుడు దానయ్యతో ఆ తెరి రీమేక్ ను సుజిత్ డైరక్షన్ లో పవన్ చేయాలనుకున్నారు. కానీ దాని హక్కులు మైత్రీ దగ్గర వున్నాయి. అందువల్ల అన్ని విధాలా బాగుంటుందని, మైత్రీని దానయ్యను కలిపి తెరి రీమేక్ చేసేయాలన్నది పవన్ ప్లాన్ అని తెలుస్తోంది. అలా అయితే రెండు బ్యానర్ల ఆబ్లిగేషన్ ను ఒక్క సినిమా తేల్చేస్తుంది. అసలే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. కమిట్ మెంట్లు త్వరగా ఫినిష్ చేసేస్తే బెటర్ కదా.

మరి ఇంతకీ హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ ను పవన్ ఏం చేస్తారు? అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.