గడ్డి తింటున్న నారాయణ

నిన్నటికి నిన్న సిపిఐ నాయకుడు నారాయణ మెగాస్టార్ చిరంజీవి మీద నోరు పారేసుకున్నారు. చిల్లర బేరగాళ్లు అంటూ ఎద్దేవా చేసారు. రాజకీయ పవర్ బ్రోకర్లు అనే అర్థం వచ్చేలా దారుణంగా విమర్శించారు. దీనికి సరైన స్పందన అటు నుంచి వచ్చింది. మెగాస్టార్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ లో ఘాటైన సమాధానం ఇచ్చారు. నేరుగా నారాయణ ను ఏమీ అనకుండా, జనసైనికులు, మెగాభిమానులకు ఓ విన్నపం చేసారు.

నారాయణ చిరకాలంగా అన్నం తినడం మానేసారని, ఎండు గడ్డి మాత్రమే తింటున్నారని, అందువల్ల ఆయనకు కొంచెం అన్నం పెట్టాలని మెగాభిమానులకు, జన సైనికులకు నాగబాబు విన్నవించారు. అంటే నారాయణ గడ్డి తినే మనిషి అని నాగబాబు కాస్త ఘాటుగానే విమర్శిచారన్నమాట. నాగబాబుకు ఆవేశం వస్తే ఇలాగే వుంటుంది. అవతలి వాళ్లు ఎవరైనా సరే సమాధానం, కాస్త గట్టిగానే వుంటుంది.

అది పార్లమెంటరీనా..అన్ పార్లమెంటరీనా అన్నది ఆయనకు పట్టదు. మాటకు మాట దిగిపోవాల్సిందే. నిజానికి ఇక్కడ నారాయణదే తప్పు. అల్లూరి విగ్రహావిష్కరణకు హీరో కృష్ణ ను పిలిచారో లేదో తెలియదు. పిలవకపోతే తప్పు అని అంటే అనొచ్చు. కానీ చిరంజీవి పిలిస్తే అది తప్పు ఎలా అవుతుంది? ఆ మాత్రానికే చిరంజీవి చిల్లర బేరగాడు అయిపోయాడా?

నిజానికి నాగబాబు కన్నా పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే వామపక్షాలు అంటే తనకు చాలా గౌరవం అని ఆయన అంటూ వుంటారు. అలాంటి వామపక్షనేత ఇలా మాట్లాడాడు అంటే పవన్ స్పందించాలి కదా?