మద్యం సిండికేట్లకు మళ్లీ ప్రాణం పోస్తారా?

ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలే నిజమైతే సిఎమ్ జగన్ తన మద్యం పాలసీ పై మడమ తిప్ప బోతున్నారు. ప్రభుత్వ దుకాణాల స్థానంలో మళ్లీ ప్రైవేటు దుకాణాలు కళకళలాబోతున్నాయి. ఇలా చేయడం వల్ల జగన్ విమర్శల పాలు అవుతారా? కారా? అన్నది పక్కన పెట్టి కూడా చూడాల్సి వుంటుంది. 

ప్రైవేటు మద్యం దుకాణాల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అధికారులు సిఎమ్ కు నచ్చ చెబుతున్నారని, ఆ ఆదాయం కోసమే జగన్ తన మనసు, పాలసీ మార్చబోతున్నారన్నది మీడియా వార్తల సారాంశం.

నిజానికి జగన్ ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి, ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు. మద్యం సిండికేట్లను అరికట్టడమే అసలు ఉద్దేశం. ఆంధ్ర మొత్తం మీద రెండు నుంచి మూడు సిండికేట్లు మాత్రమే ఆ వ్యాపారాన్ని శాసిస్తూ వస్తున్నాయి. ఇది దశాబ్దాల కాలంగా సాగుతున్న వ్యవహారం. 

ఎవరు దుకాణం పాడుకున్నా ఏదో ఒక సిండికేట్ లో భాగం కావాల్సిందే తప్ప స్వంతగా దుకాణం నడిపేంత సీన్ వుండదు. అంత సీన్ వుండనివ్వరు అన్నది ఆ వ్యాపారం ఆనుపానులు తెలిసిన వారికి అర్థమయ్యే విషయం. లాటరీలోనో, వేలం పాటలోనో ఓ లైసెన్స్ ఎవరైనా దక్కించుకున్నా, నయానో, భయానో, సకల ఉపాయాలు ప్రయోగించి వారి దుకాణాన్ని లాక్కోవడం అన్నది కామన్ .

లిక్కర్ సిండికేట్లు లోకల్ రాజకీయాలను ప్రభావితం చేయడం అన్నది దశాబ్దాల కాలంగా జరుగుతూనే వస్తోంది. ఈ సిండికేట్లలో కూడా సామాజిక వైరాలు, వర్గాలు వున్నాయి. సిండికేట్ల నుంచి ప్రజా ప్రతినిధులు పుట్టుకువచ్చిన ఘటనలు కూడా వున్నాయి. 

మీడియా దగ్గర నుంచి డిపార్ట్ మెంట్ల వరకు అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఇలా ఇటు వ్యాపారాన్ని, అటు రాజకీయాలను, ఇంకా చెప్పాలంటే లిక్కర్ పాలసీలను ప్రభావితం చేసేంత బలమైనవి ఈ సిండికేట్లు.

అలాంటి సిండికేట్లను బలమైన దెబ్బ కొట్టారు జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో. దాదాపు మూడేళ్లుగా సిండికేట్లు మూల పడ్డాయి. వాటి ఆదాయం పోయింది. వ్యవహారాలు ఆగిపోయాయి. ఇలాంటి సిండికేట్లకు మళ్లీ ప్రాణం పోయడం అంటే రాజకీయంగా రిస్క్ తీసుకోవడమే. ఎందుకంటే ఇంకా రెండేళ్ల వ్యవధి వుంది ఎన్నికలకు. 

రెండేళ్లలో సిండికేట్లు బలం పుంజుకుంటే, రాజకీయ కార్యక్రమాలకు నిధులు అందినట్లే. సిండికేట్లు జగన్ కు లేదా వైకాపాకు అనుకూలంగా వుంటాయి అనుకుంటే భ్రమే. ఎందుకంటే ప్రధాన సిండకేట్లు నడిపే రెండు సామాజిక వర్గాలు జగన్ కు వైకాపాకు వ్యతిరేకమే.

చూస్తుంటే అధికారుల మీదుగా జగన్ మనసు మార్చేందుకు ఎవరో పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ సదా ఆదాయం పెంచడానికి చూస్తున్నారు. లేదా ఆదాయం కోసం చూస్తున్నారు. ఈ వీక్ నెస్ ను వాడుకుని, వెయ్యి కోట్ల అదనపు ఆదాయ వస్తుంది ఏడాదికి అని చెప్పి, ఆ దిశగా ఆయన ఆలోచనలను మళ్లించి, సిండికేట్లకు ప్రాణం పోయాలని చూస్తున్నట్లుంది.

ఇలా చేస్తే జగన్ మడమ తిప్పారన్న అపప్రధ, అదే సమయంలో తన ప్రతిపక్షాలకు కొరి మరీ ఆర్థిక దన్ను తెచ్చుకున్నట్లే అవుతుంది.