ఇదే మంచి ఛాన్స్.. మిస్ చేసుకోకు బన్నీ!

పుష్ప ప్రీ-రిలీజ్ కు సంబంధించి 2-3 రోజులుగా జరుగుతున్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముందుగా ప్రభాస్ చీఫ్ గెస్ట్ అంటూ లీకులొచ్చాయి. అలాంటిదేం లేదని స్వయంగా బన్నీ కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది. 

ప్రీ-రిలీజ్ కు స్పెషల్ గెస్టులు ఎవ్వరూ ఉండరని, బన్నీనే మెయిన్ ఎట్రాక్షన్ అంటూ కథనాలు వచ్చాయి. రాత్రి నుంచి చిరంజీవి పేరు వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది.

అందరివాడు అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. పుష్పక విమానం లాంటి చిన్న సినిమా నుంచి అఖండ లాంటి పెద్ద సినిమా వరకు ఏ సినిమా ఫంక్షన్ కు పిలిచినా వెళ్తున్నాడు. 

పుష్ప సినిమాకు ఇదో రకం ప్రచారం అనుకున్నప్పటికీ, తెరవెనక మాత్రం అందరివాడు అనిపించుకునే ఆలోచన మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తే, స్వామి కార్యం-స్వకార్యం రెండూ పూర్తవుతాయనేది కొందరి మాట.

చెప్పను బ్రదర్ నుంచి ఇప్పటివరకు..

పవన్ కల్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే విషయం తెలిసిందే. కొంతమంది దీన్ని ఖండించినప్పటికీ ఇది ఓపెన్ సీక్రెట్. ఆమధ్య బన్నీ-పవన్ కలిసి కనిపించినప్పటికీ ప్యాచప్ పూర్తిస్థాయిలో జరగలేదంటున్నారు చాలామంది. 

ఇలాంటి టైమ్ లో పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తే..? ఒకే వేదికపై పవన్ కల్యాణ్-బన్నీ కలిసి కనిపిస్తే..? కలిసి కౌగిలించుకొని ఫొటోలకు పోజులిస్తే..?

సరిగ్గా ఇదే సీన్ కోరుకుంటున్నారు చాలామంది. పవన్-బన్నీ అభిమానుల మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయ బేధాలు తొలిగిపోవాలన్నా, బన్నీ అందరివాడు అనిపించుకోవాలన్నా.. ఈ పని జరగాల్సిందే అంటున్నారు చాలామంది.

నిజానికి బన్నీకి కూడా ఇప్పుడు ఆ స్కోప్ ఉంది. ఎందుకంటే, ఓ పెద్ద హీరో, మరో పెద్ద హీరో సినిమాకు ప్రత్యేక అతిథిగా హాజరవ్వడం అనే ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. లేదంటే బాలయ్య సినిమాకు బన్నీ వెళ్లడం ఏంటి విడ్డూరం కాకపోతే. సో.. ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ పవన్ ను బన్నీ ఆహ్వానించాలని చాలామంది కోరుకుంటున్నారు. 

అదే కనుక జరిగితే పుష్ప సినిమాకు భారీ ప్రమోషన్ దక్కడం ఖాయం. సేమ్ టైమ్, బన్నీ ఆశిస్తున్న అందరివాడు ట్యాగ్ అందుకోవడం కూడా అంతే ఖాయం. నిజంగా బన్నీకి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదేమో..!