ఎమ్బీయస్‍ కథ: స్వీకారం

టీపాయ్‍ మీద ఉన్న సెల్‍ఫోన్‍ మోగింది. సెక్రటరీ చేతిలోకి తీసుకున్నాడు. ‘‘తీయకు, పొద్దుణ్నుంచి ఒకటే గోల.’’ అన్నాడు కుమార్‍. ‘‘మీ అమ్మాయి గారండి, అమెరికా నుంచి..’’ ఇక తప్పలేదు. ‘‘ఏమిటి నాన్నా యీ న్యూస్‍? ఈ వెబ్‍సైట్లను నమ్మాలని లేదు. నిన్న రాత్రి నుంచి తెగ వైరల్‍ అయిపోతోంది. అందరూ అడుగుతూంటే భయం వేస్తోంది.’’ అంటోంది ఇందూ. ‘‘ఏదీ ‘ఒకప్పటి అగ్రహీరో కుమార్‍కి కాన్సరా?’ అనే న్యూసేగా? ఎవడు లీక్‍ చేశాడో తెలియదమ్మా, ఉదయం నుంచి వరస ఫోన్లు, ఒకటే వాకబులు., అదీ నర్మగర్భంగా, ‘ఈ మధ్య ఒంట్లో ఎలా ఉంటోంది?’ అంటూ. విసుగెత్తిపోతోందనుకో...’’

‘‘..లీక్‍ అయిందంటున్నావ్‍. ఇది నిజమేనా?’’ అడిగింది ఇందూ తెల్లబోతూ.

‘‘కంగారు పడకు. 80 ఏళ్లు వచ్చాయి. ముసలితనమన్నాక ఏదో ఒకటి రాకతప్పదు. తీసుకువెళ్లడానికి దేవుడికి ఏదో ఒక కారణం కావాలి కదా..’’

‘‘అది సరే, యిప్పటికైనా మా దగ్గరకి వచ్చేయ్‍. రెండేళ్ల క్రితం అమ్మ పోగానే వచ్చేయమంటే ‘సినిమాల్లో వేయడం మానేశాను కానీ తీయడం మానలేదు కదా’ అని సాకు చెప్పావ్‍. ఇప్పటికైనా యిక్కడకు వచ్చి చూపించుకో. ఎక్సలెంట్‍ డాక్టర్లున్నారు. బాబాయితో మాట్లాడతాను, ఏర్పాట్లు చేయమని..’’

‘‘...ఇక్కడా మంచి డాక్టర్లున్నారులే. ఏం చేసినా నాలుగు నెలలే! మందులూ, కెమో అవీ తీసుకుని శరీరాన్ని రొష్టు పెట్టుకోవడం కంటె మనసుకి నచ్చిన పాటలు వింటూ, పుస్తకాలు చదువుకుంటూ ఉంటే మంచిదన్నాడు డాక్టరు. ఏదైనా ఎమర్జన్సీ వస్తే సత్యం బాబాయి నాలుగిళ్ల అవతలే ఉన్నాడు కదా. మనుష్యులను పెట్టి చేయిస్తాడు.’’ కూతురు విసుక్కుంది. ‘‘చెప్తే వినే రకం కాదు, అమ్మ బతికున్నంతకాలం అదే మొత్తుకునేది.’’ అని. ‘‘అది కాదమ్మా’’ అని కుమార్‍ అంటూండగానే ఫోన్‍ పెట్టేసింది.

మూడో రోజుకి హైదరాబాద్‍ వచ్చేసింది కూడా. ‘బాబాయితో మాట్లాడాను. ఇక్కడి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తెస్తానని మాట యిచ్చాడు. ఇంకేం మాట్లాడకుండా నాతో పద. నాకు ఇండియన్‍ డాక్టర్ల మీద నమ్మకం లేదు. మీ అల్లుడికి స్వయంగా తెలిసిన ఎక్స్‌పర్ట్‌లున్నారు.’ అని పట్టుబట్టింది. ‘‘చూడు ఇందూ, డాక్టరు వినయ్‍ జనరల్‍ ఫిజీషియన్‍. నా శరీరతత్త్వం తెలిసినవాడు. నేను విరాళమిచ్చిన మెడికల్‍ కాలేజీలోనే చదువుకున్నాడు. నేనంటే చాలా ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ. పెద్ద  హాస్పటల్‍ నడుపుతున్నాడు. నా మెడికల్‍ రికార్డంతా అతని దగ్గరే ఉంది. పెద్దపెద్ద డాక్టర్లు చెప్పినదాని కన్నా అతని మాట మీదే నాకు గురి...’’

‘‘..తెలుసులే, నీకు 30 ఏళ్ల క్రితం అమెరికా డాక్టర్లు హార్ట్ ఆపరేషన్‍ చేసినప్పుడు వాళ్లు పదేళ్లకు మించి బతకవన్నారు. పాతికేళ్ల వరకు ఢోకా లేదన్నాడితను. అదే నిజమైంది. ఈ విషయం లక్షసార్లు చెప్పావ్‍. మీడియాలో కూడా గొప్పగా చెప్పుకున్నావ్‍.’’ అంది ఇందూ విసుగ్గా.

‘‘... అమ్మకు జబ్బు చేసినప్పుడు కూడా హాస్పటల్‍లో వద్దు, యింటికి తీసుకువెళ్లండి అన్నాడు. నెల్లాళ్ల ఐసియు బిల్లు కోసం కక్కుర్తి పడలేదు. ఏం చెప్పినా నా మేలు కోరి చెప్తాడు. నీ బలవంతం మీద అక్కడకు వచ్చినా వైద్యం మాత్రం చేయించుకోను. సుఖంగా మీ అందరి మధ్యా కాలక్షేపం చేసి ప్రశాంతంగా పోతాను.’ అన్నాడు.

‘‘మేమే కాదు, నీ ఫ్యాన్స్ లక్షలాది మంది ఉన్నారక్కడ. వాళ్లల్లో కాన్సర్‍ స్పెషలిస్టులూ ఉన్నారు. వాళ్లు చెబితేనైనా వింటావేమో..’’ అంది ఇందూ. ‘‘అలాటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు కానీ రేపు ప్రెస్‍మీట్‍ పెడతాను, ఎల్లుండి వెళదాంలే’’ ‘‘ప్రెస్‍మీట్‍ ఎందుకు? అవతల మీ అల్లుడిగారికి మాట యిచ్చి వచ్చాను, ఒక్క రోజులో వస్తానని..’’

‘‘ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్ చెప్పాలి. మళ్లీ వస్తానో, రానో తెలియదుకదా’’ అన్నాడు ఎమోషనల్‍గా. ఆమె అయిష్టంగానే ఒప్పుకుంది.

కుమార్‍ తెలుగుతెరను ఒక ఊపు ఊపాడు. అందగాడు. రొమాంటిక్‍ పాత్రలకు పెట్టింది పేరు. మధ్యవయసులో కెరియర్‍ ముగిసిపోయిం దనుకున్నపుడు కొత్త టీము సహాయంతో యిమేజి మార్చుకున్నాడు. యువహీరోలతో పోటీ పడ్డాడు. మరో పాతికేళ్ల పాటు డిమాండ్‍ కొనసాగింది. 70 ఏళ్లు వచ్చాక మందగించింది. అప్పుడప్పుడు నచ్చిన వేషాలు వస్తే వేస్తూ, సాయంత్రాలు సభల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్నాడు. 40 ఏళ్ల వయసులో ప్రారంభించిన సినిమా కంపెనీ ఉంది. నిర్మాతగా దాని ద్వారా సినిమాలు తీస్తూ చురుగ్గా ఉన్నాడు. ఇటీవల భార్య పోయినా, కూతురు అమెరికా రమ్మన్నా వెళ్లలేదు.

ఇవన్నీ ప్రెస్‍మీట్‍లో ప్రస్తావించి కుమార్‍ చెప్పుకొచ్చాడు - ‘‘ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రికి వెళ్లి డాక్టరుకి చూపించుకున్నాను. పరీక్షలు చేసి కాన్సరని, యిక నాలుగు నెలలేనని చెప్పాడు. మందులు తీసుకుంటే అవస్థేట. ‘పనులన్నీ మానేసి, శుబ్భరంగా కృష్ణారామా అనుకుంటూ, యిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ, సంగీతం వింటూ బతికేయండి. ఎవరికీ ఏమీ చెప్పకండి.’ అన్నాడు. అతని మాట విని, మా అమ్మాయికి కూడా చెప్పకుండా యింట్లోనే కాలక్షేపం చేస్తున్నాను. బయటకు రావడం మానేశాను. పనివాళ్లతో చెప్పి విజిటర్స్ ఎవర్నీ చూడకుండా కాలక్షేపం చేశాను. అందరికీ ఆశ్చర్యం, అనుమానం కూడా! ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నానో  చాలాసార్లు లెక్చర్లు యిస్తూంటాను కదా, వీడికి జబ్బు వస్తే ఏం చేస్తాడో చూద్దామన్న కుతూహలం కూడా ఉందనుకుంటా.

‘పెద్దాయన కదా, ఒంట్లో బాగా లేదేమోలే, కొన్నాళ్లకు అదే తగ్గుతుందిలే’ అనుకున్న వాళ్లు ఊరుకున్నారు. కానీ మీలో ఎవడికో కూపీ లాగాలనే బుద్ధి పుట్టింది. ఆ తర్వాత తనకు తెలిసున్నది పదిమందికీ చెప్పాలనుకున్నాడు. దాని ఫలితమే యీ వార్త! ఇక చూడండి, ఒకటే ఫోన్లు. వచ్చినవాళ్లు డైరక్టుగా అడగరు. డొంక తిరుగుడుగా ‘ఈ మధ్య అస్వస్థతగా ఏమైనా ఉంటోందా? అన్నం అరుగుతోందా? ఎవరైనా మంచి డాక్టరుకి చెప్పమంటావా?’ అంటారు. ఫోన్లు తీయడం మానేశాను. దాంతో సడన్‍గా యింటికి వచ్చేయడాలు, పిచ్చాపాటీ కబుర్లతో మొదలుపెట్టి, నెమ్మదిగా రోగం మీదకు మళ్లించడాలు... విసుగెత్తి పోయింది.’’ అని కాస్త ఆగాడు.

తనకు కాన్సర్‍ అని ఆయనంతట ఆయనే చెప్పడంతో పాత్రికేయులందరూ విస్తుపోయారు. మీట్‍ పెట్టినపుడు యీ వార్తను ఖండిస్తాడు కాబోలు అనుకున్నారు కానీ యిలా జరగడంతో తికమక పడ్డారు. వాతావరణం గంభీరంగా మారింది. అప్రయత్నంగానే ప్చ్, ప్చ్ అంటూ శబ్దాలు చేశారు. చూపులతోనే జాలి కురిపించారు. అంతలోనే కుమార్‍ గొంతు ఖంగుమంది. ‘‘ఇదిగో, యిదే, ఈ సానుభూతే భరించలేను. హీరోగా బతికాను, హీరోగానే ఛస్తాను. జాలి అక్కరలేదు. ఏదైనా సరే, స్వీకరించడంలోనే సాహసం ఉంది. సాహసమంటే భౌతికంగా బలంగా ఉండడం, డూప్‍లు లేకుండా నటించడం ఒక్కటే కాదు, మానసికంగా సిద్ధపడడమే అంతకంటె పెద్ద సాహసం. ఇన్నాళ్లూ తెర మీద సాహసాలు చేశాను. తెర వెనుక కూడా రిస్కున్న సినిమాలు తీసి సాహసం చేశాను. కానీ యిది జీవితం విసిరిన సవాలు. దీన్ని ఎదుర్కోవడమే అసలైన సాహసం. ఇంత ఫలవంతమైన జీవితాన్ని దేవుడివ్వగా స్వీకరించాను. మృత్యువునీ స్వీకరిస్తాను. మా అమ్మాయి అమెరికా రమ్మంటోంది. వెళుతున్నా కానీ వెళ్లేది వైద్యానికి కాదు, పిల్లలు, మనుమల మధ్య జీవించడానికి.’ అని ముగించాడు.

సభలో చప్పట్ల మారుమ్రోగాయి. ‘ఇది సార్‍ అసలైన హీరోయిజం’ అన్నాడు ఓ సీనియర్‍ జర్నలిస్టు, గద్గగస్వరంతో. అందరూ దాన్ని ఆమోదిస్తూ కేకలు వేశారు. వాళ్ల అభిమానానికి కుమార్‍ కళ్లు చెమర్చాయి. రుమాలు తీసి ఒత్తుకుంటూండగా ‘అయితే ఈ దెబ్బతో  శివానంద్‍ గారితో పంతం మధ్యలో వదిలేసినట్లే నన్నమాట’ అన్నాడొక జర్నలిస్టు. ఆ మాట చెవిన పడినా, సమాధానం చెప్పకుండా ‘‘అందరూ లంచ్‍కు లెండి’’ అని అన్నాడు కుమార్‍.

భోజనాలు సాగుతున్నాయి, అందరూ ప్రశంసిస్తున్నారు, అయినా కుమార్‍ మనసు శివానంద్‍ చుట్టూనే తిరిగింది. మధ్యవయసులో ఏర్పరచుకున్న కొత్త టీములో అతి ముఖ్యుడతను. మంచి యువరచయిత. కథ, మాటలు రాయడమే కాదు, హీరోని ప్రేక్షకులకు చేరువ చేయడం ఎలాగో బాగా తెలిసున్నవాడు.  ఇతర భాషా చిత్రాలను చూసి, వాటిని తెలుగులోకి ఎలా అన్వయించుకోవచ్చో యిట్టే చెప్పేవాడు. కుమార్‍ అతన్ని బాగా ప్రోత్సహించాడు. హీరోగానే కాదు, నిర్మాతగా కూడా కుమార్‍ను నిలబెట్టాడు శివానంద్‍. వరుసగా సినిమాలు ఫ్లాప్‍ అవుతూంటే ఒక బ్లాక్‍బస్టర్‍ రాసివ్వడంతో ఆ సంస్థ బతికింది. పాతికేళ్ల పాటు వారి అనుబంధం కొనసాగింది. కుమార్‍ రిటైరయ్యాక కూడా శివానంద్‍ యితరులకు రాస్తూ ఫీల్డులో చురుగ్గా ఉన్నాడు. పోనుపోను తనకు వచ్చే పాత్రలు బొత్తిగా అతిథి పాత్రల్లా ఉండడంతో కుమార్‍కు విసుగెత్తి శివానంద్‍ని పిలిపించి ‘నాకు నప్పే ఓ కథ రాయవయ్యా, అదే నా ఆఖరి సినిమా కావాలి.’ అన్నాడు.

ఇద్దరూ కలిసి కొరియన్‍, ఇరానియన్‍ సినిమాలన్నీ తిరగవేయగా ఓ కథ నచ్చింది. డ్రగ్‍ మాఫియా చేతిలో చిక్కి కిడ్నాప్‍ అయిన కూతుర్ని వెతికే 70 ఏళ్ల ముసలివాడు చివరకు దోషులను కనిపెట్టి పగ తీర్చుకునే కథ అది. దాన్ని మన వాతావరణానికి అనువుగా మలచుకోవడానికి, చిత్రిక పట్టడానికి ఏడాదిన్నర పట్టింది. అన్నాళ్లూ కుమార్‍ శివానంద్‍కి నెలనెలా జీతం యిస్తూ వచ్చాడు. కథ పూర్తయ్యేసరికి శివానంద్‍కి ఆశ పుట్టింది. 70 ఏళ్ల వృద్ధపాత్రను 50 ఏళ్ల మధ్యవయస్కుడిగా మార్చేసి, తనే హీరోగా, సొంత డైరక్షన్‍లో సినిమా తీసుకుంటే బాగుంటుం దనిపించింది.

ఆ మాట చెప్పగానే కుమార్‍కి కోపం వచ్చింది. ‘ఇది నా ఆఖరి సినిమా అని చెప్పి యింత కష్టపడితే, యిప్పుడు నీకీ ఆలోచన రావడమేమిటయ్యా? నువ్వు రైటరువి. ఇలాటి కథలు వంద రాయగలవు. దీన్ని నాకు వదిలేయ్‍.’’ అన్నాడు.

‘‘ఈ వయసులో ఫుల్‍ లెంగ్త్ పాత్ర మీరు వేయలేరండి. వేసినా జనం చూడరు. నాకైతే మంచి డెబ్యూ అవుతుంది.’’

‘‘కోట్లాది ప్రేక్షకులకు ఆరాధ్యదైవంగా వెలిగాను. ఆఖరి సినిమా అని ముందే ప్రకటిస్తే తప్పకుండా థియేటర్లకు వచ్చి చూస్తారు.’’ అన్నాడు కుమార్‍ ఆత్మవిశ్వాసంతో.

‘‘మీరు తోలుబొమ్మలేనండి, ఆడించేది మా రచయితలమే.’’ అన్నాడు శివానంద్‍ అంతకంటె ధీమాగా.

‘‘మరి అన్ని బొమ్మలనీ ఆడించలేరేం? బొమ్మలో కూడా సత్తా ఉండాలి. అది తెలుసుకుని మాట్లాడు.’’ అని కుమార్‍ గద్దించాడు.

మాటామాటా పెరిగింది. కథ రెడీగానే ఉన్నా సెట్స్ మీదకు వెళ్లలేదు. అది నాదే అన్నాడు శివానంద్‍. డబ్బిచ్చి రాయించుకున్నాను కాబట్టి నాదే అన్నాడు కుమార్‍. ఆ డబ్బిచ్చినది వేరే దానికి, దీనికి కాదు అంటాడు శివానంద్‍. ఇద్దరూ కౌన్సిల్‍లో వాదోపవాదాలు వినిపించుకున్నారు. కౌన్సిల్‍ పెద్దలు రాజీ కుదురుద్దామని చూస్తున్నారు కానీ ఎవరూ తగ్గలేదు. ఏడాదిగా వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడీ వ్యాధి రావడంతో ఓటమి అంగీకరించి యుద్ధరంగం నుంచి తప్పుకున్నట్లేనా అనే అర్థంలో ఆ విలేకరి అడిగాడు. అది కుమార్‍ మనసును తొలిచివేస్తోంది.

లంచ్‍ పూర్తయ్యాక పాత్రికేయులందరూ వెళ్లి వస్తామని చెప్పడానికి దగ్గరకు రాగానే కుమార్‍ ‘‘ఒక చిన్న సంగతి’’ అని, కొంత గ్యాప్‍ యిచ్చాడు. సద్దు మణగగానే ‘‘సినిమాలో కథానాయకుడు అర్ధాంతరంగా నిష్క్రమించ కూడదు. ఇన్ని సినిమాల్లో హీరోగా నటించినవాణ్ని ఆ సంగతి మర్చిపోతే ఎలా? నా చేతిలో ఉన్న సినిమా - నా ఆఖరి సినిమా - దాన్ని పూర్తి చేసి అమెరికా వెళతాను.’’ అని ప్రకటించాడు. విలేకరులు ఉత్సుకతతో ప్రశ్నలడగబోతూ ఉంటే చేతులెత్తి నమస్కారం పెట్టి, గబగబా బయటకు నడిచాడు.

ఇంటికి రాగానే కూతురు విరుచుకుపడింది. కానీ కుమార్‍ వినలేదు. ‘‘అక్కడకు వచ్చి నిరంతరం యీ ఓటమిని గుర్తు చేసుకుంటూ కూర్చోలేను. సినిమాయే నా జీవితం, అదే నా చావు కావాలి. నేనడిగితే ఎవడూ డేట్స్ లేవనడు. మూణ్నెళ్లల్లో పూర్తి చేసి వస్తా. నీకంతగా బెంగగా ఉంటే నువ్వూ వచ్చి యిక్కడే ఉండు.’’ అని కరాఖండీగా చెప్పాడు.

‘‘ఇన్నేళ్లొచ్చినా నువ్వు మా మాట వినవు కానీ, మేం మాట వినాలా?’’ అని పెద్ద పోట్లాట వేసుకుని కూతురు మర్నాడే వెళ్లిపోయింది.

కౌన్సిల్‍ ఆర్బిట్రేషన్‍ కోసం ఆగకుండా వెంటనే ఆ కథతో సినిమా ప్రారంభించేశాడు కుమార్‍. శివానంద్‍ వెళ్లి ఫిర్యాదు చేశాడు. ‘‘ఈ పరిస్థితుల్లో పెద్దాయన్ని పిలిచి ఏం పంచాయితీ పెడతామయ్యా’’ అని కౌన్సిల్‍ పెద్దలు విసుక్కున్నారు. అతనికి కోపం వచ్చింది. ‘ఇంచుమించు అదే కథతో నేనూ నా సినిమా తీస్తాను. ఎవడాపుతాడో చూస్తాను.’’ అని ప్రతిజ్ఞ చేశాడు.

కుమార్‍ చకచకా పనులు చేశాడు. సాంకేతిక నిపుణులను పిలిచి, బాధ్యతలు అప్పగించేశాడు. ఆయనకు తామిచ్చే గౌరవంగా భావించి, అందరూ తమ చేతిలో పని పక్కన పెట్టి యీ సినిమాకు పని చేశారు. అగ్రతారలందరూ కామియోలుగా వేశారు. సినిమా తీసే బిజీలో కుమార్‍ శారీరక బాధ మర్చిపోయాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేస్తే, కాన్సర్‍ గుర్తుకు వచ్చేది. చేయగలిగేదీ ఏమీ లేదని డాక్టరు చెప్పాడుగా అని తనను తానే సమాధాన పరుచుకునేవాడు. అంతలోనే మర్నాడు చేయవలసిన షూటింగు జ్ఞాపకం వచ్చేది. దాని గురించి ఆలోచిస్తూండగానే నిద్ర పట్టేది. సినిమాకి బుక్‍ చేసినప్పుడే నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ చెప్పాడు - ఎట్టి పరిస్థితుల్లోనూ తన జబ్బు గురించి తనతో చర్చించవద్దని. అందరూ ఆ మాట గౌరవించారు.

అవతల శివానంద్‍ సినిమాకు పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ‘చావు ముంగిట ఉన్న పెద్దాయనతో పోటీ ఏమిటయ్యా, ఇంకో కథ తీసుకోవచ్చుగా’ అంటూ యీసడించారు. అతనికి పంతం పెరిగింది. కొత్త ఆర్టిస్టులను, కొత్త టెక్నీషియన్లను పెట్టి సినిమా తీయడానికి పూనుకున్నాడు. నిర్మాత లెవరూ కలిసి రాలేదు. తనే సొంతంగా తీస్తానన్నాడు. మూణ్నెళ్లకు అతని సినిమా మొదటి షెడ్యూల్‍ పూర్తయింది. ఆ పాటికి కుమార్‍ సినిమా రిలీజు కూడా అయి సూపర్‍హిట్‍ టాక్‍ వచ్చింది.

అలిగి, యిన్నాళ్లూ మాట్లాడని కూతురు అమెరికా నుంచి ఫోన్‍ చేసింది. ‘నాన్నా, యూ ఆర్‍ రియల్‍ హీరో’ అని కాస్సేపు పొగిడి, ‘ఇప్పటికైనా అమెరికా వచ్చి చూపించుకోండి.’ అని ప్రతిపాదించింది.

కుమార్‍ చాలా సంతోషంగా ఉన్నాడు. ‘‘తప్పకుండా వస్తానమ్మా, ఇదివరలో ఉన్న హెల్త్ కంప్లెయింట్లు కూడా యిప్పుడు లేవు. నువ్వు రానక్కరలేదు, ఇక్కడి వ్యవహారాలు సెటిల్‍ చేసేసి, వచ్చేవారమే వస్తాను. ఆఖరి రోజులు మీ యింట్లోనే!’’ అని మాటిచ్చాడు.

తర్వాత డాక్టరుకి ఫోన్‍ చేశాడు - ‘‘వినయ్‍, నీకు థాంక్సయ్యా, నీ సలహా మేరకే మందూ మాకూ లేకుండా నెట్టుకు వచ్చేశాను. నా అఖరి సినిమా హిట్‍ అయింది. నా పంతం నెగ్గింది. ఇక తృప్తిగా పోతాను.’’ అని.

‘‘సినిమా హిట్టయిందని విన్నాను సార్‍. మీ యింటికి వచ్చి స్వయంగా అభినందనలు చెప్పాలని బయలుదేరుతున్నాను. ఇంతలో మీరే ఫోన్‍ చేశారు.’’ అన్నాడతను. వస్తూనే కుమార్‍ కాళ్లు పట్టుకుని ‘‘మీరు నన్ను క్షమించాలి.’’ అన్నాడు.

‘‘అదేమిటి!?’’

‘‘మీ పట్ల ఘోరం చేశాను. నా కూతురి కాపురం గురించి దైవసమానులైన మీకే ద్రోహం తలపెట్టాను...’’ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. కుమార్‍కు ఏమీ అర్థం కాలేదు. శాంతవచనాలతో వినయ్‍ను ఊరుకోబెట్టి, అతన్నుంచి విషయం రాబట్టాడు.

డాక్టర్‍ వినయ్‍ కూతుర్ని శివానంద్‍ కొడుక్కి యిచ్చారు. ఓ రోజు శివానంద్‍ వచ్చి ‘ఒంట్లో బాగా లేదంటూ కుమార్‍ నిన్న నీ దగ్గరకు వచ్చిన సంగతి తెలిసింది. కాన్సరని చెప్పు.’ అని ఒత్తిడి తెచ్చాడు. ఎందుకంటే అతనికి తెలుసు కుమార్‍కి ఇగో ఎక్కువని, తన ఆరోగ్యం గురించి గర్వం ఎక్కువని. ఇప్పుడిలా కాన్సర్‍ అని తెలిస్తే కృంగిపోతాడని అంచనా వేశాడు. అందుకే వియ్యంకుణ్ని బలవంత పెట్టాడు. మాట వినకపోతే కోడల్ని పంపేస్తానని బెదిరించాడు.

‘రిపోర్టులు వేరే వాళ్లకు చూపిస్తే నేను అబద్ధం చెప్పానని తెలుస్తుంది కదా’ అని వినయ్‍ వాదించాడు. ‘నీ మీద ఎంత గురో నాకు తెలుసు. ఎవరికీ చూపించకండి, అనవసరంగా కంగారు పెట్టి మీ మనసు చెదరగొడతారు అని చెప్పు. కాన్సరని తను ఎవరికీ చెప్పుకోడు. మనసులోనే కుళ్లికుళ్లి ఛస్తాడు. డిప్రెషన్‍లో పోయాడని అందరూ అనుకుంటారు తప్ప నువ్వు చెప్పినది ఎవరికీ తెలియదు.’ అని శివానంద్‍ నచ్చచెప్పాడు. గత్యంతరం లేక వినయ్‍ అలా చెప్పాడు.

 కానీ కుమార్‍ చిత్తస్థయిర్యం కోల్పోకుండా, దాన్ని ఫిలసాఫికల్‍గా తీసుకోవడంతో తన ప్లాను పారలేదని శివానంద్‍ గ్రహించాడు. అప్పుడు యింకో ఆలోచన చేశాడు. ఈ కాన్సర్‍ విషయం పదిమందికీ తెలిస్తే వాళ్లు చూపించే సానుభూతి భరించలేక, ఆభిజాత్యం దెబ్బతిని, నిస్పృహకు లోనవుతాడని, మానసికంగా దెబ్బ తింటాడని అనుకున్నాడు. తనే యీ వార్తను వెబ్‍సైట్‍కు లీక్‍ చేశాడు... 

ఇదంతా చెప్పి ‘తర్వాత జరిగిన సంఘటనలు ఆయన అస్సలు ఊహించలేదు. మీ కున్నంత గట్స్ ఎవరి కుంటాయి? మీ నిబ్బరం చూసి డిప్రెషన్‍లోకి వెళ్లిపోయాడు. తన సినిమా ఏమౌతుందోనన్న టెన్షన్‍లో తెగ తాగుతున్నాడు. వద్దని చెప్పినా వినటం లేదు...’  అన్నాడు వినయ్‍.

‘‘..అది సరే, ఇదంతా మీరు నాకు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు కుమార్‍ ఆశ్చర్యంగా.

‘‘నిన్న రాత్రి మీ అమ్మాయి ఫోన్‍ చేసింది, అమెరికా డాక్టర్లు మీ మెడికల్‍ రికార్డు పంపమన్నారంది. కాన్సర్‍ ప్రభావం చూపకపోవడం వింతగా ఉంది, ఈ మిరకిల్‍ ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్‍ చేద్దాం అన్నారట. నన్ను దగ్గరుండి మిమ్మల్ని అమెరికా తీసుకుని రమ్మనమంది.’’

‘‘ఓహో’’ అన్నాడు కుమార్‍, పరిస్థితి అర్థం చేసుకుంటూ.

‘‘..ఇక నాకు దిక్కు లేదు. మా ఆవిడతో చెప్పాను, హాస్పటల్‍ మూసేస్తానని, నాకు వైద్యుడిగా ఉండే అర్హత లేదని..! మీ ప్రాణాలతో ఆడుకున్న నన్ను క్షమించ గలిగితే క్షమించండి. మీకు వచ్చినది యిన్‍ఫెక్షన్‍ మాత్రమే. మిమ్మల్ని కంగారు పెట్టాలని దానికి కూడా మందులివ్వని దౌర్భాగ్యుణ్ని. కానీ దానంతట అదే తగ్గింది. మీకేదైనా అయి వుంటే జీవితాంతం నా కా బాధ ఉండేది. అదృష్టవశాత్తూ మీ సాహసమే మిమ్మల్ని బతికించింది, నన్ను రక్షించింది.’’

కుమార్‍ అతని కేసే చూస్తూ ఆలోచిస్తున్నాడు - మనుష్యులకు యిలాటి దుర్మార్గపు ఆలోచనలు కూడా వస్తాయా అని. రానురాను నీతి, నిబద్ధత, కృతజ్ఞత కరువై పోతున్న యీ ప్రపంచాన్ని దేవుడెలా ఉద్ధరిస్తాడా అని.

వినయ్‍ జేబులోని సెల్‍ మోగింది. అప్పటిదాకా మోకాళ్ల మీదే కూర్చున్న అతను లేచి ఆన్సర్‍ చేశాడు.

వాళ్లావిడ చెప్తోంది - ‘‘మీరు కుమార్‍ గారి దగ్గరకు వచ్చారని అమ్మాయి ద్వారా శివానంద్‍ గారికి తెలిసిందటండీ. చాలా కంగారు పడిపోయారట. ఆ కంగారులో హెమరేజి వచ్చి దబ్బున కింద పడ్డారట. తల చిట్లిందట. అల్లుడు మన హాస్పటల్‍కు తీసుకెళుతున్నాడు. మిమ్మల్ని వెంటనే అక్కడకు రమ్మన్నాడు.’’ అని.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

[email protected]